రాజకీయ, సాహితీవేత్త బూర్గులహై

Wed,March 13, 2019 12:45 AM

burgula
దరాబాద్ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రత్యేక స్థానాన్ని పొందిన ఆ మేధావి నిజాం ఆస్థానంలో న్యాయశాఖ మంత్రిగా వచ్చిన అవకాశాన్ని తిరస్కరిం చారు. జాగీర్దార్ వ్యవస్థను రద్దుచేసి, దేశంలోనే భూ సంస్కరణలను తొలిసారిగా అమలుచేసిన ఖ్యాతిని సాధించారు. బహు భాషావేత్తగా, ఉపన్యాసకర్తగా గుర్తింపు పొందారు. కవిగా, రచయితగా, అనువాదకుడిగా రాణించారు. ఆయనే పల్లంరాజు రాంకిషన్ రావు. ఇంటిపేరుతో పాటు ఒంటిపేరు కూడా మారిపోయిన ఆ రాజకీయవేత్త, సాహిత్యమూర్తి బూర్గుల రామకృష్ణారావుగా విఖ్యాతులయ్యారు. ఆయన అసలు పేరు పల్లంరాజు రాంకిషన్‌రావు. స్వగ్రామం బూర్గుల కావడంతో ఆ ఇంటిపేరుతోనే బూర్గుల రాంకిషన్‌రావు అయ్యారు. కోస్తాంధ్ర పేర్ల ప్రభావం వల్ల రాంకిషన్‌రావు కాస్తా రామకృష్ణారావుగా మారి, బూర్గుల రామకృష్ణారావుగా యశః చంద్రికలు వెదజల్లారు. కల్వకుర్తి సమీపంలోని పడకల్ గ్రామంలో నర్సింగరావు, రంగనాయకమ్మల సంతానంగా 1899 మార్చి 13న బూర్గుల జన్మించారు. ఇంటర్మీడియ ట్ చదివేటప్పుడే మిత్రులతో కలిసి, ఒక సం ఘాన్ని స్థాపించారు. ఆ సంఘం పేరుతో గ్రం థాలయం నిర్వహించారు. చదివే అలవాటును పెం పొందింపజేసేందుకు కృషిచేశారు.

అనేక సామాజిక సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేశా రు. హైదరాబాద్‌లోని ధర్మవంత్ పాఠశాలలో విద్యాభ్యాసం తర్వాత పుణేలోని ఫెర్గ్యూసన్ కళాశాల నుంచి బీఏ (ఆనర్స్) డిగ్రీ పొందారు. ముంబైలో న్యాయవిద్యను అభ్యసించారు. హైదరాబాద్‌లో న్యాయవాది గా కొంతకాలం వృత్తి నిర్వహించారు. అనంతరకాలంలో ప్రధాని పదవి పొందిన పీవీ నర్సింహారావు దగ్గర జూనియర్ లాయర్‌గా పనిచేయడం విశేషం. మాడపాటి హనుమంతరావుతో పరిచయం బూర్గుల జీవితాన్ని మలు పు తిప్పింది. మాడపాటి ప్రభావంతో ప్రజా ఉద్యమాల్లోకి ప్రవేశించారు బూర్గుల. రాజకీయ సంస్కరణలు రావాల్సిన ఆవశ్యకతను పేర్కొంటూ మాడపాటి సహాయంతో 1921లో హైదరాబాద్‌లో ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొన్నందుకు 1942, 47 లలో రెండు పర్యాయాలు జైలు పాలయ్యారు. నిజాం ఆస్థానంలోని ప్రధాని మీర్జా ఇస్మాయిల్ న్యాయశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. కానీ ఆ పద విని తిరస్కరించి, తన మార్గం ప్రభువుల తోవకాదని, ప్రజల వెంటేనని నిరూపించుకున్నారు. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా స్వామి రామానంద తీర్థ మొదలైన వారితో కలిసి పోరాటం చేశారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన మరుసటి ఏడాది 1948లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా హైదరాబాద్‌ను సందర్శించిన కె.ఎం.మున్షీని నిజాం ఉత్తర్వులకు వ్యతిరేకంగా సందర్శించారు. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమ య్యేందుకు ఎంతగానో కృషిచేశారు.

దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభ కు అధ్యక్షుడిగా వ్యవహరించారు బూర్గుల. తెలంగాణ లో నిజాం వ్యతిరేక పోరాటంలోను, గ్రంథాలయోద్యమంలో, తెలంగాణ రైతాంగ పోరాటంలో, భూదానోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రజాకార్ల వల్ల అణిచివేతకు గురైన తెలంగాణలో స్థిరత్వాన్ని కల్పించేందుకు 1950లో పోలీస్ చర్య అనంతరం ఏర్పడిన వెల్లోడీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా, విద్యామంత్రిగా ప్రశంసనీయ భూమిక నిర్వహించారు. వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్ధత కల్పించడం వెనుక ప్రధానపాత్ర బూర్గులదే. షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, హైదరాబాద్ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తన పరిపాలనా కౌశలంతో సుస్థిరత ను ఈ ప్రాంత ప్రజలకు కానుక గా అందజేశారు. ఉర్దూ మాధ్యమంగా జరుగుతున్న చదువుల ను తెలుగు మార్గంలోకి మళ్లించడంలో ఆయన కృషి ఎనలేనిది. స్థానిక భాషలోనే విద్య ఉండాలని పట్టుబట్టి తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యం కల్పించారు. జాగీర్దార్ వ్యవస్థను రద్దుచేశారు. దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తెచ్చిన పరిపాలకుడిగా పేరు పొందారు. కౌలుదారు చట్టా న్ని రూపొందించి, పకడ్బందీగా అమలుచేశారు బూర్గుల. 1956-1960 వరకు కేరళ తొలి గవర్నర్‌గా, 1960-1962 వరకు యూపీ గవర్నర్‌గా సేవలందించారు. 1962లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1967 సెప్టెంబర్ 14న గుండెపోటుతో మరణించారు బూర్గుల రామకృష్ణారావు.

తెలుగులోనే కాకుండా కన్నడ, మరాఠీ, ఉర్దూ, ఫార్సీ, ఇంగ్లీషు, సం స్కృతం భాషల్లోనూ అనర్గళంగా ఉపన్యసిస్తారన్న పేరు బూర్గులకు ఉన్న ది. సాహితీవేత్తగా కూడా ప్రఖ్యాతి సాధించారాయన. కవిత్వంతో పాటు పలు వ్యాసాలు రచించారు. ఎన్నో గ్రంథాలను అనువదించారు. ఇమ్రో జ్ అనే పత్రికను స్థాపించారు. చదువుకునే రోజుల్లోనే ఆంగ్లంలో కవిత్వ రచన చేశారు. పారశీక వాఙ్మయ చరిత్రను రచించారు. జగద్గురు ఆది శంకరాచార్యుల విరచితమైన సౌందర్య లహరి, కనకధారాస్తవాలను తెలుగులోకి అనువదించారు. జగన్నాథ పండిత రాయల లహరీపంచకంను కూడా తెలుగులోకి తీసుకువచ్చారు. కృష్ణ శతకంతో పాటు శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకాలను వెలువరించారు. రెడ్డిరాజుల కాలంలోని మత సంస్కృతులపై సాధికారిక వ్యాసాన్ని రచించారు. సారస్వత వ్యాస ముక్తావళి పేరుతో వ్యాస సంకలనాన్ని ప్రచురణ రూపంలోకి తీసుకువచ్చారు. పండిత రాజ పంచామృ తం, వేంకటేశ్వర సుప్రభాతం మొదలైన గ్రంథాలను వెలువరించారు. తొలిచుక్క, నివేదన అనే కవితా సంపుటాలను ప్రచురించా రు. పలు గ్రంథాలకు పీఠికలను కూడా రాశారు. వానమామలై వరదాచార్యులు, కాళోజీ, దాశరథి మొదలైన ప్రముఖులతో కలిసి తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్షను ఆ రోజుల్లోనే వెలిబుచ్చారు బూర్గుల.

తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తే ఈ ప్రాంతంలో చేదు అనుభవాలను పొందవలసి వస్తుందని 1955లో నాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు యు.ఎన్.ధెబర్‌కు రాసిన లేఖలో స్పష్టం గా పేర్కొన్నారు. అనేక పదవులకు వన్నె తెచ్చారు బూర్గుల. ఖాదీ బోర్డు విచారణ సంఘం, మధ్యప్రదేశ్ రాష్ట్ర పరిశోధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్ భార త్ సేవక్ సమాజం, ప్రశాంత్ విద్వత్ పరిషత్, భారతీయ విద్యాభవన్ మొదలైన సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేశారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి అధ్యక్షుడిగా, కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగు, ఉర్దూ అకాడమీలకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. సం స్కృత పరిషత్, దక్షిణ భారత హిందీ ప్రచారసభ సంస్థలకు ఉపాధ్యక్షుడి గా ఉన్నారు. ఈ విధంగా వేర్వేరు భాషలకు సేవచేశారు. సాహిత్యరంగంలో ఆయన కృషికి గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం 1953లో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ పట్టాను అందజేసింది. 1956 లో ఆయనను ఓయూ డాక్టర్ ఆఫ్ లాస్ పట్టాతో సత్కరించింది. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలో తత్త్వశాస్త్రంలో ఉత్త మ విద్యార్థికి బూర్గుల పేరుతో స్వర్ణపతకం అందజేస్తున్నారు.
Dr-Surya-Prakash-Rao
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌లో ఉత్తమ విద్యార్థికి ఆయన పేరిట స్వర్ణపతకాన్ని బహూకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. బూర్గుల పేరుతో ప్రభుత్వ కార్యాలయాల భవనాన్ని కూడా హైదరాబాద్ లో ఏర్పాటుచేశారు. రాష్ట్ర రాజధానిలో బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద వైద్య కళాశాలను కూడా ప్రభుత్వం స్థాపించింది. రాజకీయరంగంలో, భాషా సాహిత్యాల్లో బూర్గుల సేవలు అపారం. భాషా ప్రేమికుడు, సాహితీవేత్త అయిన రాజకీయ నాయకుడిగా, మేధావిగా బూర్గుల పేరు చిరస్థాయిగా ఉంటుంది.
(నేడు బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా..)

508
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles