రైతులకు, వినియోగదారులకు మేలు


Tue,January 15, 2019 01:02 AM

వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణలో భాగంగా చరిత్రాత్మక పథకాలైన రైతు బంధు, రైతు బీమాలకు నాందిపలికి తెలంగాణ మోడల్‌కు నాంది పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల ఆదా యం పెంపు దిశగా కార్యాచరణకు పూనుకున్నది. ఆరుగాలాలు కష్టించి పండించిన పంటకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు, గిట్టుబాటు ధర లభించక రైతు కుదేలవుతున్నాడు. అర్థం కాని సప్లై డిమాండ్ చక్రం కింద గిట్టుబాటు ధరలేక అన్నదాత నలిగిపోతున్నాడు. అందుకే ఇప్పుడు ఎవ రూ ఊహించని విధంగా బ్రాండ్ తెలంగాణ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా బ్రాండ్ తెలంగాణ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను విస్తరింపజేసి, రైతుల ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనికి మహిళా సంఘాలను భాగస్వామ్యులను చేయడం ద్వారా మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయాలనే ఆలోచన అద్భుతమైనది. వాస్తవానికి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కొత్తేమీ కాదు. అవి ఇప్పటికే రాష్ట్రంలో నెలకొల్పబడ్డాయి. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూని ట్స్ ద్వారా రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయా? ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు, రైతుల ఆదాయానికి సంబంధం ఉన్నదా? అంటే అవుననే చెప్పాలి. నిజానికి, రైతులకు, వినియోగదారులకు మధ్య ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కీలక పాత్రను పోషిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ ను జోడించి వాటిని వినియోదారులకు అందజేయడంలో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల పాత్ర ముఖ్యమైనది. రైతులు పండించిన పంటను కొని వాటిని శుద్ధిచేసి అనంతరం వాటిని వినియోగదారులకు అమ్మకం చేసే కంపెనీలనే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు అంటారు.

ఉదాహరణకు రైతుల నుంచి మామిడి పండ్లను కొని మామిడిరసం చేసి అమ్మడం, అలాగే రైతుల నుంచి టమాటాలు కొని టమాటో సాస్ తయారుచేసి అమ్మడం చేస్తారు. ఇలా వ్యవసాయ ఉత్పతులకు దేశ విదేశాల్లో మార్కెట్ కల్పించడంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలది ముఖ్య పాత్ర. అందుకే ప్రభుత్వాలు వివిధ రకాలైన సబ్సిడీల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అలాగే ఈ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే ఔత్సాహిక వ్యవస్థాపకులకు అన్నిరకాలుగా ప్రోత్సాహకా లు ఇస్తుంటాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా 2017 నవంబర్‌లో ఢిల్లీ వేదికగా తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ విధాన పత్రం రాబోయే ఐదేండ్లకు గాను ప్రకటించిది. రైతుల ఉత్పత్తిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్‌కు అనుసంధానం చేసి తద్వారా రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ విధాన పత్రంను రూపకల్పన చేసింది. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యో గ ఉపాధి అవకాశాల ఆలంబనతో పాటు రైతులకు ఆదాయాన్ని పెంచడమే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రత్యేకత. ఇటీవల జలంధర్‌లో జరిగిన 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ సైతం తన ప్రారంభోన్యాసంలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేయాలని కోరడం వ్యవసాయపరంగా వెనుకబడిన మనదేశంలో ఆ రంగం ఆవశ్యకతను తెలియజేస్తున్నది. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోనికి బ్రాండ్ తెలంగాణగా ప్రవేశించాలనుకోవడం. తద్వారా రైతులను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు అనుసంధానం చేసి వారి ఆదాయం పెంచడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకే లభ్యమ య్యేటట్లు చేయడం ఆహ్వానించదగ్గ నిర్ణయం.

వాస్తవ పరిస్థితులను గమనించినట్లయితే, రాష్ట్రంలో అధిక శాతం రైతులు తాము పండించిన పంటను ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలో అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా అమ్ముతున్నారు. ఇక వ్యవసాయ మార్కెట్లో మధ్యవర్తులు, దళారులు, ప్రైవేట్ ఏజెంట్లదే రాజ్యం. వారందరు సిండికేట్‌గా ఏర్పడి వివిధ కారణాలను చూపించి రైతుల నుంచి పంటను తక్కువ ధరకే కొనుగోలు చేసి తిరిగి రైతు నుంచి సేకరించిన పంటను ప్రాసెసింగ్ యూనిట్స్‌కు, ఎగుమతిదారులకు అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కష్టపడిన పంటను పండించిన రైతు రోజురోజుకు కుదేలవుతుంటే, దళారులు, మధ్యవర్తులు మాత్రం కుబేరులవుతున్నారు. వాస్తవాలను గమనించిన కేంద్ర ప్రభు త్వం, 2016లో ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నావ్‌ు) కు నాంది పలికింది. దీనిద్వారా రైతు తాను పండించిన పంటను ఎలక్ట్రా నిక్ విధానం ద్వారా దేశంలోని ఏ ఇతర మార్కెట్లో అయినా అమ్ముకునే అవకాశం ఏర్పడింది. ఫుడ్ ప్రాసెసర్ నేరుగా బిడ్డింగ్‌లో పాల్గొని రైతునుంచే కొనే అవకాశం ఉన్నది. కానీ అలా జరుగడం లేదు. స్థానిక దళారులే రైతులకు దిక్కవుతున్నారు. సీజన్ వారీగా పండే పంటలను ప్రభుత్వమే వివిధ ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేస్తున్న, ముఖ్యంగా ఉద్యానవన పంటలపై ఆధారపడిన రైతులు మాత్రం దళారుల బెడదకు గురవుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయ, ఉద్యాన, పౌల్ట్రీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రాం డ్ తెలంగాణ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన ప్రభుత్వ నిర్ణయం అమలు జరిగితే గనుక, రాష్ట్రంలో ఉద్యోగ కల్పనకు తోడు రైతుల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది.

ముఖ్యంగా రైతాంగాన్ని ఆయా ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్‌కు అనుసంధా నం చేసి, డిమాండ్‌కు అనుగుణంగా పంటలను నిర్దేశించవచ్చు. అలా గే, మధ్యవర్తుల బెడద లేకపోవడంతో ఉత్పతుల ధర తగ్గి అది వినియోగదారుని మిగులుకు దారితీస్తుంది. ఇకపోతే, తెలంగాణ బ్రాండ్ పేరిట నాణ్యమైన, కల్తీ లేని వస్తువులను తయారుచేసి దేశీయ, విదేశీ మార్కెట్లలో తెలంగాణ బ్రాండ్‌ను పెంచుకోవచ్చు. ఈ నిర్ణయం నిజంగా హర్షించదగినదే అయినా, దీని అమలుపై తొం దరపాటు తగదు. అందుకే, దూరదృష్టి గల కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలాలను ఎంచుకొని ముందుకు సాగాలనుకోవడం నిజంగా ఆహ్వానించదగ్గ విషయమే. ముందుగా, పరిశోధనలకు, అధ్యయనాలకు అవకాశం ఇవ్వాలి. వ్యవసాయం, ఉద్యాన పౌల్ట్రీ రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలపై పూర్తిస్థాయి అధ్యయనం జరుపాలి. ఏ ఉత్పత్తులకు తెలంగాణ అనుకూలం, ఏ ఉత్పత్తులకు దేశీయ మార్కెట్ ఉన్నది, ఏ ఉత్పతులకు విదేశీ మార్కెట్ ఉంది ముఖ్యంగా, తెలంగాణ బ్రాండ్ ఉత్పత్తుల మీద వినియోగదారుల ఆకాంక్షలు ఏమిటీ అన్న కోణంలో శాస్త్రీయ పరిశోధనలు చేయాలి. ఆ తర్వాత, మహిళా సంఘాలకు ఆయా ప్రాంతాల్లో లభ్యమయ్యే పంటలను దృష్టిలో ఉంచుకొని శిక్షణ ఇవ్వాలి. అప్పుడే దశల వారీగా తొలి దశలో ఉద్యాన పంటల శుద్ధి పరిశ్రమలపై దృష్టి సాధించాలి. ఎందుకంటే ఉద్యాన ఉత్పతుల మార్కెట్ పరిధి విస్తృతమైనది.
rama-krishna
ఆ తర్వాత వ్యవసాయ, పౌల్ట్రీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమలపై దృష్టి సారించాలి. మైసూర్ శాండల్ బ్రాండ్ కర్ణాటక రాష్టానికి ఎంత పేరు తెచ్చిందో అలాగే తెలంగాణ బ్రాండ్‌తో వచ్చే ఉత్పతులు కూడా తెలంగాణ రాష్ర్టానికి అంతే పేరు తెచ్చేవిధంగా కార్యాచరణకు పూనుకోవాలి. ఆ విధంగా బ్రాండ్ తెలంగాణ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను విస్తరింపజేసిన నాడు కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సిద్ధించినట్లే.
(వ్యాసకర్త: వ్యవసాయ మార్కెట్‌పై యూజీసీ పోస్ట్ డాక్టోరల్, కామర్స్ విభాగం ఓయూ)

829
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles