క్షిపణి పోటీ

Fri,February 8, 2019 01:22 AM

ప్రపంచ దేశాలు మళ్ళా ప్రచ్ఛన్నయుద్ధం నాటి అనిశ్చిత పరిస్థితుల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో అమెరికా మధ్యతరహా అణ్వస్త్ర (ఐఎన్‌ఎఫ్) నిర్మూలన ఒప్పందం నుంచి వైదొలుగడం ఆందోళన కలిగిస్తున్నది. అమెరికా ప్రకటనకు దీటుగా రష్యా కూడా ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడమే కాకుండా మరింత ఆధునిక క్షిపణులను రూపొందిస్తున్నట్టు వెల్లడించింది. ఒప్పంద నిబంధనల ప్రకారం- లాంఛనంగా వైదొలుగడానికి మరో ఆరు నెలలు పడుతుంది. కానీ రెండుదేశాల వైఖరిని గమనిస్తే, ఒప్పందం నిలిచే సూచనలు కనిపించడంలేదు. ఈ ఒప్పందంలో భాగస్వాములైన అమెరికా, రష్యా దేశాలు కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. 1987 డిసెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు రీగన్, సోవియెట్ అధినేత గోర్భచేవ్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం మిగతా నిరాయుధీకరణ ఒప్పందాలకు దిక్సూచి వంటిది. దీనివల్ల యూరప్ దేశాల రాజధానులపై ఎక్కుపెట్టిన అణు క్షిపణులను సోవియెట్ యూనియన్ తొలిగించింది. అమెరికా కూడా తన క్షిపణులను ధ్వంసం చేసింది. కానీ వ్యూహాత్మకంగా ఈ క్షిపణులను ధ్వంసం చేసినప్పటికీ, మరింత ఆధునిక క్షిపణి వ్యవస్థల కోసం ఇరుపక్షాలు పరిశోధనలు సాగిస్తున్నాయి. ఇప్పుడు అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను పరీక్షించి మోహరించడానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే తాజా ఆయుధ పోటీ యూరప్ కన్నా ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుందని రక్షణ నిపుణులు అం టున్నారు.

ఐఎన్‌ఎఫ్ ఒప్పందం అమెరికా, రష్యా మధ్య కుదిరింది కనుక కొత్తగా ఎదుగుతున్న చైనాకు వర్తించదు. అందువల్ల తాము ఒప్పందం నుం చి వైదొలుగుతున్నామని కూడా అమెరికా అం టున్నది. కానీ చైనాతో చర్చలు జరిపి, ఆ దేశా న్ని ఒప్పందంలోకి తేవడానికి ప్రయత్నించాలే తప్ప, ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగడం పట్ల ఆందోళన వెలిబుచ్చిన చైనా, ఇప్పటికైనా చర్చలు జరిపి పరిష్కారం సాధిద్దామనే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. దీన్నిబట్టి చైనాతో కనీసం చర్చలు జరిపే పరిస్థి తి ఉన్నదని తెలిసిపోతున్నది. చైనా క్షిపణుల మోహరింపునకు పాల్పడుతున్నది నిజమే. ముఖ్యంగా తైవాన్ ప్రాంతంలో అమెరికా దాడులకు దిగితే తట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఈ వివాదం ఈశాన్య ఆసి యా ప్రాంతానికే పరిమితమైనట్టు కనిపిస్తున్నప్పటికీ, అమెరికా- చైనా ఘర్షణ మొత్తం ఆసి యా-పసిఫిక్ ప్రాంతమంతా విస్తరించి ఉన్నది. హిందు మహాసముద్ర ప్రాంతం కూడా ఇందు కు అతీతం కాదు. ఇక్కడే భారత్ అప్రమత్తం కావలసి ఉన్నది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని ఉద్రిక్తతలు మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. భార త్ ఇటీవలికాలంలో అమెరికా ప్రోద్బలంతో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ప్రవేశిస్తున్నది. ఈ నేపథ్యంలో చైనాతో క్షిపణిరంగంలో పోటీపడాలని చూస్తున్న అమెరికా వైఖరిని గమనంలో కి తీసుకోవాలె. భవిష్యత్తులో అమెరికా- చైనా ఉద్రిక్తతలు ఏ మోతాదులో, ఏయే రూపాలలో ఉంటాయో, మన పాత్ర ఏమిటో విశ్లేషించుకోవాలె.

బుల్లెట్ మనుషులను చంపదు, ట్రిగర్‌ను నొక్కే వేలు చంపుతుంది అనేది ఒక జేమ్స్‌బాండ్ సినిమాలోని వ్యాఖ్య. ఆయుధాలనే కన్నా మనిషిలోని అసహనం, యుద్ధోన్మాదం ప్రపంచానికి ప్రమాదకరం. ఒక క్షిపణి ఒప్పందం నుంచి వైదొలుగడమే కాదు, అంతర్జాతీయ ఒప్పందాలు, కూటములు, మొత్తంగా సమష్టితత్వం పట్ల అమెరికా ప్రదర్శిస్తున్న అసహనం, దుందుడుకు వైఖరి భయాందోళనలను కలిగిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇరాన్ ఒప్పందం పట్ల యూరోపియన్ దేశాలు ప్రదర్శించిన సామరస్యాన్ని అమెరికా చూపలేకపోయింది. ట్రంప్ ఆసియా- పసిఫిక్ ఒప్పందం నుంచి కూడా ఇదేరీతిలో వైదొలిగారు. నాటోలో భాగస్వాములైన యూరప్ దేశాలు నిధులు ఇవ్వడంలేదంటూ అసహనం వ్యక్తంచేస్తున్నారు. ట్రంప్ బృందంలోని సభ్యులు కూడా ఒకరికి మించి మరొకరున్నారు. ట్రంప్ ఆలోచనా ధోరిణికి ఆయన జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ మాటలు అద్దం పడుతుంటాయి. బోల్టన్‌కు ఆయుధ నియంత్రణ, అంతర్జాతీయ కూటములు, బహుళ పక్ష ఒప్పందాలు మొదలైనవేవీ నచ్చదు. చివరికి ఐక్యరాజ్యసమితి అంటే కూడా చిర్రెత్తుకొస్తుంది. ఇవన్నీ ఘనత వహించిన అమెరికా ప్రాబల్యా న్ని కట్టడి చేస్తున్నాయనేది ట్రంప్ బృందం బాధ. సరిహద్దులో గోడలు కట్టుకోవాలనే ఇటువంటి ఏకాకి మనస్తత్వం వల్ల అంతిమంగా అమెరికాకూ నష్టమే. అమెరికా ప్రజలు ఈ ప్రమాదాన్ని గ్రహించి కట్టడి చేయాలె.

847
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles