నుమాయిష్ హైదరాబాద్ జిందగీ


Tue,January 8, 2019 11:33 PM

కార్ఖానా జిందా తిలస్మాత్ ఉర్దూలో గంభీరంగా ఆ స్వరం వినిపించగానే ఒక్కసారిగా బాల్యం కళ్లముందు మెదులుతుంది. ఘంటసాల స్వరం ఎలా ప్రత్యేకమైందో నుమాయిష్‌లో ఉర్దూ లో వినిపించే ఆ గంభీరమైన స్వరం అలా ప్రత్యేకమైంది. ఆ స్వరం వినిపించకపోతే అది నుమాయిషే కాదు అనుకునేంత ప్రత్యేక ఆకర్షణ ఆ స్వరం. కాలంతో పాటే నుమాయిష్ రూపం మారుతున్నది. స్వరం మారు తున్నది. గతేడాది నుమాయిష్‌కు వెళ్లినప్పుడు ఆ ఉర్దూ స్వరానికి బదులు తెలుగు సినిమాల పాటలు వినిపించాయి. వేల మంది మహిళలు బుర్ఖా లో కనిపించే అపురూప దృశ్యం ఒక్క నుమాయిష్‌కే పరిమితం కావచ్చు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో జరిగే ఎగ్జిబిషన్ అతిపెద్దది కావచ్చు కానీ, దాని చరిత్ర తక్కువే 72లో ఇందిరాగాంధీ హయంలో ప్రారంభమైంది. నుమాయిష్ మాత్రం 1938లో 78 ఏండ్ల క్రితం అప్పటి నిజాం ప్రభుత్వం ప్రారంభించింది. 78 ఏండ్ల క్రితమే హైదరాబాద్‌ను పారిశ్రామికంగా అభి వృద్ధి చేయాలి, ఇక్కడి ఉత్పత్తులకు ప్రచారం కల్పించాలనే ఆలోచన అద్భుతం. వేలాది మంది జనం, వందలాది స్టాల్స్, లక్షలాది రూపాయల కొనుగోళ్లు అమ్మకాలతో సందడి. హైదరాబాద్ పారిశ్రామిక ప్రదర్శనలో సంద డే సందడి. గతేడాది 22 లక్షల మంది సందర్శించారు. మెట్రో రైలు సౌక ర్యం వల్ల ఈసారి అంతకన్నా ఎక్కువమందే వస్తారని అంచనా. హైదరాబాద్ నుమాయిష్ అంటే అంతేనా? ఆరువారాల పాటు ఏర్పడే తాత్కాలిక మార్కెటేనా? కాదు అంతకన్నా చాలా ఎక్కువ. నుమాయిష్ హైదరాబాద్ జిందగీ. ఇప్పుడు ప్రపంచమే ఒక మార్కెట్. అమ్మకాలు కొనుగోళ్ల లెక్కలే తప్ప మానవత్వం, అనుబంధాలు కనిపించని మార్కెట్. అరచేతిలోనే ఇప్పుడు ప్రపంచ మార్కెట్ నిక్షిప్తమైంది.

ప్రపంచంలో ఎక్కడి వస్తువునైనా ఇప్పుడు అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌తో కొనేయవచ్చు. ఒకప్పుడు హైదరాబాద్‌లో షాపింగ్ అంటే అబిడ్స్‌కు వెళ్లాలి. ఇప్పుడు దిల్‌సుఖ్‌నగర్, కొంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్ అటు ఇటూ అని కాదు నగరానికి నాలుగు వైపులా అంతటా కిక్కిరిసిన మార్కెట్లే. అబిడ్స్‌ను మించిన బిజీ షాపింగ్ సెంటర్లే. నుమాయిష్ ఒక మార్కెట్ కాదు. హైదరాబాదీలు జీవితంలో ఒక భాగం, మధురమైన జ్ఞాపకం. తండ్రి చేతులు పట్టుకొని ఓ వింత ప్రపంచాన్ని చూసిన అనుభూతి. తల్లి భుజాలపై ఎక్కి ఆనందపు అంచు లు చూసిన జీవితం. ఇప్పుడు నుమాయిష్ తీరే మారిపోయింది. నుమాయిష్ అంటే ఇప్పుడు బోలెడు షాప్స్, బోలెడు షాపింగ్ అంతే.. నుమాయిష్ అంటే అంతే నా? కాదు అంతే కాదు ఇంకా ఎంతో? హైదరాబాద్‌ను నేనే నిర్మించాను, ఆధునిక తెలంగాణ నిర్మాతను నేనే అని ఆంధ్రా పాలకులు నేటికీ ప్రచారం చేసుకొంటున్నా.. అలా ప్రచారం చేసుకొనే చంద్రబాబు పుట్టడానికి 12 ఏండ్ల ముందు 1938లోనే హైదరాబాద్ నగరంలో పారిశ్రామికాభివృద్ధి కోసం, ఇక్కడి ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం కోసం నిజాం ప్రభువు లు నుమాయిష్‌ను ప్రారంభించారు. గోలకొండ పత్రికలో 1941 జనవరి 6న నుమాయిష్ గురించి వచ్చిన ఒక వార్తను చూస్తే ఆనాటి కాలంలోనే హైదరాబాద్‌లో పారిశ్రామికాభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థమ వుతుంది. ఈ మూడవ ప్రదర్శనను నిజాం ప్రభువు గారి ఆజ్ఞానుసారం ప్రధాన మంత్రి సర్ అక్బర్ హైదర్‌గారు కావించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం ప్రభువు పదహారు అణాల ముల్కీలు. నిజాం ప్రభు వు ఒకసారి తాము తమ దేవిడీలో గోలకొండ సబ్బునే వాడుచున్నామని సెలవిచ్చిరి. అధికారులు అందరూ అదేవిధంగా దానిని వాడి తమ అధికార స్థానాల్లోని అందరికి దాని ప్రాముఖ్యాన్ని నచ్చజెప్పి యుండిన గోలకొండ సబ్బులెందుకు మాయమైయుండును. ఈ రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు బహు ప్రాచీనమైనవి కలవు. ఎన్నో కొత్తవి స్థాపించారు.

పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం, ప్రకటన సౌకర్యాలు లేవు. ప్రభుత్వం వారు వీలైనంతవరకు ద్రవ్య సహాయం చేయుచున్నారు. కానీ, ధనికులు తమ ద్రవ్యాన్ని పరిశ్రమల్లో వినియోగించుట లేదు. వడ్డీ సాగులలో, కౌలు ఖబులియతులలో ఎంత లాభమున్నదో అంత లాభం పరిశ్రమల్లో లేదని ధనికుల అభిప్రాయం. మన రాష్ట్రంలోని పట్టు జలతారు నేతవారును, బంగారు వెండి పనులవారును, తివాసీల వారును, బ్రష్షులు, అద్దములు చేయువారు ,, గుండీలు, సబ్బులు బిస్కట్లు మున్నగునవి చేయువారు తమ తమ వస్తువులను ప్రదర్శించాలి. ఆంధ్ర మహాసభ వారు తెలంగా ణ పరిశ్రమల పట్టికను జిల్లాల నుంచి తెప్పించి వాటి వివరాలతో ఒక లఘు పట్టి క ప్రచురించాలి . (ఇది 194 1 జనవరి 6న గోలకొండలో వచ్చి న ఆనాటి నుమాయిష్ వార్త) 75 ఏండ్ల కిందట నాటి ఈ వార్తను చదివితే నుమాయిష్ ఉద్దేశం, లక్ష్యం, ఆ తరానికి తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిపై ఉన్న అభిమానం తెలుస్తుంది. దాదాపు 80 వరకు నుమాయిష్‌లో పారిశ్రామికాభివృద్ధి ఏ విధంగా సాగుతుందో తెలిపేవిధం గా ఉండేది. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక వ్యవసాయ పనిముట్లను ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచేవారు. దీనివల్ల అన్ని ప్రాంతాల రైతులకు వ్యవసాయంలో వస్తున్న మార్పులు తెలిసేవి. హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తుంది. కేవలం ఉద్యోగులుగానే ఉండిపో కుండా తెలంగాణ యువత స్టార్టప్ కంపెనీల ద్వారా ఎదుగాలని ప్రభు త్వం టీ-హబ్ ఏర్పాటుచేసింది. ఇదే తరహాలో తెలంగాణ యువత పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవిధంగా, వారికీ అవగాహన కలిగిం చేవిధంగా నుమాయిష్ ప్రారంభమైంది.
Murali-Budda
అన్నీ మారుతాయి. మన కోసం ఏదీ ఆగదు, అలానే ఉండిపోదు. నుమాయిష్ అంటే ఒకప్పుడు అక్కడున్న సినిమా తారల బొమ్మలపై చేతులు వేసి నిజంగా వారి భుజాలపై చేతులు వేసి ఫొటోలు దిగినట్టు మురిసిపోయేవారు. పాత తరం హైదరాబాద్ వారందరికీ ఇలాంటి జ్ఞాపకాలుంటాయి. ఇప్పుడు అరచేతిలో స్మార్ట్ ఫోన్లో కెమెరానే కాదు ప్రపంచం అంతా ఉంటుంది. ఇప్పుడు అలా ఫొటోలు దిగడం కనిపించక పోవచ్చు. కానీ యువతను పారిశ్రామికులుగా మార్చడానికి, ఒక ఆలోచ న కలిగించడానికి నుమాయిష్‌ను వాడుకోలేమా?
(వ్యాసకర్త: రాష్ట్ర సమాచార కమిషనర్)

1096
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles