e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home ఎడిట్‌ పేజీ జల, విద్యుత్‌ విధానకర్త

జల, విద్యుత్‌ విధానకర్త

జల, విద్యుత్‌ విధానకర్త

దేశ జలవనరుల అభివృద్ధిపై స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం అంబేద్కర్‌ ఆలోచనలు విశేషంగా దోహదపడిన సంగతి వెలుగులోకి రాలేదు. ఆయన రచనల సంపుటాల్లో కూడా ఇవి చోటుచేసుకోలేదు. 2015లో తెలుగు అకాడమీ వారు ప్రచురించిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రసంగాలు రెండవ సంపుటిలో ఈ అంశంపై నాలుగు ప్రసంగ వ్యాసాలు చోటుచేసుకున్నాయి. అంతకు చాలాకాలం పూర్వమే 1993లో కేంద్ర జలసంఘం వారు ‘అంబేద్కర్‌ కంట్రిబ్యూషన్‌ టు వాటర్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌’ అనే శీర్షికతో ఒక సమగ్రమైన పుస్తకాన్ని వెలువరించారు.
దేశ జలవనరుల అభివృద్ధిపై పాలసీల రూపకల్పనలో అంబేద్కర్‌ కృషి పెద్దగా చర్చకు రాకపోయినప్పటికీ అత్యంత ప్రాముఖ్యం కలిగినది. అంబేద్కర్‌ రెండు సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొని జల వనరుల అభివృద్ధి పాలసీలను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఒకటి 1942- 46 మధ్యకాలంలో వైస్రాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సెల్‌లో కార్మిక, పరిశ్రమలు, సాగునీరు, విద్యుత్‌ శాఖలను నిర్వహించినప్పుడు; రెండవది 1947- 52 మధ్యకాలంలో నెహ్రూ మంత్రి వర్గంలో న్యాయశాఖా మంత్రిగా పనిచేసినప్పుడు, జలవనరుల అభివృద్ధికి సంబంధించిన పాలసీలను రూపకల్పన చేయడంలో తన శాఖలకు మార్గనిర్దేశనం చేశారు. 1937లో భారత ప్రభుత్వం కార్మికశాఖను ఏర్పాటుచేసినప్పుడు పరిశ్రమలు, సాగునీరు, విద్యుత్‌ ఇతర ప్రజా పనుల విభాగాలు కూడా కార్మికశాఖ పరిధిలోనే ఉండేవి. కాబట్టి సాగునీరు, విద్యుదుత్పత్తి, జలవిద్యుత్‌ ఉత్పత్తి విధానాల రూపకల్పనను 42-46 మధ్య కార్మికశాఖ ఇంఛార్జిగా ఉన్న అంబేద్కర్‌ చూసుకోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో పాలసీ పరమైన అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి ఫలితంగా ఈ కింది ప్రణాళికలు రూపొందాయి.
జలవనరుల అభివృద్ధి, విద్యుత్‌ ఉత్పత్తికి దేశమంతటికీ వర్తించే నిర్దిష్ట పాలసీ రూపకల్పన: ఈ రెండు అంశాలపై సాంకేతిక, పరిపాలనా అంశాలు పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన సంస్థలను ఏర్పాటు చేశారు. నాడు అట్లా ఏర్పాటైనదే సెంట్రల్‌ వాటర్‌ వేస్‌, ఇరిగేషన్‌ నేవిగేషన్‌ కమిషన్‌ (సీడబ్ల్యూఐఎన్‌సీ). అన్ని రాష్ర్టాలు, ప్రావిన్స్‌ల ప్రభుత్వాల అంగీకారంతో 1945 ఏప్రిల్‌లో ఈ కమిషన్‌ ఏర్పాటైంది. ఈ మాతృ సంస్థ నుంచే ఇప్పుడున్న కేంద్ర జల సంఘం, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ పవర్‌ మొదలైన సంస్థలు, కేంద్ర విద్యుత్‌ అథారిటీ ఆ తర్వాతకాలంలో ఏర్పాటైనాయి. కేంద్రం, రాష్ర్టాల నిర్వహణలో ప్రధాన నదీజలాల అభివృద్ధికి అథారిటీలను (River Vally Authority) ఏర్పాటుచేయడం కూడా కీలక నిర్ణయం. ఈ కారణంగానే బీహార్‌, బెంగాల్‌ రాష్ర్టాల్లో దామోదర్‌ రివర్‌ వ్యాలీ అథారిటీ, ఒడిశా రాష్ట్రంలో సోన్‌ రివర్‌ వ్యాలీ అథారిటీ, మహానదీ రివర్‌ వ్యాలీ అథారిటీలు ఏర్పడినాయి. అట్లానే సెంట్రల్‌ ప్రావిన్స్‌లో చంబల్‌ రివర్‌ వ్యాలీ అథారిటీ కూడా ఏర్పాటైంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణా నదీజలాల పంపిణీకి బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ పనిచేస్తున్న సంగతి ఎరుకే. ఈ రకంగా భారతదేశంలో నదీజలాల అభివృద్ధికి, విద్యుత్‌ ఉత్పత్తికి, వరదల నియంత్రణకు, నౌకయానం అభివృద్ధికి పాలసీలు రూపొందించడంలో అంబేద్కర్‌ పాత్ర గణనీయమైనది.


మహానది, సోన్‌ లాంటి అనేక చిన్నా పెద్ద నదులు ప్రవహిస్తున్న ఒడిశా రాష్ట్రం అన్నిరంగాల్లో వెనుకబడిపోవడం పట్ల అంబేద్కర్‌ అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశాలో నదీజలాల అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. 1945 నవంబర్‌ 9న కటక్‌లో ఒడిశా నదుల అభివృద్ధిపై జరిగిన సదస్సులో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏ ఇతర ప్రాంతానికి తీసిపోని సహజ వనరులున్న ఒడిశా ఇంకా ఎంతమాత్రం అట్లాగే ఉండటానికి వీల్లేదు. బొగ్గు, ఇనుప ఖనిజం, గ్రాఫైట్‌, బాక్సైట్‌, సున్నపురాయి, మైకా, వెదురు, కలప లాంటి ప్రాధాన్యం కలిగిన సహజవనరులెన్నో ఒడిశాలో ఉన్నాయి. వీటికిమించి అతి ముఖ్యమైన జల సంపద ఒడిశా ప్రత్యేకత. మహానది, బ్రాహ్మణి, వైతరణి నదులు, వాటి ఉపనదుల సముదాయం కటక్‌, పూరీ, బాలసోర్‌ జిల్లాల్లో 8 వేల చదరపు మైళ్ల మేర విస్తరించి ఉన్నాయి. ఇన్ని వనరులున్న ఒడిశా ఎందుకు వెనుకబడిందని అంబేడ్కర్‌ వాపోయారు. నదీజలాల అభివృద్ధికి సరైన ప్రణాళికలు అమలుజరిపితే భవిష్యత్తులో ఒడిశా తన వనరులను వినియోగించుకోగలదని, సమృద్ధిగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోగలదని, వరదల నియంత్రణకు, నౌకయానానికి జలవనరులు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో ఏర్పాటైన టెన్నేసి వ్యాలీ అథారిటీ, అక్కడి అభివృద్ధి ప్రణాళికలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ మోడల్‌ భారతదేశ నదుల అభివృద్ధికి బాగా పనికివస్తుందని ఆయన భావించారు. టెన్నేసి వ్యాలీ అథారిటీ స్ఫూర్తితో నాడు ఆయన రూపొందించిన ప్రణాళికల కారణంగానే బీహార్‌, బెంగాల్‌ రాష్ర్టాల్లో దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్ట్‌ అథారిటీ ఏర్పాటైంది. ఇదే భారత్‌లో ఏర్పాటైన మొదటి రివర్‌ వ్యాలీ అథారిటీ. అట్లానే ఒడిశాలో సోన్‌ వ్యాలీ ప్రాజెక్టు, మహానదిపై హీరాకుడ్‌ ప్రాజెక్టులు నిర్మాణమై ఒడిశా అభివృద్ధికి బాటలు వేశాయి.
‘గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ 1935’లో నదీజలాల అభివృద్ధి అంశం రాష్ర్టాల పరిధిలోనే ఉండేది. కేంద్ర న్యాయశాఖా మంత్రిగా ఉన్నప్పుడు 1948లో ఒక సవరణ ద్వారా అంతర్రాష్ట్ర నదీజలాల అబివృద్ధికి చట్టాలను చేసే అధికారాన్ని కేంద్రానికి దాఖలు పరిచే ఆర్టికల్‌-74ను పార్లమెంట్‌లో అంబేద్కర్‌ ప్రవేశపెట్టారు. అట్లా 1935 చట్టంలో లేని అధికారాలు కొంతమేరకు కేంద్రానికి ఈ ఆర్టికల్‌ ద్వారా సంక్రమించాయి.
అట్లానే రాష్ర్టాల మధ్య తలెత్తే నదీజలాల పంపిణీ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రప్రభుత్వం నదీజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో ఆర్టికల్‌ 262ను చేర్చడంలో కూడా అంబేద్కర్‌ కీలకపాత్ర పోషించారు. ఆర్టికల్‌ 262 రాజ్యాంగంలో చేర్చబడిన తర్వాత 1956లో అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఆధారంగానే రావి బియాస్‌, కృష్ణా, గోదావరి, కావేరీ నదీజలాల ట్రిబ్యునళ్లు ఏర్పాటైనాయి.

జల, విద్యుత్‌ విధానకర్త

Advertisement
జల, విద్యుత్‌ విధానకర్త
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement