సీబీఐలో సంక్షోభం

Sat,January 12, 2019 12:30 AM

రాజకీయ నాయకులు తమ అనుకూలమైన వ్యక్తులను నియమించుకోవడం వల్లనే సీబీఐకి పంజరంలోని చిలుక అనే ముద్ర పడ్డది. ఈ రెండు జాడ్యాలకు అంతిమంగా బాధ్యత వహించాల్సింది రాజకీయ నాయకత్వమే. రాజకీయ నాయకత్వం నిజాయితీగా ఉండాలె. సీబీఐ అధికారులు కర్తవ్య పారాయణులై ఉండాలె.

దేశంలోని ప్రధానమైన దర్యాప్తు సంస్థపై నీలినీడలు ప్రసరించడం కొత్త కానప్పటికీ, ఈ వ్యాధి ముదిరిపోవడం, రాజకీయ నాయకత్వంపై కూడా అనుమానాలు ప్రసరించడం తీవ్ర ఆందోళనకరం. సీబీఐ కేంద్రంగా దాదాపు మూడు నెలలుగా నెలకొన్న పరిణామాలు ఈ సంస్థ ప్రతిష్ఠను పూర్తిగా దిగజార్చాయి. అలోక్ వర్మను హటాత్తుగా సీబీఐ డైరెక్టర్ పదవిని నుంచి తప్పించడం వివాదాస్పదమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన మళ్ళీ బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఆయనను బదిలీ చేయడం తాత్కాలిక డైరెక్టర్ మళ్ళా బాధ్యతలు చేపట్డం వేగంగా జరిగిపోయాయి. అలోక్‌వర్మ నిర్ణయాలను తాత్కాలిక డైరెక్టర్ అతివేగంగా మార్చాడు. మళ్ళా అలోక్‌వర్మ బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలోనే గత బదిలీలు చేపట్టాడు. ఈయన తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు మళ్ళా తాత్కాలిక డైరెక్టర్ రద్దు చేశాడు. దేశంలోనే కీలకమైన దర్యాప్తు సంస్థలో చిన్నపిల్లల ఆటలాగా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరం. స్వాతంత్య్రం వచ్చి డెబ్బయి ఏండ్ల తర్వాత కూడా వ్యవస్థలు ఇంకా కుదుటపడలేదా? లేదా స్థిరపడిన వ్యవస్థలను నిర్వీర్యపరుస్తున్నారా? ఇది సీబీఐలోని గ్రూపుల వివా దం కాదనీ, సీబీఐ స్వతంత్రంగా పనిచేయకుండా రాజకీయ నాయకత్వం అడ్డు తగులుతున్నదని ఆరోపణలు బలంగా ఉన్నాయి. సీబీఐకి, రాజకీయ నాయకత్వానికి మధ్య వివాదమైతే దానిని ఇంకా తీవ్రమైన విషయంగా పరిగణించాల్సిందే. ఒక్క సీబీఐ మాత్రమే కాదు, అనేక వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయనే ఆరోపణలు ఇటీవలికాలంలో వస్తున్నాయి. ఈ పరిస్థితికి రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించక తప్పదు.

సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ రెండవ స్థానంలో ఉన్న కీలక అధికారి రాకేశ్ ఆస్తానాపై చర్య తీసుకోవాలని భావించడంతో సీబీఐలో సంక్షోభం పతాకస్థాయికి చేరుకున్నది. రాకేశ్ ఆస్తానా గుజరాత్‌కు చెందిన అధికారి. రాజకీయ నాయకత్వానికి సన్నిహితుడనే అభిప్రాయం ఉన్న ది. అతడిపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. అయితే ఉన్నతాధికారి కను క అతడిని అరెస్టు చేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇందుకు ప్రభుత్వ అనుమతిని కోరినప్పుడు, కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ క్రమంలో వర్మ, ఆస్తానా మధ్య పరస్పరం అవినీతి ఆరోపణలు సాగాయి. ప్రధాని సముదాయింప ప్రయత్నించినట్టు, సాధ్యం కాపోవడంతో ఇరువురిని బదిలీ చేసినట్టు కనిపిస్తున్నది. కానీ అలోక్ వర్మను తొలిగించినప్పటికీ, తమపై బురద పడకుండా కేంద్రం జాగ్రత్తగా పావులు కదిపిందనే ఆరోపణలున్నాయి. కేంద్రం అలోక్ వర్మను బదిలీ చేయడం ద్వారా తొలిగించడం లేదనే విధంగా వ్యవహరించింది. అలోక్ వర్మతో పాటు ఆస్తానా ను కూడా తొలిగించింది. కానీ ఇరువురిని తొలిగించిన తదుపరి పగ్గాలు తీసుకున్న తాత్కాలిక డైరెక్టర్ ఆస్తానాపై దర్యాప్తు జరుపుతున్న అధికారులను బదిలీ చేయడం గమనార్హం. దీన్నిబట్టి కేంద్రం తనకు వ్యతిరేకంగా ఉన్న అలోక్ వర్మను తొలిగించి, తమకు ఆప్తుడైన ఆస్తానాను కాపాడుకున్నదనే అభిప్రాయానికి ఆస్కారం ఏర్పడ్డది. కేంద్రంలోని ఒక కీలక నాయకుడిపై ఉన్న ఆరోపణలపై దర్యాప్తు పట్ల అలోక్ వర్మ ఆసక్తి ప్రదర్శించాడనేది ఒక కథనం. బీహార్‌కు చెందిన ఒక రాజకీయ నాయకుడిని ఇబ్బంది పెట్టడానికి సీబీఐని సాధనంగా వాడుకోవాలనే కుట్రకు అలోక్ వర్మ సహకరించలేదని కూడా అనుకుంటున్నారు. రాఫెల్, బొగ్గు మొదలైన కుంభకోణాలపై దర్యాప్తు సాగుతున్న దశలో అం దుకు సంబంధించిన అధికారులపై ఒత్తిళ్ళు పెరిగాయని తెలుస్తున్నది.

అలోక్ వర్మ, రాకేశ్ ఆస్తానా వివాదంలో దోషమెవరిదైనా సీబీఐ ప్రతిష్ఠ మసకబారుతున్నది. సీబీఐ డైరెక్టర్లపై ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. రంజిత్ సిన్హా పలు కేసులలో నిందితులకు తోడ్పడ యత్నించాడని, దర్యాప్తుల్లో జోక్యం చేసుకున్నాడని వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా నమ్మదగినట్టుగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది. ఆయనను 2జీ టెలికం కేసుల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈడీ దర్యాప్తులో ఉన్న మాంసం వ్యాపారి మొయిన్ ఖురేశీతో సంబంధాలున్నందుకు ఏపీసింగ్‌పై కేసులు ఉన్నాయి. ఇదే కేసుకు సంబంధించి సీబీఐలోని ఒక దర్యాప్తు అధికారి అరెస్టయ్యాడు. సీబీఐలో అవినీతి పెరిగిపోవ డం ఒక విషయమైతే, నిజాయితీ గల అధికారులపై రాజకీయ ఒత్తిడులు ఉండటం రెండవ అంశం. రాజకీయ నాయకులు తమ అనుకూలమైన వ్యక్తులను నియమించుకోవడం వల్లనే సీబీఐకి పంజరంలోని చిలుక అనే ముద్ర పడ్డది. ఈ రెండు జాడ్యాలకు అంతిమంగా బాధ్యత వహించాల్సింది రాజకీయ నాయకత్వమే. రాజకీయ నాయకత్వం నిజాయితీగా ఉండాలె. సీబీ ఐ అధికారులు కర్తవ్య పారాయణులై ఉండాలె. వారు నిజాయితీగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడానికి సంకోచిస్తారు. ఇవన్నీ ఒకేసారి ఏర్పడవు. ఒకేసారి పొమ్మం టే పోవు. అటువంటి రాజకీయరంగంలో, అధికార బృందంలో ఉన్న వ్యక్తులు తాము ఆదర్శం గా ఉంటూ, సత్సంప్రదాయాలను నెలకొల్పాలె. అలోక్‌వర్మను సాగనంపి తాత్కాలిక డైరెక్టర్ ను నియమించడంతో ప్రధాని బాధ్యత తీరిపోదు. ప్రధాని చర్యలు చట్టపరంగానే కాదు, నైతికంగా కూడా సరైనవేనా అనేది ప్రజలు గమనిస్తుంటారు. సీబీఐ పరిణామాలకు ప్రధాని మోదీ తో పాటు కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించే పార్లమెంట్ కూడా తమ బాధ్యతను విస్మరించకూడదు.

440
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles