విచక్షణలేని కుల చైతన్యమా?

Wed,January 16, 2019 11:05 PM

చారిత్రక వాస్తవాలు, వర్తమాన పరిస్థితుల దృష్ట్యా బీసీలకు తమ అభ్యున్నతి కోసం కుల చైతన్యం అవసరమన్నది నిస్సందేహం. అదే సమయంలో అటువంటి చారిత్రక వాస్తవాలు, వర్తమాన పరిస్థితులు అగ్రకులాలలోని పేద వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా ఉన్నాయని వారు గ్రహించా లి. అటువంటి సమగ్రదృష్టి లేకుండా, సర్వజనుల అభ్యున్నతిని కోరుకోని కుల చైతన్యం అనేక ప్రశ్నల చిక్కుముడులలో ఇరుక్కునిపోతుంది. సమాజంలో పాక్షిక అభ్యున్నతులు సాధ్యమా అన్నదే ఒక ప్రశ్న కాగా, అటువంటి వాటిని కోరుకోవటం కూడా ఆమోదనీయం కాదు. అగ్రవర్ణాలలోని పేదలకు పది శాతం రిజర్వేషన్లు చేయటంలో మోదీ ప్రభుత్వపు రాజకీయ ఉద్దేశం ఏమిటి? ఈ చట్టం కోర్టులలో నిలబడుతుందా లేదా అనే రెండు ప్రశ్నలపై మనం ఎంతైనా చర్చించి ఏ అభిప్రాయానికైనా రావచ్చు. కాని యథాతథంగా ఈ చర్య వాంఛనీయమా కాదా, ఈ చర్యపై వస్తున్న విమర్శలు సరైనవా కావా అన్నవి మరొకస్థాయి ప్రశ్నలు. చారిత్రకమైన వాస్తవాల దృష్ట్యా రిజర్వేషన్లు అవసరమైంది ఎస్సీ, ఎస్టీలకే తప్ప బీసీలకు కాదని రాజ్యాంగసభ నిర్ణయించటాన్ని ముందుగా గుర్తుంచుకోవాలి. రిజర్వేషన్ల ప్రయాణానికి అది స్టార్టింగ్ పాయింట్ వంటిది. ఆ తర్వాత అనేక ఆందోళనల ఫలితంగా కొన్ని దశాబ్దాలకు బీసీ రిజర్వేషన్లు వచ్చాయి. ఇందుకు ఒక కారణం వారి డిమాండులోని సహేతుకత కాగా, మరొక కారణం వారి ఓట్లను రాజకీయ పార్టీలు ఆశించటం. ఇందులో రెండవది ప్రస్తుతం ప్రభుత్వ చర్య వంటిది. రాజకీయాలను అట్లుంచితే, చారిత్రక వాస్తవాలు, వర్తమాన పరిస్థితులు అనే వాటిలో సామాజిక వివక్షలు, పేదరికం అనే రెండు అంశాలున్నా యి. రాజ్యాంగ నిర్మాతలు మొదట ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు సామాజిక వివక్షలను మాత్రమే ప్రధానమైన పరిగణనగా తీసుకున్నారు.

బీసీలకు పేదరికం, దానితో సంబంధం గల విద్య-ఉద్యోగ వెనుకబాటు తనాలు మినహా ఎస్సీలకు వలె అంటరానితనం, ఎస్టీలకు వలె మారుమూల ఏకాకి జీవనాలు లేవు గనుక రిజర్వేషన్ల వంటివి అక్కరలేదని భావించారు. బీసీలతో సహా తక్కిన వారికి ఆర్థిక-విద్య-ఉద్యోగావకాశాల కోసం పథకాలు సరిపోతాయన్నది ఆలోచన. కాని ఒక దశ తర్వాత వారికి రిజర్వేషన్లు వచ్చాయి. ఆ రిజర్వేషన్లను బీసీలలోని అగ్రకులాలే అధికంగా అనుభవిస్తున్నాయనే భావన వల్ల బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగింది. ఇదే డిమాండ్ ఇప్పుడు ఎస్సీలలో ఉన్నది. మరి ఇటువంటి వర్గీకరణలు చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే, పరిస్థితుల వల్ల బీసీలందరికి అన్యాయం జరుగుతున్నదని, కనుక కుల చైతన్యం అవసరమని పోరాడినవారు, అంతర్గత చైతన్యం చూపనట్లే గదా. ఎస్సీలకు సంబంధించి మాల-మాదిగ సమస్యలో కూడా మాలలకు అంతర్గత చైతన్యం లేకపోవటమే. రిజర్వేషన్లకు ఆస్కారం కల్పించిన చారిత్రక వాస్తవాలు, వర్తమాన పరిస్థితులు అనేవాటికి పలు కోణాలున్నాయి. వాటిలో అంటరానితనం, ఏకాకి జీవనం అనే సామాజిక పరిస్థితులతో పాటు, ఆ కారణాల వల్ల తలెత్తిన అవిద్య, నిరుద్యోగం, పేదరికం కూడా ఉన్నాయి. ఇవి కార్యకారణ సంబంధాల వంటివి. అంతే తప్ప, రాజ్యాంగ నిర్మాతలు ఎస్సీల అంటరానితనం, ఎస్టీల ఏకాకి జీవనం అనే సామాజిక కోణాలకు మాత్ర మే సంకుచితమైన రీతిలో పరిమితమై ఆలోచించారని, ఆ స్థితికి ఫలితాలైన అవిద్య, నిరుద్యోగం,పేదరికాలను తమ సమగ్రదృష్టిలోకి తీసు కోలేదని భావించటం పొరపాటు. ఈ మౌలికమైన అవగాహనను ఇతర వర్గాలకు వర్తింపజేసి ఇప్పుడు, బీసీలకు అంటరానితనం గాని, ఒంటరి జీవనం గాని లేవు. కాని పేదరికం, వెనుకబాటుతనం, అవిద్య, నిరుద్యో గం ఉన్నాయి. అందువల్ల రిజర్వేషన్లు అవసరం. అదే పద్ధతిలో అల్ప సంఖ్యాక మత వర్గాలలో అంటరానితనం, ఒంటరి జీవితం వంటి సామాజిక పరిస్థితులు లేవు.

కాని వారిలోని కొన్ని సెక్షన్లకు బీసీలకు వలె నే పేదరికం, వెనుకబాటుతనం, అవిద్య, నిరుద్యోగం ఉన్నాయి. కనుక నే లోగడ కొన్ని రాష్ర్టాలు వారిని బీసీలుగ గుర్తించి రిజర్వేషన్లు కల్పించాయి. వారికి బీసీ-ఇ గ్రూపు కింద రిజర్వేషన్లు పెంచేందుకు కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆ విధంగా ఈ రిజర్వేషన్లు అన్నింటికి వర్తిస్తున్న సూత్రాలలో అంటరానితనం, ఏకాకిగా మారుమూల జీవితం వంటి సామాజిక వివక్షలతో పాటు, వెనుకబాటుతనం, అవిద్య, నిరుద్యోగం, పేదరికం అనే అనుబంధ సూత్రాలు, లేదా ఇతర సూత్రాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చారిత్రక వాస్తవాలు, వర్తమాన పరిస్థితులు కొన్ని తేడాలతోనైనా సూత్రరీత్యా ఒకేవిధంగా వర్తించే ఈ వర్గాలన్నింటికి రిజర్వేషన్లు అవసరమవుతున్నాయి. ఏదో ఒక పేరిటనో, ఏదో ఒక ఉద్దేశంతోనో ప్రశ్నించదలచుకుంటే ఈ రిజర్వేషన్లు అన్నింటినీ ప్రశ్నించవచ్చు. అట్లా ఆక్షేపిస్తున్నవారు కూడా ఉన్నారు. అంతమాత్రాన ఆయావర్గాల రిజర్వేషన్ల మౌలిక ఆవశ్యకత భంగపడిపోదు. ప్రస్తుతానికి వచ్చినప్పుడు అగ్రవర్ణాలలోని పేదలకు రిజర్వేషన్ల విషయం కూడా అటువంటిదే. కనుక వీరందరికి అందరితో సంఘీభావాలు ఉండాలి. కులం అన్నది వ్యవస్థ సృష్టించిన నిర్మాణం. ఆ వ్యవస్థలో కొన్నికులాలు ఉన్నతస్థానంలో ఉన్నంతమాత్రాన ఆ కులాలకు చెందినవారంతా అన్ని విధాలుగా ఉన్నతంగా ఉన్నారనలేం. ముఖ్యంగా చదువు, ఉద్యోగాలు వెనుకబాటుత నం, పేదరికాలకు సంబంధించి. వారిది వాస్తవానికి త్రిశంకు స్వర్గం వంటి పరిస్థితి. కుల వ్యవస్థ తాము సృష్టించినది కాకపోయినా సందర్భవశాత్తు అందులోని ఉన్నత శ్రేణి వారవుతారు. అదే సమయంలో అంతరాల వ్యవస్థలో భాగంగా పేదలు, చదువులు లేనివారవుతారు.
Ashok
ఆ విధం గా నలిగిపోతున్న వారికి పరిష్కారం ఏమిటి? ఆ ఒత్తిడి కారణంగానే పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి గుర్తింపు కోసం తాపత్రయ పడుతున్నారు. జీవిత సమస్యల నుంచి బయటపడేందుకు సంప్రదాయకమైన కుల వ్యవస్థ గౌరవాలను వదులుకునేందుకు సంకోచించటం లేదు. రిజర్వేషన్లు ఎందుకు, అభివృద్ధిపథకాలు సరిపోతాయి గదా అనే వాదం సహేతుకంగానే తోస్తుంది. కాని అదే వాదనను బీసీల విషయమై లేదా ఎస్సీ, ఎస్టీల విషయమై అగ్రవర్ణాల వారు చేయటం లేదా. పథకాలు అమలుచేయండి గాని అందరికి అన్ని రిజర్వేషన్లు రద్దుపరుచాలనే వారు లేరా! అందరినీ ధనిక-పేద కొలమానం ప్రకారం మాత్రమే చూడాలని, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలని సాక్ష్యాత్తు భారత ప్రభుత్వమే తొలి దశలో భావించటం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ ప్రకారం సలహా ఇవ్వటం, మొట్టమొదట ఏర్పడిన కాలేల్కర్ కమిషన్‌లోనే ఇటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం వంటివి మనకు తెలిసిందే. అంతిమంగా పేదలందరిది ఒకే సమస్య అన్నది బీసీలు గుర్తించవలసిన విషయం.
సామాజిక వివక్షలతో పాటు భారతీయులంతా పేదరికం, అవిద్య, నిరుద్యోగం నుంచి కూడా బయటపడవలసి ఉంది. పుట్టుకతో అగ్రకులం వారు కావటంలో ఆ కులాలకు చెందిన పేదల ప్రమేయం ఏమీ లేదు. వారిని ఆ పేదరికం నుంచి వెలికి తేవటంలో మాత్రం ప్రభుత్వానికి, వ్యవస్థకు ప్రమేయం ఉండాలి. లేనప్పుడు ప్రభుత్వం అనేది ఎందుకు? అటువంటి పరిష్కారంలో పథకాలు ఒక సాధనమైతే రిజర్వేషన్లు కూడా ఒక సాధనమే. ఆ పేదలను గుర్తించేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయించిన ఆధారాలతో ఆక్షేపనీయమైనవి ఉన్నాయి. ఉదాహరణకు రూ.8 లక్ష ల వార్షికాదాయం వంటివి. కాని సూత్రరీత్యా రిజర్వేషన్లను తప్పనలే ము. అందువల్ల, నిజానికి తమకు నష్టం అంటూ ఏమీ జరుగని పది శాతాన్ని బీసీలలో కొందరు వ్యతిరేకించటం, వారి కుల చైతన్యం విచక్షణ లేని స్వార్థంగా మారటానికి గుర్తు.

657
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles