ధర్మాన్ని బోధించిన ఆదికావ్యం


Sat,April 13, 2019 12:23 AM

వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణం ధ్వని కావ్యం. కావ్యానికి ప్రాణం ధ్వని. కావ్యమంతా ధ్వన్యర్థం ఉండటమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం ఉంది. శ్రీమద్రామాయణం గొప్ప ధర్మశాస్త్రం. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీధర్మం, భాతృధర్మం, పుత్ర ధర్మం, భృత్యుధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా ఉంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధిలేకుండా, న్యాయం మీదే దృష్టినిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాల్లో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి.

Vanam-Jwala-Narasimha-rao
శ్రీసీతారామ లక్ష్మణ భరత శత్రఘ్నుల చరిత్రను, వీరు ఆచరించిన ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకు, శతకోటి గ్రంథాత్మకమైన ప్రబంధంగా, ఓ బృహత్ గ్రంథాన్ని రచించి నారదుడికి, ఇతర మహర్షులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. అంతటితో ఆగకుండా భూ లోకవాసుల కోసం శ్రీరామ భక్తుడైన వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. వాల్మీకి రచించిన రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే. వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాల్లో అగ్రస్థానంలో నిలిచింది,. శ్రీమద్రామాయణంలో నాయిక సాక్షాత్తు శ్రీదేవైన సీతాదేవి. నాయకుడు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. వీరిరువురు త్రేతాయుగంలో దుష్టశిక్షణ-శిష్టరక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించారు. ఇహ-పర సాధకంబులైన స్వధర్మాలలో, స్త్రీ ధర్మం సీతని, పురుష ధర్మం శ్రీరామచంద్రమూర్తని లోకానికి ఉపదేశించాడు వాల్మీకి.

బాలకాండలో శ్రీ మహా విష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్యకాండలో స్థితి కారణం, అరణ్యకాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధకాండలో గుణ సంపత్తి, సుందరకాండలో సర్వ సంహారశక్తి, యుద్ధకాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తరకాండలో సృష్టికి హేతువు లాం టి విషయాలను చెప్పడం జరిగింది. రామావతారం పూర్ణావతారమే. అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ప్రకృతి గుణాలు ఆయన్ను బాధించవు. రామ చంద్రమూర్తి శోకించాడని వాల్మీకి రాసిందీ అసత్యం కాదు. నిజంగానే శోకం కలిగించింది ఆయనకు. అయితే శోకం కలిగింది తనకొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలొచ్చాయని మనుష్యులు దుఃఖిస్తారు. తన కోసం, తన ఆప్తులకు దుః ఖం కలిగింది కదా అని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించింది కదా అని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానని మాత్రమే రాముడు శోకించాడు. అలానే, సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీత ను, రాక్షసుడు ఎత్తుకు పోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం కలిగిందని రామచంద్రమూర్తి దుఃఖించాడు. వియోగం వల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖిం చేవాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుః ఖించేవాడు భగవంతుడు. శ్రీరామ చరిత్ర అంటే మహా పురుష చరిత్రే. అందుకే దీనివల్ల ఎన్నో లాభాలున్నాయన్న భావన బాలకాండ మొదటి పద్యంలోనే వివరించబడింది.

శ్రీ రామాయణం, భారతం, భాగవతం అద్వితీయమైన గీర్వాణ భాషా గ్రంథాలు. ఈ మూడింటిలో ఆద్యమైంది శ్రీ రామాయణ కావ్యం. కావ్యా ల్లోకెల్లా ప్రథమంగా ఉత్పన్నమైంది కావడంతో ఆది కావ్యమైంది. రామాయణాన్ని అర్థం చేసుకోగలిగినవారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. శ్రీరామాయణం అంటే, లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడం వల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని సీతాయాశ్చరితం మహత్తు అని వెల్లడిచేశాడు. శ్రీరామచంద్రుడు మనుష్యుడి వలె నటిస్తుంటే, వాల్మీకేమో వాస్థవార్థం చెప్తూ, ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు. రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా తాను చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు వాల్మీకి. శ్రీరాముడు భగవంతుడేనన్న అర్థం, హారంలోని సూత్రం లాగా, రామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి ఉన్నది. రామాయణాన్ని చదివే వారందరు, ఈ అర్థాన్ని మనస్సులో పెట్టుకొని, ఇందులోని ప్రతి అంశాన్ని-ప్రతి వాక్యాన్ని హెచ్చరికతో శోధించాలి. ఇలా ఆసక్తిగా శోధించినవారికి-పరీక్షించినవారికి మాత్రమే, వాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది.

(ఆంధ్ర) వాల్మీకి రామాయణంలోని పాత్రలు-వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియజేసేవిగా, సందర్భోచితంగా, నాటి స్థితికి అర్హమైనవిగా ఉంటాయి. పాత్ర గుణ మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు ఆయా పాత్రల నోటినుంచి వెలువడవు. శ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదేపదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో. వాల్మీకి రామాయణమనే కలశార్ణవంలో రత్నాలను వెతికేవా రు, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానం. అది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితే, చీకట్లో తారాడినట్లే. ఒక విష యం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట చెప్పడు. కొన్ని సందర్భాల్లో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే ఉండదు. అదే విషయం మరెక్కడో సూచనప్రాయంగా ఉం డొచ్చు. ఒక్కోసారి విపులంగా విశదీకరించబడి ఉండొచ్చు. ఆయన చేసిన వర్ణనలను బట్టి, ప్రయోగించిన పదజాలాన్ని బట్టి, పాఠకులు ఊహించుకోవచ్చు.

వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణం ధ్వని కావ్యం. కావ్యానికి ప్రాణం ధ్వని. కావ్యమంతా ధ్వన్యర్థం ఉండటమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం ఉంది. శ్రీమద్రామాయణం గొప్ప ధర్మశాస్త్రం. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీధర్మం, భాతృధర్మం, పుత్ర ధర్మం, భృత్యుధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా ఉంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధిలేకుండా, న్యాయం మీదే దృష్టినిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాల్లో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల చర్యల వల్ల భాతృధర్మం, సుగ్రీవుడి చర్య ల వల్ల మిత్ర ధర్మం, హనుమంతుడి చర్యల వల్ల భృత్యు ధర్మం తెలియజే యబడ్డాయి. ఇందులోని ధర్మాలే మిగిలిన అన్ని గ్రంథాల్లోనూ కనబడుతాయి. ఇందులో లేని ధర్మాలు మరింకేదాంట్లోను కనిపించవు.

ఇలా (ఆంధ్ర) వాల్మీకి రామాయణంలో ఒకటి కాదు. వందల వేల రకాల వ్యావహారిక, ప్రాపంచిక, ధర్మ, అర్థ, కామ, మోక్ష సంబంధ విషయాలు ఉండటం వల్ల దాన్ని మించిన గ్రంథం మరోటిలేదని అంటారు.
(ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు రచించిన ఆంధ్రవాల్మీకి
రామాయణం ఆధారంగా..)

365
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles