విలక్షణ బాటలో కేటీఆర్


Tue,January 8, 2019 12:59 AM

రాజకీయాలు, రాజకీయ పార్టీలన్నవి ప్రస్తుతం ఉన్న సమాజాన్ని ఏ మేరకు మార్చగలుగుతున్నాయన్నదే సమాజం ముందున్న ప్రశ్న. గ్లోబల్ మార్కెట్ కాలంలో ప్రజలకు చేరువగా ప్రజల కోసం, ప్రజల యొక్క, ప్రజల కొరకు అన్న రీతిలో ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించే నేతల కోసం సమాజం ఎదురుచూస్తున్నది. కొత్త ప్రవాహంలాగా కొత్త రాజకీయ విధానాలను కూడా ఒక్కసారిగా సమాజం జీర్ణం చేసుకోవటం కూడా కొంత కష్టమే, అదికూడా క్రమంగా జరుగాల్సిందే. నాయకుని డ్రెస్‌కోడ్ మారితే కూడా దాన్ని జీర్ణం చేసుకోవటం కష్టం. ఇప్పటివరకు అభివృద్ధి ఏమీ జరుగలేదనలేము కానీ, గత పాలకుల పని విధానాన్ని, ఆ పార్టీల పోకడలను, ప్రయాణాలను కాలం చూసింది. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏండ్లు పనిచేసిన ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌కే తొలి రాష్ట్ర పాలనాపగ్గాలను ప్రజలు అందించటం మామూ లు విషయం కాదు. ఓట్లు వేయటం మాత్రమే కాకుండా కేసీఆర్ పాలనాపరంగా తీసుకునే నిర్ణయాలను కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆకళింపు చేసుకుంటున్నారు. కొత్తగా రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతున్నప్పుడు సమాజం దృష్టంతా పునర్నిర్మాణం పైనే ఉంటుంది. ఉండాలి కూడా. ఈ సమయంలో పాలనారంగాన్ని నడిపేవారి కృషి, పట్టుదల, దీక్ష ఎంతో ముఖ్యమైనవిగా ప్రజలు పరిగణిస్తారు. సరిగ్గా ఉద్యమంలో, పాలనలో రెండుచోట్ల సీఎం కేసీఆర్ దీక్షతోనే పని చేస్తున్నారు. అందుకు మొత్తంగా పాలనారంగాన్ని, తన దీక్షవైపునకు లక్ష్యంవైపునకు మళ్లించే పనిలో కేసీఆర్ కృతకృత్యులయ్యారు. అట్లనే మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యేలను, టీఆర్‌ఎస్ పార్టీని, కలసివచ్చే వారందరినీ నిర్మాణం పనుల్లో నిమగ్నం చేశారు. ఇది సందర్భం. దీన్నెవరూ కాదనలేరు. రెండోసారి కూడా కేసీఆర్‌కే ప్రజ లు మద్దతు ప్రకటించి తిరుగులేని విజయాన్నందించారు.

ప్రజలకు అత్యవసరమైన పనులకు మొదటి ప్రాధాన్యంగా తీసుకొని కేసీఆర్ ప్రభుత్వం అడుగులువేసింది. భూమినే నమ్ముకున్న భూమి పుత్రులకు అండగా నిలబడింది. కేసీఆర్ సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి దేశంలోనే నంబర్‌వన్‌గా తెలంగాణను నిలుపగలిగారు. ఈ పనులన్నీ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజం హర్షించింది. రైతుబంధు వంటి పథకాల దగ్గరినుంచి ప్రతి ఇంటి తలుపును తట్టి ఏదో ఒక సహాయం చేయాలన్న మహత్తర సంకల్పంతో టీఆర్‌ఎస్ ముందుకుసాగుతున్నది. ఇంతపెద్ద పనులు జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర మంత్రివర్గంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో కేటీఆర్‌కు తన పేజీలు తనకున్నాయి. అయితే కేటీఆర్ విధానం వేరు. స్వతంత్రంగా ఆలోచిస్తాడు. ప్రతి పనిలో సృజనాత్మకతను వెతుక్కుంటా డు. మాటను సూటిగా బాణంలా వదులుతాడు. సంప్రదాయంగానే వెళ్లాలన్న పాతగేట్ల తాళాలు పగులగొట్టి, కొత్త సంస్కృతికి తలుపులు తెరుస్తా డు. పైరవీ రాజకీయాలను వ్యతిరేకిస్తాడు. ప్రతి విషయంపై వెంటనే స్పం దించే తత్వం ఉన్నది. అలాంటి స్పందనల రక్తనాడులు ఉండబట్టే కేటీఆ ర్ ఈ రాజకీయ చట్రంపై కొత్తగా ఆవిష్కరించబడుతున్నాడు. ఆయనకు పొగడ్తలు పడవు. పొగిడించుకోవటాలు, మెడల్లో గజమాలలు వేసుకోవటాలు ఇష్టపడడు. కొత్త వ్యవస్థ నిర్మాణం కోసం రూపొందుతున్న నాయకుడిగా కేటీఆర్ కనిపిస్తాడు. తాను చేసే పనులతో, తన ఆలోచనలతో ముందుకుసాగటం వల్ల ఈ రాజకీయరంగంలో నూతన నాయకునిగా రూపుదిద్దబడుతున్నాడు. నాయకుడు చేసే పనుల వల్ల వ్యవస్థకు వెలుగు రావాలని కోరుకుంటారు. ఆ దృష్టిలో కొత్త బాటలు వేసే వారికోసం సమాజం ఎదురుచూస్తుంది.

ఈ లక్షణం కేటీఆర్‌లో కనిపిస్తుంది. ఇలాంటి వారు ప్రచార ఆర్భాటా లు పటాటోపాలు ప్రదర్శించరు. వ్యక్తిగత ప్రచారం చేసుకొని తమకు తాము ప్రమోషన్ వర్క్ చేసుకునే ఈ కాలంలో కేటీఆర్ విభిన్నంగా కనిపిస్తాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఎవరూ హంగామాలు చేయవద్దని, రోడ్లమీద హోర్డింగులు పెట్టవద్దని, ఏ రకమైన ప్రచారాలు చేయవద్దని కేటీఆర్ ట్విట్టర్‌లో సందేశం పంపాడు. ఇది కేటీఆర్ పుట్టిన రోజుకు ముం దునాడే అన్ని దినపత్రికల్లో వచ్చింది. నిజంగా ఆ రోజు దినపత్రికల్లో కేటీఆర్ ట్విట్టర్ సందేశం చదివి చాలామంది సంతోషించారు. కేటీఆర్‌కు పుట్టినరోజు వేడుకలపై నమ్మకం ఎంతవరకు ఉందో తెలియ దు. ప్రజల కోసం సేవచేసిన వారిని ప్రజలు గుండెల్లో దాచుకోవాలి కానీ ఈ హోర్డింగ్‌లో, కటౌట్లలో కాదన్న దాన్ని కేటీఆర్ విశ్వసిస్తాడనుకుంటా! సరిగ్గా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తను అధికారికంగా పర్యటన చేస్తూ వెళ్తున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భం గా ఒక పెద్ద హోర్డింగ్ రాజధానిలో కన్పించింది. వెంటనే కారు ఆపి ఆ హోర్డింగ్‌కున్న ప్లెక్సీని చించేసి కాల్చివేశాడు. ఈ హోర్డింగ్‌లు పర్యావరణానికి తీవ్ర నష్టం కల్గిస్తున్నాయి. అయినా నాకు ఇష్టం లేని ఈ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రంలో ఎవరూ జరుపవద్దని, దయచేసి ప్లెక్సీలు పెట్టవద్దని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. ప్లెక్సీలు, హోర్డింగ్‌ల ద్వారా నాయకులు వెలిగిపోరు. తాము చేసే పనుల ద్వారానే వాళ్లు ప్రజ ల్లో మాణిక్యాల్లా మెరిసిపోతారు. సరిగ్గా కేటీఆర్ కూడా అదే పని చేశాడు. ఎవరు ప్రజలకు ఏం సహాయం చేశారో, అసలు ఎవరు ప్రజల కోసం పనిచేశారో, చేస్తున్నారో ప్రజలు గమనిస్తారు. ప్రస్తుతం సమాజంలో వ్యక్తిగతంగా ప్రచార డాంబీకాలు పెరిగిపోయాయి.

వార్డ్ మెంబర్ల నుంచి చిన్నస్థాయి పోస్టులు గలవారి దగ్గర్నుంచి పెద్ద హోదాలు, మంత్రుల స్థాయివరకు పుట్టినరోజు లు, పెండ్లిరోజులు, పండుగలకు, పబ్బాలకు, చివ రికి దైవకార్యాలన్నింటికీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో కటౌట్లతో ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇదేం సంస్కృతి? దీన్నెవరు ఆపాలి? ఈ కోణంలోనే కేటీఆర్ తన పుట్టినరోజున ఇచ్చిన ట్విట్టర్ సందేశం ఆహ్వానించదగింది. అదే విధంగా తన మంత్రిత్వ శాఖ పరిధిలోకొచ్చే అన్ని మున్సిపాల్టీల్లో అక్రమంగా అడ్డంగా పెట్టిన హోర్డింగ్‌లన్నింటిని తొలిగించమని ఉత్తర్వులు జారీచేశారు. నాయకులకు కాకుండా ప్రజలకు చేసే సేవకు ప్రచారం జరుగాలని కేటీఆర్ కోరుకుంటున్నారనుకుంటా. ఆ దృక్పథం ప్రజల్లోకి విస్తృతంగా పోవాలని ఆయన తలంచుతున్నారు. ప్రజలందరిలో సేవా దృక్పథం పెంపొందించాలి. ప్రజల కోసం పని చేసేవారి కి మార్కెట్లోకి వచ్చిన కొత్త కార్లు లేదా కొత్త వస్తువు అడ్వర్టయిజ్‌మెంట్‌లాగా ప్రచారం ఎందుకని కేటీఆర్ ఆలోచన. ఇది మంచి ఆలోచన. ఈ ఆలోచనను ప్రతి ఒక్కరూ ఎవరికివారుగా ఒంటపట్టించుకొంటే తమ పుట్టిన రోజులను ప్రజలకు అంకితం చేసి ఏదో ఒక మంచి పనిచేస్తారు. ఈ దారిలో ఇప్పటికే కొందరు ముందుకు సాగుతున్నారు. మొత్తంగా ప్రజలందరిలో ఆ రకమైన ఆలోచనలు పెరుగాలనే కేటీఆర్ తన పుట్టినరోజు విషయంలో గతంలోనే ప్రకటన చేశారు. అభిమానులకు అభిమాన సంఘాలుండటం అందరూ ఒప్పుకోవచ్చు. ఒప్పుకోకపోవచ్చును. కానీ, ఒక వ్యక్తిపై, ఒక నాయకునిపై అభిమానం ఉండటం అంటే ఆ నాయకుని ఆలోచనలను గౌరవించటం, ఆ దారిలో నడువటం చేయాలి.
juluri-gouri-shanka
చాలావరకు ఒక నాయకునిపై ప్రేమ కలిగి ఉండటమంటే అతని భావజాలాన్ని ఆచరించటానికి లేదా ఆ భావజాలాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడానికి కృషి చేయాలి. కానీ, అభిమాన సంఘాలు కూడా చివరికి ఎటుపోతాయో కేటీఆర్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనపేరుతో ఎలాంటి సంఘాలు ఏర్పాటు చేయవద్దని ఖరాఖండిగా చెప్పారు. అదేకాకుండా తనపేరుతో ఏర్పాటుచేస్తు న్న పలు సంఘాలకు, అభిమాన సంఘాలకు తనవైపు నుంచి ఎటువంటి మద్దతు లేదని బహిరంగంగా ప్రకటించడంతో ఆలోచపరులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇంకో అడుగు ముందుకేసి ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా అభిమాన సంఘాల పేర్లతో ఎలాంటి కార్యకలాపాలు చేయవద్దని చెప్పాడు. తనపై అభిమానం ఉంటే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ కోసం పనిచేయమని కోరారు. ప్రజల కోసం పనిచేయటం కంటే ఉన్నతమైనది మరొకటిలేదన్న సందేశాన్ని ఈ ప్రకటన ద్వారా కేటీఆర్ ప్రజలముందుంచారు. కేటీఆర్ రొటీన్ రొడ్డకొట్టుడు రాజకీయాన్ని, తెలంగాణలో పాకురు పట్టిన ఆధిపత్య రాజకీయాల్ని చెక్కివేయాలని చూస్తున్నాడు. అందుకే పాత మూసపద్ధతుల గోడలను పగులుగొడుతున్నాడు. పాత రోత రాజకీయాలు పోవాలి. నూతన రాజకీయాల ఆవిష్కరణలు జరుగాలి. తెలంగాణ సమాజం కోరుకునేది అదే. ఆ వైపుగానే కేటీఆర్ అడుగులు వేస్తున్నాడు. మంచికోసం వేసే ప్రతి అడుగుకు సమాజం దారిస్తుంది.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)

686
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles