రికార్డు చేయాల్సిన జీవితాలు


Sun,February 10, 2019 01:14 AM

గత వందేండ్లుగా ఎన్నో ఉద్యమాలు చేశాం. ఉద్యమాల చరిత్ర కొంత రికార్డ యింది. కానీ, ప్రజల చరిత్ర, జీవితం, సంస్కృతులను రికార్డు చేయలేకపోతు న్నాం. తెలంగాణ సమకాలీన చరిత్ర, ఉద్యమాలు, సం స్కృతి, మలి తెలంగాణ ఉద్యమం, జీవితాల్లో భాగం గా రికార్డు చేయలేకపోతున్నాం. కథలు, నవలలు, పాటలు, సినిమాలు, ప్రదర్శనలు వేరు. జీవిత చరిత్ర లు, స్వీయ చరిత్రలు వేరు. ఇప్పుడు జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు రాయాల్సిన కాలం. మహారాష్ట్రలో దళిత పాంథర్స్ ఉద్యమంలో 60,70కి పైగా స్వీయ చరిత్రలు వెలువడ్డాయి. మలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు జిల్లాకు కనీసం 30 మంది రాసినా, 31 జిల్లాల నుంచి వెయ్యికి పైగా స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు సంక్షిప్తంగానైనా, విస్తారంగానైనా రావాల్సిన అవసరం ఉన్నది. అది ప్రజల చరిత్ర ను తెలుపుతుంది. స్వీయచరిత్రలు ఒక ప్రత్యేక ప్రక్రియ. జీవితం గురించి స్వీయచరిత్రలు జీవిత చరిత్రలు అని రెండు విధాలు. స్వీయ చరిత్రలు స్వయంగా రాసేవి. రాసేవారికి చెప్పి ఉత్తమ పురుషలో రాయించేవి కూడా ఉంటాయి. జీవితచరిత్రలు ఇతరులు రాసేవి. స్వీయ చరిత్రలను నవలగా కూడా కొందరు రాస్తారు. రామాయణం, రాముడి జీవిత చరిత్ర. సింధుబాద్ సాహస యాత్రలు, యాత్ర చరిత్ర. ఫాహియాన్, హ్యుయన్‌త్సాంగ్, ఇట్సింగ్, రాహుల్ సాంకృత్యాయన్, ఏనుగు లక్ష్మణ్ స్వామి యాత్ర చరిత్రలు చరిత్రను తెలుపుతాయి. స్వీయచరిత్రలు, జీవిత చరిత్రలు, యాత్ర చరిత్రలు, గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథాలుగా స్ఫూర్తినిస్తాయి. మనం రికా ర్డ్ చేస్తేనే రేపటి చరిత్రకు ఆనవాళ్లు దొరుకుతాయి. ఆచార్య నాగార్జునుడు, శాతవాహన రాజుకు రాసిన సుహృల్లేఖ నాటి చరిత్రను, సంబంధాలను తెలుపుతుంది. మాజీ ప్రధాని పి.వి.నర్సింహారావు ఇన్‌సైడర్ (లోపలి మని షి) అనే స్వీయ చరిత్రను, ఎడ్మెసెస్ స్మెడ్లీ స్వీయచరిత్ర, భూమి పత్రిక నవల రూపంలో రాశారు.

శ్రీశ్రీ తన ఆత్మకథను చరిత్రాత్మక కథా నవల అన్నారు. కొందరు, రోజువారీ డైరీ రాతల నుంచి ముఖ్యాంశాలను ఎంపిక చేసి స్వీయచరిత్రగా రాశారు. స్వీయచరిత్ర అనే ప్రక్రియ నవల కన్నా భిన్నమైంది. వ్యాసరచన కన్నా భిన్నమైనది. ప్రసంగం కన్నా ప్రత్యేకమైంది. చరిత్రకన్నా నిర్దిష్టమైనది, విస్తారమైనది. వ్యక్తిగత జీవితం కేంద్రంగా మొత్తం సమాజ పరిణామాలు, మానవీయ సంబంధాలు, స్నేహాలు, చరిత్ర, పరిణామాలు, సమకాలీన చరిత్ర, పండుగలు, పబ్బాలు, సంస్కృతి, నాటి విద్యావ్యవస్థ, ఉద్యమాలు, వైద్య విధానాలు, ఉద్యోగ వ్యవస్థ, రాజకీయాలు, స్వీయ రచనలు, వారి స్ఫూర్తిదాతలు, సమకాలీకులు, నేపథ్యం, ప్రేరణ, సమాజంపై ప్రభావం. స్వీయచరిత్రలో రికార్డవుతుంటాయి. స్ఫూర్తిదాతలు, మార్గదర్శులు, గురువులు, శిష్యులు, మిత్రులు, భార్యాపిల్లలు, బంధుమిత్రులు, కష్టాలు, ఆనందాలు మొదలైన సమస్త విషయాలు ఒకే ప్రక్రియలో చెప్పగలిగే అవకాశం స్వీయచరిత్రలో, జీవిత చరిత్రలో మాత్రమే ఉంటుంది. అలా అపూర్వ జీవిత చరిత్రలు రాసి, చరిత్రలో రికార్డు కాని అనేక విశేషాలను స్వీయచరిత్రలో, జీవిత చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా నిక్షిప్తం చేస్తూ వస్తున్నారు. కొం దరు ఒకే స్వీయచరిత్రలో ఇమడక రెండు వేర్వేరు స్వీయ చరిత్రలను రాసుకున్నారు. వైవిధ్యం, మలుపులు, విస్తారమైన పరిణామాలున్నప్పుడు అది అనివార్యమవుతుంది. మనం రాయాలి. ఎవరి చరిత్ర వారు, ఎవరి జీవితం వారు రాసుకోవా లి. డైరీలు రాయాలి. కనీసం వారానికి ఒకసారైనా డైరీలో రికార్డు చేసుకోవాలి. పదేండ్లకోసారి డైరీల్లోంచి, జ్ఞాపకాల్లోంచి తమ స్వీయ చరిత్రను, జీవిత చరిత్రను రాయాలి. తద్వారా నూతన మలుపులతో జీవితం అభివృ ద్ధిపథంలో ముందుకుసాగుతుంది. వ్యక్తిత్వ వికాస గ్రంథాలుగా మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్, బి.పి.మండల్, లోహియా, గాంధీ, నెహ్రూ జీవితచరిత్రలు గొప్ప స్ఫూర్తినిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతాయి. ఉద్యమాలు, పార్టీలు, భావాలు, ఎప్పటికప్పుడు మారినవారు అందుకు కారణాలు స్వీయచరిత్రలో రికార్డు చేస్తుంటారు.

తద్వారా పాఠకులకు అనే క విషయాలు బోధపడి వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. 1920ల లోని గదర్ పార్టీ ఉద్యమ నాయకుడైన దర్శి చెంచయ్య రాసి న నేను-నాదేశం స్వీయచరిత్ర ఒక మార్గదర్శకం అని చాలామంది అభిప్రాయం. హిందీ దళిత రచయిత నైమిష్ రాయ్ ఆత్మకథ కూడా చూశాను. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి స్వీయచరిత్ర, పద్యాల్లో రాసిన జాషువా నా కథ, శ్రీశ్రీ అనంతం, వచన కవిత్వంలో రాసిన శీలా వీర్రాజు స్వీయచరిత్ర, గాంధీ సత్యశోధన, అంబేద్కర్ జీవితచరిత్ర మొదలైన వైవి ధ్యపూరితమైన స్వీయచరిత్ర, జీవిత చరిత్రలెన్నో! గాం ధీజీ సత్యశోధన, దర్శి చెంచయ్య నేనునాదేశం, బిట్ల నారాయణ నా అంతరంగ తరంగాలు తిరుమలరామచంద్ర హంపి నుండి హరప్పాదాకా, దాశరథి రం గాచార్య, జీవనయానం, ఆత్మకథలు మహోన్నతమైన వి. ఇవి సమకాలీన సమాజం, కుటుంబం, రచన నేప థ్యం మేలవించి నవల వలె తీర్చిదిద్దారు. అమెరికా సైన్యాధ్యక్షుడు జమైకా నుంచి వచ్చి స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును ఆరు వందల పేజీల ఆత్మకథగా చక్కగా రాశారు. వరంగల్‌లో రవి వర్మ ఫొటోస్టూడియోతో సుప్రసిద్ధుడైన పెయింటింగ్ ఆర్టిస్ట్ స్వాతంత్య్ర సమరయోధుడు బిట్ల నారాయణ 11 వందల పేజీలు ఆత్మకథ రాశారు. దాన్ని వంగా నర్సయ్య ఎడిట్ చేసి 2 వందల పేజీల పుస్తకంగా ప్రచురించారు. ఆ స్వీయచరిత్రలో నైజాం రాజ్యంలోని అనేక ఉద్యమాలు, నాయకులు, పరిణామాలు నాటి సమకాలిక సమాజం, సంస్కృతి తెలంగాణ ఉద్యమాల గురించి ఉద్యమ నవలల్లో రాని, వాటిలో రికార్డు కాని అనేక సామాజిక పరిణామాలు ఈ స్వీయచరిత్రలో గమనించవచ్చు. నవల కన్నా గొప్పగా, చరిత్ర కన్నా గొప్పగా రాసిన ఆత్మీయ ఆత్మకథ ఎం తో పఠనీయంగా ఉన్నది. ఆయన మరణానంతరం 2004లో విశాల సాహి తీ పురస్కారం ఇచ్చి బంధు, మిత్రులను సత్కరించడం జరిగింది.

అధికారంలో ఉన్నప్పుడు, స్వీయచరిత్రలో కూడా రాజీ పడాల్సినవి ఉంటాయి. సౌమ్యంగా చెప్పాల్సినవి ఉంటాయి. సంఘర్షణకు దారితీసే అంశాలను సున్నితంగా చెప్పడమో, వదిలేయడమో జరుగవచ్చు. ఇలా స్వీయచరిత్ర రచన సున్నితమైనది. కొన్నిసార్లు సత్యం పలుకరాదు. అప్రి య సత్యాలు చెప్పలేరు. అలా అని అబద్ధం చెప్పరాదు. అందుకని కొన్ని విషయాలను వదిలేస్తుంటారు. స్వీయచరిత్రలో తనను తాను ఎలా ఊహించుకుంటున్నారో తెలుస్తుంది. చదివేవారికి ఆత్మీయులవుతారు. రాసిన వారి హృదయం దగ్గరవుతుంది. ఎలా ఉన్నారో కాకుండా ఎలా ఉండదల్చుకున్నారో ఆత్మకథ రచన ద్వారా సమీక్షించుకున్నట్లవుతుంది. సమాజంలో సామాన్యులు ఓటరుగా, అంకెలుగా, పౌరుడిగా మిగిలిపోవచ్చు. కానీ, స్వీయచరిత్ర రాసుకుంటే తనకుతానే హీరో అవుతారు. స్వీయచరిత్రలో గొప్పలు చెప్పుకోవచ్చు. గప్పాలు కొట్టుకోవచ్చు. తెలిసిన వారు నవ్వుకుంటారు. తెలియనివారు నిజమని నమ్ముతారు. సంఘర్షణ కు, కోట్లాటలకు దారితీసే సందర్భాలను, గడిచిపోయిన అంశాలను సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. తద్వారా మానవ సంబంధాలు మెరుగుపడుతాయి. ఆ పని చేయకపోతే కొందరు శత్రువులుగా మారవచ్చు. ఇతరులను కించపరిచే విధంగా ఉంటే యుద్ధం జరుగవచ్చు. జాతీయోద్యమకాలంలో గదర్ పార్టీ తదితర రహస్య ఉద్యమాలు చేసిన ఉద్యమకారుల చరిత్రను నవలలుగా రాశారు. నవలలు చదివిన తర్వాత బాధ కలిగింది. చారిత్రక పాత్రల, మహాపురుషుల స్థానంలో కల్పిత పాత్రలను ప్రవేశపెట్టి చారిత్రక వ్యక్తులు అనామకులు కావడం, నవలలోని పాత్ర లు చారిత్రక వ్యక్తులుగా ప్రాధాన్యం పొందడం చరిత్రకు అన్యాయం చేయడమే.
ramulu-bs
టంగుటూరి ప్రకాశం పంతులు మొదలుకొని ఇటీవలి ఎల్.కె.అద్వా నీ స్వీయచరిత్రలో వారి రాజకీయ జీవితాన్ని తప్ప మొత్తం మానవ సం బంధాలను సామాజిక పరిణామాలను చిత్రించలేకపోయారు. మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి స్వీయచరిత్రను పి.చంద్ చక్కగా రాశారు. కాళోజీ స్వీయచరిత్ర గురించి అనేకమంది యువకులు గంటలు చర్చించి, టేపుల్లో రికార్డు చేసింది పుస్తకంగా వెలువరించారు. స్వీయచరిత్రలో చరిత్ర అంశా లు వెలికితీస్తూ బాల శ్రీనివాస్‌మూర్తి ఒక పుస్తకం ప్రచురించారు. తెలంగా ణ ఉద్యమంలో వేలాదిమంది సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు, నాయకులు, కళాకారులు పాల్గొన్నారు. దశాబ్దాల తరబడి జీవితాలు అంకితం చేసి ఉద్యమాలు చేశారు. వీరిలో రాయగలిగిన వారు స్వీయచరిత్రను రాసి, రాయించి తెలంగాణ సామాజిక, చరిత్రను ఉద్యమ పరిణామాలను, సంస్కృతిని ఉద్యమాలను చిత్రించడం అవసరం. ప్రతి రచయి త, నాయకుడు, కళాకారుడు, స్వీయచరిత్రను రాసి తమదైన కోణంలో చరిత్రను ప్రజల ముందుంచడం వారి కర్తవ్యం.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)

1205
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles