సత్ఫలితాలిస్తున్న సంక్షేమ పథకాలు

Wed,January 16, 2019 11:05 PM

కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడమే కాక రాష్ట్ర రథసారథిగా బాధ్యతలను కూడా తానే చేపట్టారు. ఇది రాష్ట్ర ప్రజలకు లభించిన మరొక అదృష్టం. సహజ వనరులు ఎన్ని వున్నా, దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై వెనకబడిన ప్రాంతాలలో ఒకటిగా మిగిలిపోయిన తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి చేసే పనికి కేసీ ఆర్ నడుంబిగించారు. గత అరువై ఏండ్లలో కనీసం ఊహకు కూడా అంద ని ప్రగతిని రాష్ట్రంలో ఈ నాలుగేండ్లలో సాధించి చూపారు. సమాజంలో ని అన్నివర్గాల వారికి మంచి జరిగే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అవన్నీ జయప్రదంగా అమలవుతూ సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో జలవనరుల సద్వినియోగానికి మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టి నీటి నిల్వను పెంచారు. ఇటీవలి కాలంలో దేశంలో ఎక్కడాలేని విధంగా చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజె క్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాలకు వరప్రదాయిని. పంపింగ్ ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలకు నీరందించే బృహత్ పథకం. ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 80 వేల కోట్ల రూపాయల అంచనాలతో ఇక్కడ జరుగుతున్న పనుల తీరును చూసి ఈ ప్రాజెక్టును సందర్శించిన రాజకీయ నాయకులు, ఇంజినీరింగ్ ప్రముఖులు కూడా ఆశ్చర్యచకితులౌతున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం మరొక అద్భుతం. కృష్ణా జలాలను జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్‌సాగర్ మీదుగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ఎత్తిపోతల ద్వారా తాగునీరు, సాగునీరు అందించే పథకమిది. పాలమూరు, రంగారెడ్డి జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నిజమౌతున్నాయి. గోదావరి జలాలు, కృష్ణా జలాలతో తెలంగాణ నేల తడిసి పులకించిపోతున్నది. కేసీఆర్ ఉద్యమాలు నడుపడమే కాదు, సుస్థిరమైన పాలనను అందిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు .

తెలంగాణ ఆడబిడ్డల తాగునీటి కష్టాలను తీర్చడానికి కేసీఆర్ గారు కంకణం కట్టుకుని మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారు. ఈ పథకం ద్వారా పల్లెలోని ఇంటింటికీ మంచినీరు లభించే అవకాశం ఏర్పడింది. దీని కోసం రాష్ట్రం మొత్తం మీద లక్షా ఆరువందల కి.మీ. పొడవైన పైప్ లైన్‌ను వేసి, 24,248 గ్రామాలలోని 52,18,225 కుటుంబాలకు, 65 మున్సి పాలిటీలలోని 12,52,000 కుటుంబాలకు స్వచ్ఛమైన నదీజలాలను అందిస్తున్నారు. 11 రాష్ర్టాలు ఈ పథకాన్ని అధ్యయనం చేశాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా 43 వేలకోట్ల రూపాయల వ్యయంతో ఇంతపెద్ద పథకాన్ని చేపట్టే సాహసం కేసీఆర్ మాత్రమే చేశారు. రాష్ట్రమంతా పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండటం, కరెంట్ కోతలు లేనందున పరిశ్రమలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. టీఎస్. ఐపాస్ ద్వారా చిన్న పరిశ్రమలకు పదిరోజుల్లోనే అనుమతులు లభించడం జరుగుతున్నది. రాష్ట్రమంతా ఎటువంటి గొడవలు లేకుండా మతసామరస్యం వెల్లివిరుస్తుండడం వల్ల రాష్ట్రం శాంతిభద్రతలతో అలరారుతున్నది. కోతలు లేని 24గంటల ఉచిత కరెంట్ మూలంగా వ్యవసాయోత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి పథకాలను రూపొందిచారు. వాటిని విజయవంతంగా అమలు చేయటంలోనే కాదు, ప్రజాసంక్షేమానికి మునుపెన్నడూ లేని విధంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది. పంట పెట్టుబడికి రైతుబంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి రూ.8 వేల రూపాయలను రైతులకు ఇస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలన ప్రజల ముంగిటికి తీసుకెళ్ళారు. వృద్ధులకు ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, దివ్యాంగులకు జీవనభృతి, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్యలక్ష్మి, అమ్మఒడి, కేసీఆర్ కిట్, గొర్రెల, బర్రెల పంపిణీ, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ లు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలవుతున్నాయి. శాంతిభద్రతలను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ పటిష్టత కోసం ఎన్నో చర్యలను చేపట్టడం జరిగింది. వారికి ఆధునిక వాహనాలను, ఆయుధాలను సరఫరా చేశారు.

నిజాం కాలం నాటి పురాతన భవనాలలో పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లు, అధికారుల భవనాల స్థానంలో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త భవనాలను సమకూర్చే పని శరవేగంతో జరుగుతున్నది. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు అవసరమైన నిధులను మంజూరు చేయడం జరిగింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్ర జి.డి.పి. నాలుగేళ్ళలో సగటున 17.20 శాతం వృద్ధిరేటును సాధిం చి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో ప్రతిబంధకాలను, సవాళ్ళను అధిగమించి తనకు ఏ రాష్ట్రం సాటిరాదని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగా ణ ప్రభుత్వం నిరూపించింది. కేసీఆర్ గారు గత నాలుగేండ్ల నుంచి ప్రారంభించి కొనసాగిస్తున్న పథకాలన్నీ జయప్రదంగా పూర్తి అవుతాయనడంలో సందేహం లేదు. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం వారి సంక్షేమానికి కూడా అదే రీతిలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. తెలంగాణ పోలీస్ శాఖ, జైళ్ళ శాఖ, అగ్నిమాపకదళ, విపత్తు నివారణ శాఖ ల ప్రయోజనాల కోసం పోలీస్ స్టేషన్ల భవనాలు, కమిషనరేట్లు, బారక్స్, పోలీస్ ఉద్యోగుల, అధికారుల నివాసానికి క్వార్టర్స్, బహుళ అంతస్థుల భవనాలు మొదలైన నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టింది. పోలీస్, జైళ్ళ శాఖ భవన నిర్మాణ కార్యక్రమాలను మాత్రమే గాక, ఇతర ప్రభుత్వ శాఖలైన, పశువైద్య విశ్వవిద్యాలయం, అటవీశాఖ, అబ్కారీ మానవవనరుల సంస్థలకు సంబంధించిన భవన నిర్మాణాలను కూడా చేపట్టి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో గడువుకు ముందే జయప్రదంగా పూర్తిచేసి, అప్పగిస్తున్నది.
damoder
హౌసింగ్, కార్యాలయ నిర్మాణాలతో పాటు, పోలీస్ అకాడెమీ నిర్మాణం, సెంట్రల్ ప్రిజన్స్, ఒక్కొక్కటి వంద ఎకరాల విస్తీర్ణంలో 14 పోలీస్ బెటాలియన్ కాంప్లెక్స్‌లు, ఆక్టోపస్‌కు 600 ఎకరాలలో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో 30 వేల పోలీస్ నివాసగృహాలు, డి.జి.పి., ఇంటెలిజన్స్, సి.బి.సి.ఐ.డి., ఎ.సి.బి., డి.జి. ప్రిజన్స్ భవనాలతో పాటు సి.ఆర్. పి.ఎఫ్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ భవననిర్మాణాలు ప్రభుత్వం చేపట్టిన కార్యకలాపాలకు కలికితురాళ్ళుగా చెప్పవచ్చు.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్ ఛైర్మన్ )

626
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles