ప్రాథమిక విద్యతోనే భాషాసంరక్షణ


Thu,February 21, 2019 01:14 AM

భావవ్యక్తీకరణకు భాష ప్రాథమిక సాధనం. మాతృభాషల ద్వారా ప్రజలు తమ భావాలను వ్యక్తపరుస్తుంటారు. తొలి మానవుడు తన అవసరాలను బట్టి భావాలను శబ్దో చ్చరణల ద్వారా వ్యక్తీకరించి ఉండవచ్చు. మనిషి పరిపూర్ణుడై పాలనావ సరాలు (గ్లోబల్ ఫ్యామిలీ నినాదం) విస్తృతపరిచే క్రమంలో స్థానిక ప్రజా సమూహాలు మాట్ల్లాడే భాషలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడి ప్రపంచ వ్యాప్తంగా ఆదిమ జాతులు మాట్లాడే భాషలపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, ఆ భాషల పుట్టుకకు మూలాలైన ఆదిమ జాతులు (ఆదివాసులు) మాట్లాడే భాషల అస్తిత్వ, మనుగడలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2019 సంవత్సరాన్ని ప్రపంచ ఆది జాతుల భాషా సంవత్సరం (ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండీజినస్ లాంగ్వేజెస్-2019)గా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో ప్రకటిం చింది. యునెస్కో అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 241 దేశాలు/ ప్రాదేశిక ప్రాంతాలు ఉంటే 7,106 వాడుక భాషలు ఉన్నట్టు అంచనా. అయితే 90 దేశాల్లో 370 మిలియన్ల జనాభా కలిగిన ఆదిమ జాతులు సుమారుగా 7 వేల భాషలు మాతృభాషలుగా మాట్లాడుతున్నారని మాన వజాతి శాస్త్రం వెల్లడిస్తున్నది. ఇందులో 2,680 ఆదివాసులు మాట్లాడే భాషలు అంతరించిపోతున్న దశలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా విశ్వవ్యాప్తంగా వెయ్యి మందికి మించి మాట్లాడే ప్రజలు లేకపోవడంతో మూడో వంతు భాషలు ప్రమాదంలో పడ్డాయనీ, ప్రపంచ జనాభాలో సగభాగం కేవలం 23 భాషలు మాత్రమే మాట్లాడుతున్నట్లు తెలిపింది.

ఇది భాషకు మాత్రమే కాదు, మానవాళి వినాశనానికి హెచ్చరికగా యునెస్కో హెచ్చరించింది. దేశంలో 700 ఆదిమజాతులు, 104 మిలియన్ల జనాభా కలిగి 1635 స్థానిక భాషలు మాట్లాడుతు న్నారు. అయితే 500 తెగలు మాత్రమే ఉనికిలో ఉండగా, 197 భాషలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం ప్రాధాన్య క్రమంలో ప్రాచుర్యంలో ఉన్న తెలుగు (మాతృభాష), హిందీ (ద్వితీయ), ఇంగ్లీష్ (తృతీయ) (ఆయా రాష్ర్టాల్లో మాతృభాష మారుతుం ది) భాషలు అమల్లో, వినియోగంలో ఉన్నాయి. ఈశాన్య రాష్ర్టాల్లో ప్రాథమిక విద్యను ఆదివాసీ మాతృభాషల ద్వారా అందిస్తూ ఇంగ్లీష్‌ను ప్రధాన భాషగా చేశారు. కానీ దక్షిణ, మధ్య భారత రాష్ర్టాల్లో.. మధ్యప్ర దేశ్‌లో మరాఠీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో తెలుగు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో హిందీ, ఒరిస్సాలో ఒడియా, తమిళనాడులో తమిళం మొదలైన భాషలు మాతృభాషలుగా నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సంతాల్, గోండి, సవర, కోయ వంటివి ప్రాచీన భాషలే అయి నప్పటికీ విద్య రూపంలో అందించే ప్రయత్నం జరుగనందున, పాల నావసరాలకు మన మాతృభా షగా ప్రాధాన్యం లేకపోవడం, వలస భాషల ఒత్తిడి పెరిగి ఆయా భాషల ఉనికి తగ్గుతూ వచ్చింది. తెలుగు రాష్ర్టాల్లో కొలాం (కొలామీ), సవర (సవర), జాతాపు (జాతాపు), కొండ భాష (కొండ దొర), కుఁవి (కోందు), కొండరెడ్డి వంటి చిన్నచిన్న సమూహాలు మాట్లాడే భాషలే కాకుండా చెప్పుకోదగ్గ జన బాహుళ్యం ఉండి గుర్తింపులేక గోండి వంటి ప్రాచీన భాషలు కూడా తమ పూర్వవైభవాన్ని కోల్పోతున్న పరిస్థితి దాపురించింది.

ఈ పరిణామాలు ఆదిమజాతుల మనుగడకు, మానవాళి వినాశనానికి హెచ్చరికలుగా పసిగట్టిన యునెస్కో 2019 సంవత్సరాన్ని అంతర్జాతీయ ఆదివాసీ భాషా సంవత్సరంగా ఫిబ్రవరి 21ని అంతర్జాతీ య మాతృభాష దినంగాను ప్రకటించి ఆదిమజాతుల భాషాజ్ఞానాన్ని, సాంస్కృతిక విలువలను పరిరక్షించుకోవడం మానవాళి కర్తవ్యమని చాటిచెప్పింది. ఈ ప్రకటన ద్వారా ఆదివాసీ సమూహాల మనుగడతో పాటు వారి భాషా సంస్కృతులను సజీవంగా ఉంచాల్సిన బాధ్యతను ప్రపంచానికి గుర్తుచేసింది. భాషల పరిరక్షణకు యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు తీసుకున్న చొరవ స్థానిక ప్రభుత్వాలు తీసుకున్న దాఖలాల్లేవు. పైగా వలస, ఆధి పత్య భాషలను రుద్దే ప్రయత్నమే ఎక్కువ జరిగింది, జరుగుతున్నది. 1997-98 మధ్య యునెస్కో సహకారంతో ఐపాడ్ నిధులు వెచ్చించి ప్రాథమిక విద్యను ఆనంద లహరి (జోయ్‌పుల్ లర్నింగ్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది మాతృభాష వికాస కార్యక్రమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్ని ఐటీడీఏలకు మూడువేల కోట్ల నిధులు వెచ్చించింది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రత్యేక మాతృభాషలు కలిగి ఉన్న ఆదిమజాతుల బాల బాలికలకు మాతృభాషల ద్వారా ప్రాథమిక విద్య బోధన అందించాలని సంకల్పించింది. ఉద్దేశం మం చిదే అయినప్పటికీ, దీర్ఘకాలం కొనసాగించకుండా మూడేండ్లకే దుకాణం మూసేసి కోట్లాది రూపాయల నిధులు పోలవరం ప్రాజెక్టుకు మళ్లించారు. ప్రస్తుతం ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు కూడా ఆదివాసీల సంక్షేమానికి ఖర్చుపె ట్టకుండా ఆర్టీసీ బస్సులు కొనడానికి, విశాఖపట్నం వంటి సుందర నగరాల కు ైఫ్లె ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు, తప్పితే తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న ఆదిమజాతుల భాషా సంస్కృతుల పరిరక్షణకు ఇసుమంతైనా శ్రద్ధ చూపడం లేదు.
rama-rao
ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే భాషా మాండరీన్ చైనీస్ అయినా కర్ర పెత్తనం చెలాయించేది మాత్రం ఇంగ్లీషే! మన దేశం విషయానికొస్తే సంతాల్ తెగ ప్రత్యేక మాతృ భాషను కలిగి మధ్య భారతంతో పాటు దక్షి ణాది రాష్ర్టాల వరకు విస్తరించి న్నప్పటికీ గుర్తింపునివ్వలేదు. ఇదేవిధంగా గోండి, కోయ, సవర వంటి పలు భాషలు సమ ప్రాధాన్యం కలిగినవే. అమెరికాలో కొలంబస్ అడుగుపెట్టక ముందు అక్కడ రెడ్ ఇండియన్స్ గా పిలువబడే స్థానిక ఆదిమజాతులు ప్రత్యేక భాషా సంస్కృతులు కలిగి ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి దేశాల్లో తమ వ్యాపార సామ్రా జ్యాన్ని విస్తరించుకోవడానికి ఇంగ్లండ్ నుంచి బ్రిటిషు వారు ప్రవే శించిన తర్వాతే అక్కడి ఆదిమభాషలు, సాంస్కృతిక వారసత్వ విలువల అస్తిత్వ మూలాలకు ముప్పు ప్రారంభమైంది. భాష అనే భావన అంతరిస్తే భావ వ్యక్తీకరణ స్వరూపం మారిపోతుం ది. భావవ్యక్తీకరణ రూపం మారితే మనిషి గుర్తింపు కూడా మారిపోతుం ది. భాష అనేది మనిషి స్వరపేటికల నుంచి వచ్చే శబ్దం మాత్రమే కాదు. అది జాతుల గుర్తింపునకు మూలమైంది. అందుకే భౌగోళికంగా వ్యాప్తి చెంది ఉన్న ఏ రెండు మూలజాతులు ఒకే భాష కలిగి ఉన్న దాఖలాల్లేవు. గోండు, కోయ తెగలు ఒకే సంతతికి చెందినవైనప్పటికీ భౌగోళికంగా విడి పోయి ఉండటంతో వారు మాట్లాడే గోండి భాషా ఉచ్చారణల్లో తేడాలు ఉన్నట్ట్టు స్పష్టమవుతున్నది. మానవుని పుట్టుకకు మూలవాసే అంకురా ర్పన అని ఒప్పుకొంటే, అన్ని భాషలకు తొలి భాష ఆదిమ భాషలే అవు తాయి. మాతృభాషల ద్వారా విద్యాబోధన ప్రవేశపెట్టి భాషలు, సంస్కృ తిక విలువలను అందులో నిక్షిప్తమైన వైవిధ్యాన్ని కాపాడేందుకు పూను కోవాల్సిన అవసరం ఉన్నది.
(నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)

782
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles