పది శాతం నిర్ణయం సరైనదే


Wed,January 9, 2019 11:12 PM

కులాలతో నిమిత్తం లేకుండా పేదవారి కోసం విద్య, ఉద్యోగరంగాల్లో 10 శాతం అవకాశాలను రిజర్వ్ చేస్తూ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదే. ఇటువంటి బిల్లును నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ కాలపు చివరి సమావేశాలలో చివరి రోజున ప్రతిపాదించటం, మరికొద్ది మాసాలలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం కోసమన్నది స్పష్టమే. క్రమంగా ప్రతిష్ఠ దెబ్బతింటున్న బీజేపీ వీలైనంత నష్ట నివారణ కోసం తీసుకుంటున్న, తీసుకోగల చర్యలలో ఇది ఒకటి. ప్రధానమంత్రి ఏ ఉద్దే శం కోసం ఈ పనిచేసినా, అందుకు మనం ఆయనను విమర్శించినా, యథాతథంగా ఆ చర్య వల్ల కలిగే మంచిని విస్మరించటం కూడా సరికాబోదు. రెండింటినీ వేరుచేసి చూడాలి. మంచి చేసే ఉద్దేశం స్వయంగా లేకపోయినా ఎన్నికల కోసమో, మరొక ప్రయోజనం కోసమో, లేక ప్రజ ల నుంచి వచ్చే ఒత్తిళ్ల వల్లనో కొన్ని మంచి పనులు అప్పుడప్పుడు చేయ టం అన్ని పార్టీలు చేస్తుండే పనే. అందువల్లనే ఈ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాలు కూడా అందులోని రాజకీయ ఉద్దేశాలను ఆక్షేపిస్తూనే, బిల్లు వల్ల మంచి జరుగుతుందంటూ బలపరిచాయి. పార్లమెంట్‌కు బయటి సంస్థ లు అనేకం కూడా అదే వైఖరి తీసుకున్నాయి. ఈ చర్యలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇది కోర్టుల విచారణకు నిలబడుతుందా లేదా అనేది తక్షణమైనది, అన్నింటికన్న ముఖ్యమైనది. ఇందుకు సమాధానం కోర్టు తీర్పుద్వారా తెలియగలది మాత్రమే గనుక ఇప్పుడు ఊహించలేము. రిజర్వేషన్ల పరిమాణం యాభై శాతానికి మించరాదని ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పటం, తర్వాత హైకోర్టులు అదే గీటురాయిని పాటించటం తెలిసిందే. అందువల్ల ఈ తాజా 10 శాతం రిజర్వేషన్ నిలబడదన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఇది తేలికగా కొట్టివేయగలది కాదు. అదే సమయంలో రెండు అంశాలను గుర్తించాలి. యాభై శాతం అన్నది అంతిమం కాదన్న సూచన కూడా అదే ఇంద్రా సాహ్నీ తీర్పులో ఉన్నది. నిర్దిష్ట పరిస్థితులు, నిర్ధారిత గణాంక వివరాలు ఉన్నట్లయితే రాష్ర్టాలు తమ నిర్ణయం తాము తీసుకోవచ్చునని కోర్టు ప్రకటించింది.

తర్వాత కాలంలో కొన్ని అదనపు రిజర్వేషన్లను కొట్టివేసినప్పుడు న్యాయమూర్తులు ఎత్తిచూపిన ఒక విషయం అందుకు తగిన సర్వే, గణాంక వివర సేకరణ జరుగలేదని. కనుకనే బలహీన వర్గాల సంఘాలు దేశవ్యాప్తంగా కులగణన జరుగాలని కోరుకున్నాయి. అందుకు కేంద్రం ఇటీవలనే సూత్రప్రాయంగా అంగీకరించింది గనుక, భవిష్యత్తులో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవని భావించవచ్చు. గుర్తించవలసిన మొదటి విషయం ఇది కాగా రెండవది, మంగళవా రం నాటి లోక్‌సభ చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సభ దృష్టికి తెచ్చిన విషయం. యాభై శాతం పరిమితిని కోర్టు ఆర్టికల్ 16(4) కిం దకు వచ్చే సామాజిక-విద్య వెనుకబాటుతనం విషయంలోనే విధించిందని, ఆ విధంగా ఆ పరిమితిలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉమ్మడిగా వస్తారని, సామాజిక-విద్య వెనుకబాటుతనం వర్గీకరణలోకి రాని ఇతర కులాలకు ఆ పరిమితి వర్తించదని అన్నారాయన. ఇది కొత్త తరహా వివరణ అయినట్లు తోస్తున్నది. ఆ మాట నిజమైతే కోర్టులు దానిని ఆమోదించేదీ లేనిది తెలియదు. అదే సమయంలో, రాజ్యాంగస్ఫూర్తిని బట్టి చూసినప్పుడు జైట్లీ వివరణలో ఒక లోపం ఉన్నది. రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ అనే ఆలోచన చేయటానికి మూల కారణం కొన్నివర్గాల సామాజిక వెనుకబాటుతనం. వారిపట్ల సామాజిక వివక్ష. విద్యా వెనుకబాటుతనం కన్న అది ముఖ్యమైనది. భారత సమాజంలోని సామాజిక వివక్షలు వేల సంవత్సరాలుగా అతి హీనమైన విధంగా కొనసాగుతున్నాయి. వీరిలోని ఎంతో విద్యావంతులు, సంపన్నులు కూడా చిన్న చూపునకు గురవుతున్నారు. ఆ దృష్టితో సామాజిక వివక్ష అన్నదే రిజర్వేషన్లకు మూల కారణం అయింది. విద్యా వెనుకబాటుతనానికి కారణం కూడా సామాజిక వివక్షే. అందువల్ల సామాజికం తర్వాత విద్య వచ్చిం ది. పేదరికపు స్థితి ఒక్కోసారి అతి త్వరగా కూడా మారవచ్చు.

కనుకనే రాజ్యాంగ నిర్మాతలు సామాజిక వివక్ష లేని కులాలకు రిజర్వేషన్ల విషయాన్ని అసలు ఆలోచించలేదు. అటువంటి స్థితిలో, జైట్లీ భాష్యం సృజన్మాతకంగా అయితే కనిపిస్తున్నది గాని, న్యాయస్థానాల పరిశీలనకు నిలువగలదా అన్నది ప్రశ్న. జైట్లీ తన ప్రసంగంలో మరొక ముఖ్యమైన విషయం ప్రస్తావించారు. ఆదేశిక సూత్రాలు పౌరులందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం కోసం హామీ ఇస్తున్నాయని అన్నారాయన. అటువంటి స్థితిలో అగ్రకులాలకు ఆర్థిక న్యాయం చేకూరేందుకు అభ్యంతరం ఉండకూడదన్నది ఆయన భావం. ఇది నిజమే గాని, అటువంటి న్యాయాన్ని, సామాజిక వివక్ష అనే కోణంతో అవినాభావ సంబంధం గల రిజర్వేషన్లు అనే ఏర్పాటుతో విడదీసి చూస్తూ, అగ్రకులాలలోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక విద్యా, ఆర్థిక పథకాలను అమలుపరుచడం సరైనదనే వాదన ఒకటున్నది. దీనిపై ప్రభుత్వ ఆలోచన ఏమిటో జైట్లీ వివరణల ద్వారా తెలియరాలేదు. ఇటువంటి ప్రశ్నలపై లోగడ వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులు ఈసారి ఏ వైఖరి తీసుకోగలరన్నది వేచి చూడవలసిన మరొక విషయం. ఒకవేళ బిల్లు/ చట్టం ఇటువంటి అన్ని అవరోధాలను గడిచి అమలు కు వచ్చిన పక్షంలో అప్పుడు ఇతర విషయాలు కొన్ని ముందుకు వస్తా యి. ఒకసారి యాభై శాతం పరిమితిని భంగపరచటమంటూ జరిగితే అది 60 (50 ప్లస్ 10) శాతం వద్ద ఎందుకు ఆగాలన్నది వాటిలో మొదటిది. ఏదైనా పరిస్థితులను బట్టి జరుగుతున్నప్పుడు, అదే పరిస్థితుల కారణంగా 60 శాతం పరిమితి కూడా భంగపడవలసి ఉంటుంది. తమిళనాడు వంటి రాష్ర్టాలు ఇప్పటికే ఆ పని చేశాయి. అసలు అట్లాంటి అత్యధిక రిజర్వేషన్ల సంప్రదాయం రాజ్యాంగం అమలుకు రాకముందు బ్రిటిష్ పాలనాకాలంలో, సంస్థానాల దశలోనే మొదలైంది. దేశంలో గాని, రాష్ర్టాలలో గాని రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాల జనసంఖ్య ప్రాతిపదికగా ఉండాలి అనే డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి.
Ashok
ఆ ప్రాతిపదికను బట్టి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ రాష్ర్టాలకు ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా కోరుతున్నారు. ఆ పార్టీ ఎంపీలు ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అదే విషయం పార్లమెంట్ ముందుకుతెచ్చా రు. దేశానికంతా ఒకే పద్ధతి ఉండాలి గాని ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కటి ఎందుకని ప్రశ్నించారు. ఇప్పుడీ బిల్లు వల్ల కేంద్రానిది ఇంకొక పద్ధతి అవుతున్నది. అందువల్ల, యాభై శాతం పరిమితి భంగపాటును ఆహ్వానించటం మొదట జరుగాలి. అది చారిత్రకమైన ఒక ఇనుప చట్రానికి చారిత్రకమై న భంగపాటు అవుతుంది. ఆ తర్వాత 60 శాతం పరిమితి భంగపాటు కు, తమిళనాడు నమూనాకు తెలంగాణ వలెనే అన్ని రాష్ర్టాలు పట్టుబట్టాలి. ఇంద్రా సాహ్నీ తీర్పులో కోర్టు వారు పరిస్థితిని, వాస్తవ గణాంకాలను బట్టి యాభై శాతం పరిమితిని అధిగమించవచ్చుననే సూచన చేసినప్పుడే ఆ మేరకు సర్వేల కోసం, రాజ్యాంగ మార్పుల కోసం పట్టుబట్టవలసిన బలహీన వర్గాలు, రాష్ర్టాలు కొన్ని దశాబ్దాల పాటు దారుణంగా విఫలమయ్యాయి. కనీసం ఈ చారిత్రక అవకాశాన్ని ఉపయోగించుకొని అందుకు పూనుకోవాలి. ఇక అగ్ర వర్ణాలలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు తప్పక సమర్థించవలసినవే. వారిది కులం ఏదైనా పేదలు. ఈ దేశ ప్రజలు. తమ కులాలకు చెందిన సంపన్నులతో విద్యా, ఉద్యోగ విషయాల్లో పోటీ పడలేక తరతరాలుగా మగ్గిపోతున్నారు. వారికి న్యాయం జరుగాలనటంలో న్యాయం, సహజ న్యాయం, సమభావన, మానవత్వం, సామాజిక దృష్టి, రాజ్యాంగంలోని ఆదేశికసూత్రాల స్ఫూర్తి అన్నీ ఉన్నాయి.

664
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles