ఆకాశవాణి మూగపోవద్దు


Thu,January 10, 2019 11:07 PM

నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుండటంతో దశాబ్దాల తరబడి విశిష్ట సేవలందించిన ప్రభుత్వ రంగంలోని ఆకాశవాణిపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరితో క్రమక్రమంగా మూగబోయే పరిస్థితులు రావడం బాధాకరం. ప్రసారాల హేతుబద్ధీకరణ నిర్వహణ వ్యయంలో భాగంగా ఆల్ ఇండియా రేడి యో (ఎయిర్) జాతీయ ఛానల్‌ను మూసివేయాలని దీంతోపాటు అకాడమీ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీమీడియా కూడా ముసివేయాలని ప్రసార భారతి ఇటీవల నిర్ణయించాయి. మోదీ ప్రభుత్వం ప్రసార భారతిపై చూపించిన నిర్లక్ష్య వైఖరి క్రమక్రమంగా విక్రయించాలనే ఆలోచనలు చేయడం, వాటి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చివేయడం. ప్రకటనలు తెచ్చుకోండి.. మీ ఆదాయం సమకూర్చుకోండి అని ఆదేశాలు జారీ చెయ్యడం. వివిధ పట్టణాల్లో ఉన్న స్టేషన్ల ను క్రమంగా మూసివేసే కార్యక్రమానికి తెరలేపడం. ప్రసార భారతిని రెండుగా చీల్చే కుట్రలు చేస్తున్నారనే వార్తలు రావడం ఇటీవలి నిర్ణయం తో తేటతెల్లమైంది. మారుమూల ప్రజలకు సమాచారం వినోదం అందించడంలో ఆల్ ఇం డియా రేడియో, (ఆకాశవాణి) అందిస్తున్న సేవలు అజరామరమైనవి. దేశంలో 420 స్టేషన్లు కలిగి అన్ని భాషల్లో ఆకాశవాణి సినిమా పాటలు వార్తలు, వివిధ శీర్షికల కింద శ్రోతలు కోరుకున్న కార్యక్రమాలు అందజేస్తున్నది. దాదాపు 60 ఏండ్ల నుంచి రేడియో కార్యక్రమాలకు కోట్లాది అభిమాన శ్రోతలున్నారు. ఆకాశవాణి ప్రధాన ఉద్దేశం ప్రజలకు సమాచారం అందించడం. అనేక సంక్షోభ సమయాల్లో, విపత్తుల సమావేశాల్లో మారుమూల ప్రాంతాలకు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు రేడియో చేస్తున్న సేవలను మరువలేం. ఆకాశవాణిని ఏ ఒక్క ప్రైవేట్ ఎఫ్ ఎవ్‌ు స్టేషన్లతో పోల్చకూడదు. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రజలకు అందించే కార్యక్రమాలు ప్రసారం చేసే ఆకాశవాణిని నిర్లక్ష్యం చేయడం దారుణం.

1971లో ప్రారంభమైన వివిధ భారతి కార్యక్రమాలు 102.8 మెగాహెర్జ్ హిందీతో పాటు స్థానిక భాషలు కలిసి ప్రతి రోజూ 17 గంటల 17 నిమిషాల పాటు వార్తలతో కలిసి వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నది. ఎన్నో ప్రైవేట్ ఎఫ్.ఎం. ఛానళ్లు తామరతంపరగా పుట్టుకు వచ్చినా వివిధ భారతి కార్యక్రమాల పట్ల ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గడంలేదు. ఆకాశవాణి కార్యక్రమాలకు శ్రోతలు ఉత్తరాల ద్వారానే ఇమెయిల్స్, ఎస్.ఎం.ఎస్‌ల ద్వారా పాటలు కోరుకుంటున్నారు. ప్రతి రోజు ఆదరణ పెరుగుతుందనడానికి ఒక వారం రోజులు ఆ కార్యక్రమాలు ఎవరైనా వింటే అర్థమవుతుంది. వివిధ భారతి తెలుగు కార్యక్రమాలకు దాదాపు 40 లక్షల మంది రెగ్యులర్ శ్రోతలు ఉన్నట్టు ఒక అంచనా. చాలా గ్రామాల్లో దినసరి కూలీలు చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, క్షురకులకు, దర్జీలకు ప్రతిరోజు రేడియో కార్యక్రమాలు ఒక ఆలంబన. ఉదాహరణకు ఆకాశవాణిలో ప్రసారమ య్యే కార్యక్రమాలు ఏక కాలంలో పండిత పామరులను ఆకర్షిస్తాయి. ఎం తోమంది ఉన్నతాధికారులు, ఉద్యోగులు వివిధ హోదాల్లో ఉన్నవారికి ముఖ్యంగా గృహిణులు, విశ్రాంత ఉద్యోగులకు ఆకాశవాణి ఒక ప్రియనేస్తం. రోజూవారీ పని చేసుకుంటూ శ్రమను మర్చిపోయే వినోదాన్ని పొం దే ఆకాశవాణి శ్రోతలది ఒక కుటుంబం. వారిది ఒక ప్రపంచం. రేడియో తో వారి అనుబంధం వీడదీయలేనిది. ఇప్పటికీ పోస్టాఫీస్‌కు వెళ్లి ఉత్తరాలు కొనుక్కొని నచ్చిన సినిమా పాట లు రాయడం, తిరిగి వాటిని రేడియోలో వినడం అనేది ఒక అనుభూతి. వేలాదిమంది శ్రోతలు ఇప్పటికీ అసంఖ్యాక ఉత్తరాలు రాస్తున్నారంటే రేడియో ఎందరి జీవితాలతో మమైకమైపోయిందో తెలుస్తుంది.

ప్రతిరో జూ శ్రోతలకు బోర్ కొట్టకుండా వివిధ వినూత్న శీర్షికలతో విజ్ఞానాన్ని అందిస్తూ వినోద భరితమైన కార్యక్రమాలు రూపొందించడంలో సమర్పించడంలో వివిధభారతిలోని వివిధ విభాగాలు పడుతున్న శ్రమ శ్రోతలకు వినబడటమే కాదు కనబడుతుంది. చక్కటి భాషా, స్పష్టమైన ఉచ్చారణతో సందర్భోచిత పాటలు వివిధ ప్రత్యేక దినోత్సవాలు సందర్భాలు వివరిస్తూ విశ్లేషిస్తూ ప్రసారం చేసే కార్యక్రమాలు చాలా పరిశోధనాత్మకంగా ఉంటాయి. ప్రతిరోజు హరివి ల్లు బృందావనం శీర్షిక కింద ప్రసారం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. తెలుగుభాషను కాపాడుతున్న ప్రసార, ప్రచార మాధ్యమాల్లో ఆకాశవాణి మొదటిస్థానంలో ఉంటుందని గట్టిగా చెప్పవ చ్చు. ఎక్కడ శృతిమించకుం డా నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేసే సిబ్బంది ఆకాశవాణి సొంతం. 1997లో ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పాటైన నాటి నుంచి ఆకాశవాణి దూరదర్శన్‌లకు గడ్డుకాలం మొదలైంది. కొత్త రిక్రూట్‌మెంట్ లేక ప్రమోషన్లు లేక డిప్యూటేషన్లతో నెట్టుకురావడం. క్రమక్రమంగా ప్రైవేట్ ఎఫ్.ఎం.లకు అనుమతులు ఇవ్వడం. మొదలైన చర్యలతో ప్రభుత్వాలే ఆకాశవాణిని అణగదొక్కాయి. ఆకాశవాణి అందరిది. వివిధ భారతి విభి న్న వర్గాలది, దీన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. ప్రభుత్వ కార్యక్రమాలను పథకాలను ప్రజలకు చేరవేసే ప్రసారభారతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అవసరమైతే వివిధ శాఖల నుంచి ప్రసారభారతి కార్పొరేషన్‌కు నిధులు అందేలా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉన్నది.
suresh-Kaleru
గత ఐదేండ్లలో ప్రభుత్వ పథకాల ప్రచారానికి ప్రధానమంత్రి కార్యక్రమాల ప్రచారానికి వేలకోట్లు వెచ్చించింది. అందులో నుంచి కొంత బడ్జెట్‌ను రేడియోకు కేటాయిస్తే బాగుంటుంది. నరేంద్ర మోదీ గారు మీ మనస్సులో మాటను మాకు అందజేసే సాధనం రేడియో ఒక్కసారి సామాన్యుల మనస్సులో మాట వినండి. ఆకాశవాణి, దూరదర్శన్‌లను కాపాడండి. ప్రసారభారతిని నిలబెట్టండి.

624
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles