కులాతీతంగా ఈబీసీ రిజర్వేషన్లు!


Thu,January 10, 2019 10:12 AM

ramulu-bs

కేంద్రం ఆదరబాదరాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్థికం గా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లు అంటూ నిర్ణయించింది. దీనిపై లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టడం కోల్పోతున్న ప్రతిష్ట నుంచి మతం ప్రాతిపదిక ఇక ఎంతమాత్రం పాచిక పనిచేయడం లేదని గమనించి సామాజిక వర్గాల మధ్య సంఘర్షణాయుత చర్చను లేవదీసి తద్వారా మౌలిక సమస్యలను పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నంలో భాగమే. అయితే ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు ఇప్పటికైనా, ఎప్పటికైనా అవసరమే. కోట్ల సంపద కలిగిన వారితో జనరల్ క్యాటగిరిలో పోటీపడి ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత పదవులు సాధించడం అంత సులభం కాదు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాల్లో లక్షలు పోసి కోచింగ్ లు పొందిన సంపన్నవర్గాల అభ్యర్థులతో గ్రామాల్లో, పట్టణాల్లో వ్యవసా యం, చిన్నచిన్న వృత్తులు చేసుకుంటూ బతికే అగ్రవర్ణ పేదలకు అవకాశాలు అందుకోవడం గగనకుసుమంగా మారింది. ఈ అసంతృప్తినే కొన్ని సామాజికవర్గాలు, పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆయా సామాజికవర్గాల అభివృద్ధి, సంక్షేమానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి సంఘర్షణలు సృష్టిస్తూ వస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన పేదలకు జనరల్ క్యాటగిరిలోని 50 శాతంలో 25 శాతం క్రీమీలేయర్ ప్రవేశపెట్టి అమ లు జరుపడం అవసరం. ఎందుకంటే దేశంలో సంపన్నుల కన్నా, పేదలే ఎన్నో రెట్లు ఎక్కువ. సబ్సిడీ బియ్యం, రేషన్‌కార్డులు అందుకు సాక్ష్యం. అందువల్ల పేదలు అందుకోలేకపోతున్న అవకాశాలను కాలానుగుణంగా సామాజికంగా, విద్యాపరంగానే కాకుండా ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వెనుకబడిన వర్గాలకు జనరల్ క్యాటగిరిలో ఈబీసీ రిజర్వేషన్లు 25 శాతానికి మించి ప్రవేశపెట్టడం అవసరం.

అయితే 1990 నుంచి వేగం పుంజుకున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల విద్య, ఉద్యోగ, పారిశ్రామికరంగాల్లో ప్రైవేటీకరణ పెరిగిపోయింది. అందువల్ల ఏడుగురు మించి ఉన్న ప్రతి సంస్థ లో ఉద్యోగరంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్యారంగంలో, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరుపడం ద్వారా వాటితో పాటు, ఆర్థికంగా వెనుకబడిన పేదలకు 25 శాతం జనరల్ క్యాటగిరిలో రిజర్వేష న్లు అమలు జరుపాలి. తద్వారా జనాభా ప్రాతిపదికన అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందుకునే అవకాశం ఉంటుంది. సామాజిక న్యాయం అంటే కులాలవారీగా మతాల వారీగా మాత్రమే కాకుండా, గ్రామాల వారీ గా, కుటుంబాల వారీగా, నియోజకవర్గాల వారీగా, పేదరికం వారీగా పరిశీలించి అమలు జరుపడం ఎంతో అవసరం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు దేశంలో 70 శాతం. తెలంగాణ రాష్ట్రంలో 85-89 శాతం జనాభాగా ఉన్నారు. 20-25 శాతంగా ఉన్న సామాజికంగా, చారిత్రకంగా గౌరవాలు పొందుతున్న కులాలు 20-25 శాతం మాత్రమే. వీరిలో పేదలు ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా కొంత లబ్ధి పొందే అవకాశం ఉన్నది. జనరల్ క్యాటగిరీలోని ఈబీసీ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజికవర్గాల వారందరికి వర్తిస్తాయి. పేదరికానికి కులం, మతం, ప్రాంతం, భాషలకు అతీతంగా పరిగణనలోకి తీసుకోవ డం జరుగుతుంది. రాజ్యాంగం మూడు అంశాలపై ప్రజాస్వామ్య మూలస్తంభాలుగా పేర్కొన్నది. చట్టసభలు, పరిపాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ అనేవి మూడు మూల స్తంభాలు. చట్టసభల్లో ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతినిథ్యం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు కొంత శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. మహిళలకు, బీసీలకు చట్టసభల్లో, న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు అమల్లోకి రావాలని చాలాకాలంగా బిల్లులు లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్నాయి.

వీటి గురించి పట్టించుకోకుండా, అకస్మాత్తుగా ఆర్థికంగా వెనుకబడిన సామాజికవర్గాల రిజర్వేషన్ల బిల్లును ముం దుకు తీసుకురావడం ప్రస్తుత సందర్భం. కేంద్రంలో 1993 నుంచి ప్రవేశపెట్టిన ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతాని కి గాను 7-11 శాతం మాత్రమే అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం ఉన్నాయి కాబట్టి సగం ఉద్యోగాలు, విద్యావకాశాలు వీరికే చెందాల్సి ఉన్నది. అందుకని ఆయా రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పరీక్ష ఒక్కటే అయినప్పటికీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు నింపడం చారిత్రక అవసరం. ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం పొందిన ప్రైవేట్ పరిశ్రమలు, సంస్థలు అన్నిటిలో రిజర్వేషన్లు అమలు జరుపడం ద్వారా అందరికీ సామాజికన్యాయం, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతాయి. రిజర్వేషన్ల క్యాటగిరీ విద్యార్థులను, అభ్యర్థులను, ఉద్యోగులను వారి నైపుణ్యాలను తీర్చిదిద్దాల్సిన ప్రత్యేక కర్తవ్యం కూడా అనివార్యంగా ముందుకు వస్తుంది. అందువల్ల నియోజక వర్గాల వారీగా, సామాజిక వర్గాల వారీగా, కుటుంబాల వారీగా, చట్టసభల్లో వలె న్యాయవ్యవస్థలో, పరిపాలనా యంత్రాంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో, సమస్త విద్యాసంస్థల్లో, సైనిక రంగాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో రిజర్వేషన్లు అమలుజరిపి నైపుణ్యాలు పెం పొందించడం చారిత్రక ఆవశ్యకత. అప్పుడే సమాజం సమతలంగా అభివృద్ధి చెందుతుంది. ఇకపోతే అందరు ప్రచారం చేస్తున్నట్టు ఈబీసీ రిజర్వేషన్లు అగ్రకుల పేదలకే పరిమితం కాదు. ఈబీసీ రిజర్వేషన్లు అన్ని కులాలకు, అన్ని మతాలకు వర్తిస్తాయి. కులం సర్టిఫికెట్ లేనివారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనే తేడా లేకుండా అందరికీ నూతన అవకాశాలు పెరుగుతాయి.


బీసీలందరూ ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా క్రీమీలేయర్ పరిమితిలో అవకాశాలు పెరుగుతాయి. జనాభా ప్రాతిపదికపై బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి ఉన్నది. బీసీ (ఈ) గ్రూపునకు పెంచిన రిజర్వేషన్లను కూడా కేంద్రం ఆమోదించడం ద్వారా సామాజిక సామరస్యం వెల్లివిరుస్తుంది. ఇవి అందరికి వర్తిస్తాయి. దీంతో అగ్రకుల రిజర్వేషన్ ఉద్యమాలు సృష్టించే సంఘర్షణలకు ఒక ముగింపు లభిస్తుందని ఆశించవచ్చు. 25 శాతానికి ఈబీసీ క్రీమీలేయర్ పెట్టాలని నేను కోరుతున్నాను.ప్రస్తుతం 10శాతం పెట్టారు. ఇంకా 15 శాతం కూడా క్రీమీ లేయర్ పరిధిలోకి తెస్తేనే గ్రామీణ, పట్టణ పేదలకు న్యాయం జరుగుతుంది. అగ్రవర్ణాలుగా పరిగణింపబడుతున్న వారిలోని పేదలు వంద ల వేల కోట్ల సంపన్నులతో జనరల్ క్యాటగిరీలో పోటీపడలేక దశాబ్దాలుగా వెనుకబడిపోతున్నారు. ఇది అమలైతే కొంత స్వాంతన లభిస్తుంది. తద్వా రా రిజర్వేషన్లను వ్యతిరేకించే ప్రస్తుత దశ నుంచి రిజర్వేషన్లను సమర్థించే దిశగా ఎదుగుతారు. అలాగే చట్టసభల్లో, న్యాయవ్యవస్థలో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు అవసరం. చట్టసభల్లో వలె ఉద్యోగ రంగంలో, న్యాయవ్యవస్థలో ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా అమలు జరిగినప్పుడే పూర్తిస్థాయి ప్రజాస్వామ్య వాతావరణం సమాజంలో నెలకొంటుంది. అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అనుభవంలోకి వస్తాయి.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)

1350
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles