చంద్రబాబు చమత్కారాలు


Thu,February 21, 2019 03:37 AM

చంద్రబాబు కపట వాదనలతో ఇక్కడ ప్రజలను తప్పుదారి పట్టించి ఓట్లు సంపాదించేందుకు, జాతీయస్థాయిలో రాజకీయ పలుకుబడి కోసం ప్రయత్నిస్తున్నా రు. వాస్తవాలు ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి గుణకారం, భాగహారంతో పాటు లెక్కలన్నీ తెలియకపోవచ్చు. కాని, విషయాలు గత నాలుగేండ్లుగా ఎప్పటికప్పుడు తెలుస్తున్నందున, వాటి పై చర్చలు కూడా జరుగుతున్న స్థితిలో ప్రజలు చంద్రబాబు ఆశించినం త అంధకారంలో కూడా లేరు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రతిష్ఠ మరీ ముఖ్యంగా గత ఆరు మాసాలుగా బాగా దెబ్బతింటుండటం ఇందుకు నిదర్శనం. అందువల్లనే ఆయన తన పోయిన ప్రతిష్ఠను పూడ్చుకునేందుకు చేతికి ఎముక లేని దానకర్ణుని వలె ప్రజలకు వరాల యజ్ఞం ప్రారంభించారు. అందువల్ల తను కోరుకునే ఫలితాలు రాగలవో లేదో మనకు తెలియదు. కానీ తన పరిస్థితికి ఇది అద్దం పడుతున్నది. మరొకవైపు, జాతీయస్థాయిలో చంద్రబాబు చేస్తున్న హడావుడి కన్పిస్తున్నదే. గతం లో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కాలపు తన సంబంధాలను ఉపయోగించుకుని వర్తమాన రాజకీయాలలో లబ్ధి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. తను మధ్యలో అన్ని ఫ్రంట్‌లను వదిలివేసి బీజేపీతో చెలిమి చేయటం ఇతర పార్టీల నాయకులు మరువలేరు. అదేవిధంగా ఏపీకి కేంద్రం అసలు ఏమైనా చేసిందా లేదా చంద్రబాబు అంటున్నట్లు అంతా శూన్యమా అనేది తెలుసుకోలేని స్థితిలో ఆ నాయకులు గాని, ఢిల్లీ మీడియావారు గాని లేరు. కాని అక్కడి పార్టీల వారు కూడా చంద్రబాబు వలెనే రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య దోబూచులు ఆడినవారే గనుక ఇదంతా ఎవరు దొంగ-ఎవరు దొర అన్నట్లు గాక అందరం దొంగలమే-అందరం దొరలమే తరహా క్రీడ అన్నమాట.

దీనంతటి మధ్య చంద్రబాబును ఎవరూ నిజంగా నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఒకానొక క్రీడ నడుస్తున్నది అంతే. దానినట్లుంచితే, పైన అనుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేం ద్ర ప్రభుత్వం విభజన హామీ ప్రకారం అసలేమీ చేయటం లేదని, తమ ను పూర్తిగా మోసం చేశారని, ఈ రెండు నెలల కాలంలో కొన్ని వందల సార్లు అమరావతిలో, ఢిల్లీలో, దేశంలోని ఇతర నగరాలలో దేశానికి చాటిచెప్పి ఉంటారు. కాని ఆయన స్వయంగా విడుదల చేసిన 10 శ్వేత ప్రతాలలో మొదటి దానిని గమనించండి. దాని శీర్షిక: విభజన గాయం: అమలుకాని చట్టాలు... నెరవేరని హామీలు! అందులో ఎక్కడ కూడా కేంద్రం అసలేమీ చేయలేదని, రాష్ర్టాన్ని మోసం చేసింది అని ప్రకటించకపోవటం గమనించదగ్గది. రెవెన్యూ లోటు నుంచి... వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం దాకా.. విద్యా సంస్థల నుంచి పోలవరం వరకు.. కేంద్ర సంస్థల నుంచి రాజధాని దాకా.. కొన్నింటికి అరకొర సాయం అందితే మరికొన్నింటికి అసలే సాయం అందలేదు. విభజన చట్టంలో మొత్తం 14 అంశాలకు గానూ ఒక్కదానినీ కేంద్రం పూర్తిగా అమలుచేయలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు, జాతీయ విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పన్ను ప్రోత్సాహకాలు, రాజధానికి ఆర్థిక మద్దతు వంటి అంశాలు పాక్షికంగా అమలయ్యాయి, అని వివరించారు. దీనిని జాగ్రత్తగా చదివితే అర్థమయ్యేదేమిటి? ఇటువంటి కీలకమైన అభివృద్ధి అంశాలన్నీ అమలవుతున్నాయి గాని ఇంకాపూర్తి కాలేదని. కానీ ఇందులోనూ తిరిగి శ్వేతపత్రాన్నే చూసి అర్థం చేసుకోగల విషయాలు కొన్నున్నాయి. దానిని బట్టి చూసినప్పుడు పాక్షిక అమలు అనే మాటకు అర్థం లేదు. స్వయంగా శ్వేత పత్రం ప్రస్తావించిన మొదటి అంశం పోలవరం ప్రాజెక్టు.

ఈ ప్రాజెక్టుపై జనవరి 15 వరకు వెచ్చించిన మొత్తం రూ.10,069 కోట్లు కాగ, కేంద్ర విడుదల చేసింది రూ.6727 కోట్లు. ఇంకా రావలసింది రూ.3342 కోట్లు. దీని అర్థం కేంద్రం చేసింది శూన్యం అవుతుందా? ఎప్పుడైనా భారీ ఖర్చులుండే భారీ ప్రాజెక్టులకు ఖర్చులు-విడుదలలు ఒక క్రమంలో జరుగుతూ పోతుంటాయని అందరికీ తెలిసిందే. చంద్రబాబు తమ కాంట్రాక్టర్లకు కూడా అదే పద్ధతిలో విడుదల చేస్తుంటారు. ఆయనే కాదు, ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది. అటువంటప్పుడు చంద్రబాబు ఫిర్యాదు దేని గురించి? ఇక్కడ మరొక విషయం ఉంది. పోలవరానికి గత నాలుగు నెలలుగా ఒక్క రూపాయీ విడుదల చేయలేదు అని ఒక మాట శ్వేతపత్రంలో ఉంది. ఎందువల్ల చేయలేదు? ఇది నిజంగా శ్వేతపత్రమైతే చంద్రబాబు ప్రభుత్వం ఆ వివరాలను చేర్చవలసింది. విడుదల చేసిన డబ్బుకు అయిన ఖర్చులపై బిల్లులను, యుటిలిటీ సర్టిఫికెట్లను అడుగటం వ్యవస్థ పద్ధతి లో భాగం. కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరు పాలిస్తున్నారనే దానితో అందుకు నిమిత్తం లేదు. తమ నిధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం గురించి కేంద్రం ఎప్పటినుంచో అడుగుతున్నది. దానిపై రెండు వైపుల వాదనలు నడుస్తున్నాయి గాని సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. నిన్నటివరకు తాము బీజేపీ మిత్రులు గనుక అనామతు లెక్కలు ఏవో చెప్పి దాటవేయవచ్చునని చంద్రబాబు నమ్మారు. అది వీలు కాలేదు.లెక్కలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు వాదించారు కూడా ఇన్నాళ్లు. కాని అది సాగదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారు పట్టుకుంటారనే భయం కేంద్రానికీ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబుకు కేంద్రంతో చెడిన తర్వాత, లెక్కలు అడుగుతున్నారు. ఇస్తాం.

మేము కట్టే పన్నులకు కేంద్రం నుంచి లెక్కలు అడుగుతున్నామా? అంటూ ఆశ్చర్యకరంగా మాట్లాడారు ఆయన. పన్నులకు లెక్క అడిగే పద్ధతంటూ అసలు లేదు గనుక, కేంద్రం ఇచ్చే నిధులకు లెక్క అడుగరాదన్నది చంద్రబాబు ఉద్దేశమనుకోవాలా? అదట్లా ఉంచి, లెక్కలు ఇచ్చేసామని ఇంతకాలం అన్న ఆయన, ఇస్తాం అని ఇప్పుడు అనడమంటే ఇంతవరకు ఇవ్వలేదనే కదా. బహుశా ఆవేశంలో మాట్లాడుతూ నోరుజారి ఆ మాట ఒప్పుకుని ఉంటారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున ఖర్చు భారం, నిర్మాణ భారం పూర్తిగా కేంద్రానిది కావాలి. కాని చంద్రబాబు ఖర్చుమీది, నిర్మా ణం పని మాది అని చెప్పి ఆ పని తీసుకున్నారు. నిర్మాణంలో అవినీతి భారీగా జరుగుతున్నదనే ఆరోపణలున్నాయి. కేంద్రం లెక్కలు అడుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పనిచేయకుండా విమర్శలు చేస్తూ, ఆ మాటున లెక్కల బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నదనే అనుమా నం కలుగుతున్నది. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారానికి వచ్చి, తమను లెక్కలు అడుగరాదన్నది చంద్రబాబు ఆశాభావమేమో తెలియ దు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే నిజంగానే లెక్కలు అడుగరేమో కూడా తెలియదు. ఇంతకూ దీనంతటి మధ్య, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం విభజన చట్టంలోని అంశాల విషయమై మోసం చేయటం ఏమిటో, అంతా శూన్యం కావటం ఏమిటో బోధపడదు. పోలవరం గురించి చర్చించింది ఒక అంశం మాత్రమే. విభజన హామీలకు సంబంధించి శ్వేతపత్రంలో ఇంకా అనేకం ఉన్నాయి. వీటిలో ఒక్కదాని గురించి అయినా చంద్రబాబు ప్రభుత్వం నిజాయితీగా మాట్లాడిందా అనే సందేహం కలుగుతున్నది. వాస్తవానికి విభజన చట్టం లో కొన్ని అంశాలకు సంబంధించి సాధ్యాసాధ్యాల పరిశీలనఅనే మాట ఉంది. అనగా, అన్నిరకాల పరిశీలనలు జరిపి, సాధ్యమైతే అమలు జరుపుతాం, లేనట్లయితే లేదు అని అర్థం.
Ashok
ఉదాహరణకు విశాఖపట్నం రైల్వేజోన్ ఏర్పాటు గురించి సాధ్యాసాధ్యాల పరిశీలన జరుపుతామన్నారా లేక ఏర్పాటు చేస్తాం అన్నారా? శ్వేతపత్రంలో ఏమీ చెప్పనిది ఎం దుకు? విశాఖ జోన్ వద్దనటం లేదు. కాని దేనిగురించి అయినా వాస్తవాలు యథాతథంగా చెప్పి, తర్వాత దానికోసం డిమాండ్ చేయాలి. కేంద్రాన్ని నిందించేవి, శ్వేతపత్రాలలో ప్రస్తావించినవి అనేక విధాలుగా ఉన్నాయి. వాటిలో ఒకటి తెలంగాణతో నిమిత్తం గలవి. ఉదాహరణకు 9-10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన, ఆస్తులూ, అప్పుల విభజన నేటికీ జరుగలేదని కేంద్రాన్ని నిందించారు. ఇది జరుగక తెలంగాణ తో వివాదం కొనసాగటానికి బాధ్యత తమది కాదా? కనీసం తమ బాధ్యత కూడా కొంత ఉందా లేదా? ఆ వివరాలు ఏమీ లేనిది శ్వేత పత్రం ఎట్లా అవుతుంది. చంద్రబాబు గత అయిదేండ్ల వైఖరులను, తర్వాత శ్వేత పత్రాలను, ఇప్పుడు రానున్న ఎన్నికల దృష్ట్యా చేస్తున్న వాదనలను గమనించినప్పుడు, ఆయన శ్వేతపత్రాలను మరింత శ్వేతం గా మార్చగల వాస్తవాలు అనేకం ఉన్నాయనిపిస్తుంది. నిజాలు ఒకటి కాగా అందుకు విరుద్ధమైన వాదనలను మహా బలంగా, గోబెల్స్ వలె పదేపదే చేయగల భారత దేశపు రాజకీయ నాయకులలో చంద్రబాబు ఒకరు. తెలంగాణకు అనుకూలంగా ఒకరోజు లేఖ ఇచ్చి, తెలంగాణ వద్దంటూ చివరిలో దేశమంతటా తిరిగి లాబీయింగ్ చేసి, తెలంగాణ ఏర్పడినాక దానిని బ్లాక్ డే అనటం వంటి సమర్థత గల వ్యక్తి నిఘంటువులో శ్వేతపత్రం అనే మాటకు చోటుందా?

997
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles