ఎన్నికల పొత్తులు

Fri,February 22, 2019 01:43 AM

మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లో కాంగ్రెస్, బీజేపీ స్థానిక శక్తులతో పొత్తులను ఖరారు చేసుకు న్న తీరు ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యాన్ని సూచిస్తున్నది. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రంపై దృష్టిపెట్టి గట్టి పోటీ ఇవ్వగలవు. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయడానికి ఏ మాత్రం వెనుకాడ వు. ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన ముందుకురావడం వల్ల, జాతీయపార్టీలకు గట్టిగా పట్టుపట్టే శక్తి సన్నగిల్లింది. ఉత్తరప్రదేశ్‌లోని రెండు బలమైన పార్టీలైన సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకోవడంతో అక్కడ జాతీయపార్టీల ఆశలు సన్నగిల్లాయి. తెలంగాణ, ఒడి శా, పశ్చిమబెంగాల్ వంటి రాష్ర్టాల్లో బలమైన నాయకులు జాతీయపార్టీలకు ఏ మాత్రం చోటు కల్పించరు. అందువల్ల అవకాశం ఉన్న రాష్ర్టాల్లో పొత్తులను ఖరారు చేసుకుంటున్నాయి. జార్ఖండ్‌లోని కాంగ్రెస్ పార్టీ కూటమి కట్టింది. ఇక్కడి పధ్నాలుగు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఏడింటికే పరిమితమై మిగతా సీట్లను భాగస్వామ్య పార్టీలకు వదిలేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఎక్కువ సీట్లు వదులుతామనే హామీ కూడా ఇచ్చింది. బీహార్‌లో జేడీయూ బలహీనంగానే ఉన్నది. అయినా సరే, బీజేపీ బలమైన ఆర్జేడీని ఎదుర్కోవడం కోసం జేడీయూతోపాటు రామ్‌విలా స్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)తో కలిసి పోటీచేస్తున్నది. ఎల్‌జేపీకి ఆరు సీట్లు వదులుకొని, బీజేపీ, జేడీయూ చెరి పదిహేడు స్థానాలకు పోటీచేయాలని నిర్ణయించాయి. అంటే సగానికన్నా తక్కువ సీట్లకు పోటీచేయడానికి బీజేపీ అంగీకరించింది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో గతంలో మాదిరిగా పది అకాలీదళ్‌కు ఇవ్వడానికి బీజేపీ సుముఖంగా ఉన్నది. యూపీలో పరిస్థితులు ప్రతికూలంగా మారడం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ప్రతికూల పరిస్థితులు ఉండటంతో బీజేపీ ప్రతి రాష్ట్రంలో, తాను ఎక్కువ సీట్లు తెచ్చుకోకున్నా సరే, కాంగ్రెస్ కూటమిని దెబ్బకొట్టే ఆలోచనలో ఉన్నది.

యూపీ తర్వాత అతి ఎక్కువగా మహారాష్ట్ర లో 48 లోక్‌సభ స్థానాలున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీచేసి 41 స్థానాలు గెలుచుకున్నాయి. మరొకటి కూడా మిత్రపక్షమే గెలుచుకున్నది. కాంగ్రెస్, శరద్‌పవా ర్ నాయకత్వంలోని ఎన్సీపీ కలిసి పోటీచేసి ఆరు సీట్లు మాత్రమే దక్కించుకున్నాయి. 2014లోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీ, శివసేన నాలుగూ విడిగా పోటీచేశాయి. అయితే ఎన్సీపీ నేత శరద్‌పవార్‌తో బీజేపీ పరోక్ష అవగాహన కుదుర్చుకున్నదనే అభిప్రాయం ఉన్నది. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి బలపడటం పవా ర్ ఎత్తుగడ అయితే, శివసేనను బలహీనపరుచాలనేది బీజేపీ కోరిక. ఈ ఎన్నికల్లో బీజేపీ 28 శాతం ఓట్లతో 122 సీట్లు తెచ్చుకున్నది. శివసేన 19 శాతం ఓట్లతో 63 సీట్లు తెచ్చుకున్నది. కాంగ్రెస్ 18 శాతం ఓట్లతో 42 సీట్లు, ఎన్సీపీ 17 శాతం ఓట్లతో 41 స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తం 288 స్థానాల్లో మెజార్టీ సీట్లు బీజేపీ తెచ్చుకోలేక ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన మద్దతు తీసుకున్నది. ఇప్పుడు మోదీ ప్రభంజనం లేదు. కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ శివసేనకు 48 లోక్‌సభ సీట్లలో 23 వదిలిపెట్టింది. అంటే దాదాపు సగం సీట్లు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సగం సీట్లు వదులుకోవడానికి కూడా సిద్ధపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు మాత్రమే గెలుచుకున్న శివసేనకు ఈ సారి 144 స్థానాలు వదులుకోవ డం ఆశ్చర్యకరమే. మిత్రపక్షానికి ఎన్ని సీట్లు వదిలినా సరే, కాంగ్రెస్ కూటమికి వీలైనన్ని సీట్లు తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ కూడా ఎన్సీపీతో పొత్తుకు ఉబలాటపడుతున్నది. జాతీయపార్టీలు దిగిరాకపోతే, పొత్తుపెట్టుకోవడానికి ప్రాంతీయపక్షాలు సిద్ధంగా లేవు.

జయలలిత, కరుణానిధి మరణం తర్వాత తొలిసారిగా అన్నాడీఎంకే, డీఎంకే ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ కూడా జాతీయపార్టీలు బేరసారాలు సాగించే స్థితిలో లేవు. రేపటి ఎన్నిక ల్లో అన్నాడీఎంకే ఎంతవరకు నిలబడగలదనే అనుమానాలున్నాయి. అధికారంలో ఉండటం వల్ల, కేంద్రంలోని బీజేపీ నిర్వహణ మూలంగా అన్నాడీఎంకేలోని గ్రూపులు ఒక్కటిగా ఉన్నాయి. ఎన్నికల్లో ఇదే ఐక్యత ఉండదు. దినకరన్ వర్గం కూడా ఓట్లను చీల్చగలదు. బీజేపీ ఐదు స్థానాలకు పోటీ చేస్తూ, మిగితావాటిని స్థానిక పక్షాలకు వదిలివేసింది. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే బలంగా నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 39 సీట్లలో తొమ్మిది కాంగ్రెస్‌కు వదిలిపెట్టిన స్టాలిన్ మిగితా ప్రాంతీయపక్షాలతో చర్చలు జరుపుతున్నారు. పుదుచ్చేరిలోని ఏకైక స్థానాన్ని కూడా కాంగ్రెస్‌కు వదిలిపెట్టారు. కాంగ్రెస్ ఇంకా ఎక్కువే కోరింది కానీ, అంతకుమించి ఒక్క సీటు కూడా తగ్గబోమని డీఎంకే స్పష్టంచేసింది. బీజేపీ తన బలాబలాలను అంచనా వేసుకొని స్థిరమైన వ్యూహంతో అడుగులు వేస్తున్నది. అయితే కాంగ్రెస్‌లో అంతటి రాజనీతి కనిపించడంలేదు. ప్రియాంకను బీజేపీ బలంగా ఉన్న రాష్ర్టాల్లో కాకుండా యూపీలో దిం పడం ఇందుకు ఉదాహరణ. ఈశాన్యంలోని 8 రాష్ర్టాల్లో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇటీవల పౌరసత్వ బిల్లు మూలంగా ఈశాన్యరాష్ర్టాల్లో బీజేపీ వ్యతిరేకత ప్రబలింది. కానీ ఆ పరిస్థితిని కాం గ్రెస్ ఉపయోగించుకోలేకపోయింది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. జాతీయపార్టీలు ఎంత ప్రయత్నించినా దేశవ్యాప్తంగా ప్రాంతీయశక్తులు బలోపేతమవుతున్న పోకడ కాదనలేనిది.

230
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles