రిజర్వేషన్ ఫలాలు


Thu,January 10, 2019 11:08 PM

సాధారణ ఎన్నికల ముంగిట కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అగ్రవర్ణ నిరుపేదలకు విద్య, ఉద్యోగావకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందింది. నిజానికి ఈ పది శాతం రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లోని పేదల కోసమనే వివరణ ఆ బిల్లులో లేదు. సమాజంలోని నిరుపేద వర్గాల కు విద్య, ఉద్యోగావకాశాల్లో అవకాశాల కోసమని వివరించింది. ఎంతోకాలంగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అవసరమన్న వాదం బలంగా ఉన్నది. ఎట్టకేలకు ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై, సమయ సందర్భాలపై ఎన్ని విమర్శలున్నా అన్ని రాజకీయపార్టీలు సమర్థించ టం గమనార్హం. రాజ్యాంగం ప్రకారం తరతరాలుగా సామాజికంగా వివక్ష, అణిచివేతలకు గురవుతున్న వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు పొందే అవకాశం ఉన్నది. మౌలికంగా రాజ్యాంగపరం గా రిజర్వేషన్ విధాన స్ఫూర్తి అదే. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వెనుకబాటుతనం, పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నది. ఇది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని ఎవరైనా కోర్టు మెట్లెక్కితే ఎంత మేరకు నిలుస్తుందనే సందేహం ఉన్నది. మరోవైపు ఈ పది శాతం రిజర్వేషన్ల పెంపుతో మొత్తం రిజర్వేషన్ల కోటా యాభై శాతానికి మించిపోతున్నది. గతం లో సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా చూస్తే రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదు. ఈ విధమైన రాజ్యాంగపరమైన అవరోధాలు అధిగమించి సమాజంలోని నిరుపేద వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందాల్సిన అవసరం ఉన్నదన్నది కూడా సామాజిక అవసరంగా గుర్తించాలి.

పీవీ ప్రధానిగా ఉన్న కాలంలో కూడా అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని తలపెట్టారు. కానీ ఆ పెంపుదలతో రిజర్వే షన్ల శాతం యాభైకి మించిపోతున్నదని, ఇది రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకమని అప్పుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ల అంశం అటకెక్కింది. ఆ తర్వాత మరెవరూ అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు అన్న అంశాన్ని ముట్టుకోవటానికి సాహసించలేదు. కాలక్రమంలో అనేక రాష్ర్టాల్లో అగ్రవర్ణా ల పేదలకు రిజర్వేషన్లు కావాలనే ఉద్యమాలు ముందుకువచ్చాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, యూపీ రాష్ర్టాల్లో అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కావాలని పెద్ద ఎత్తున ఉద్యమించారు. మొత్తంగా రిజర్వేషన్ల కొనసాగింపుపై కూడా మౌలికంగా విధానపరమైన చర్చలు తెరమీదికి వచ్చాయి. మరోవైపు గత కొంత కాలంగా దేశంలో మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఈ మధ్య జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో బీజేపీ పరాజయం పాలయ్యింది. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్న పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ల ఆసరాతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని మోదీ చూస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయాలు అటుంచి దశాబ్దాలుగా కొన్ని సామాజిక వర్గాలు ఆకాంక్షిస్తున్న అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించటం సామాజిక ఆందోళనల ప్రతిఫలనంగా చెప్పుకోవచ్చు. అగ్రవర్ణాల్లోని నిరుపేదలు కులపరమైన రిజర్వేషన్లపై వ్యక్తపరుస్తున్న వ్యతిరేకతలు, ఈర్శ్యాద్వేషాలు సమసిపోవటానికి ఈ పదిశాతం రిజర్వేషన్లు భూమిక అవుతాయనటంలో సందేహం లేదు.

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పది శాతం రిజర్వేషన్లు కేవలం అగ్రవర్ణాల పేదలకు మాత్రమేన ని అర్థం కాదు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిపోయిన నిరుపేద వర్గాలన్నీ ఈ రిజర్వేషన్ ఫలాలను పొందవచ్చు. కులాలు, మతాలకతీతంగా ఈ పెరిగిన పది శాతం రిజర్వేషన్ ఫలాలను అనుభవించవచ్చు. అయితే కేంద్రం తలపెట్టిన పది శాతం రిజర్వేషన్ల పెంపుదల ఆచరణలోకి రావాలంటే, రాజ్యాంగ సవరణ చేసినందున న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకపోవచ్చు అని కేంద్రం అంటున్నది. ఇదే సందర్భంగా ఇప్పటిదాకా 27 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న బీసీలు తమ రిజర్వేషన్ జనాభాకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడే అన్నివర్గాలకు సమన్యాయం దక్కుతుందన్న వాదనలూ బలం పుంజుకుంటున్నాయి. అయితే ఈ రిజర్వేషన్ బిల్లు ఆచరణలోకి వచ్చి, ఫలా లు పొందటానికి మరికొంత కాలం పట్టవచ్చు. సరళీకరణ, నూతన ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ నేపథ్యంలో అందివచ్చిన ఉద్యోగావకాశాల నేపథ్యంలో గత రెండు మూడు దశాబ్దాలుగా రిజర్వేషన్ల సమస్య అంత తీవ్రంగా ముందుకురాలేదు. కానీ మునుముందు నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్న సందర్భంలో ప్రభుత్వాలు రిజర్వేషన్లు, కోటాలతో కాలం వెల్లబుచ్చటం శ్రేయస్కరం కాదు. రెండంకెల వృద్ధిరేట్లు, జీడీపీల పెరుగుదల అనేవి అభివృద్ధి ఫలాలు అందకుండా దూరంగా ఉన్న వర్గాల అసమ్మతిని సంతృప్తి పర్చలేవు. అభివృద్ధిని అంకెల్లో చూడడం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు ఎంతమేర ఉపయోగపడుతున్నాయో చూడా లి. సంపద సృష్టి కోసం తపన పడుతున్న పాలకులు ఆ సంపదను అందరికీ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి. తాత్కాలిక ఉపశమనాలతో, బుజ్జగింపులతో సామాజిక సమూహాలను ఎంతోకాలం ఏమార్చటం భావ్యం కాదు.

364
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles