e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ఎడిట్‌ పేజీ విపక్షం ఉల్టా.. పల్టా!

విపక్షం ఉల్టా.. పల్టా!

విపక్షం ఉల్టా.. పల్టా!

సాధారణంగా ఎక్కడైనా సరే ఒక క్యాబినెట్‌ మంత్రి అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు వస్తే.. ప్రతిపక్ష పార్టీలన్నీ అతనిపై దుమ్మెత్తిపోస్తాయి. పదవికి రాజీనామా చేయాలని పట్టుబడతాయి. సంబంధిత మంత్రిని డిస్మిస్‌ చేయాలని రోడ్డెక్కి ఆందోళనలు చేస్తాయి. సహజంగా ఇది ఎక్కడైనా జరిగేదే, జరుగుతున్నదే. కానీ చిత్రంగా తెలంగాణ ప్రతిపక్షాలన్నీ రివర్స్‌ గేర్‌లో వెళ్తున్నాయి. ఇదో కొత్త సంప్రదాయం. అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చినా, ఈటలను వెనకేసుకువస్తున్నాయి. మద్దతు తెలుపుతున్నాయి.

నిన్న మొన్నటివరకూ రాష్ట్ర క్యాబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జట్టు కట్టకముందు రాజకీయాల్లో అనామకుడు. చదువుకున్న రోజుల్లో విద్యార్థి సంఘాల్లో పాత్రే తప్ప, పెద్ద ఉద్యమ చరిత్ర కూడా లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో కనీసం సర్పంచ్‌గా గెలిచినది కూడా లేదు. ఈటల టీఆర్‌ఎస్‌ పార్టీలోకి రావడానికి ముందే, రాష్ట్రమంతటా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉర్రూతలూగిస్తున్నారు కేసీఆర్‌. ఆ పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన యువకుడు ఈటలకు కేసీఆర్‌ అన్నీ తానై అండగా నిలిచారు. పార్టీలో కాకలుతీరిన నాయకులున్నా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెట్టాడు. రాజేందర్‌కు పార్టీ, పార్టీ అధినేత ఉపయోగపడ్డారే తప్ప, రాజేందర్‌తో పార్టీకి కానీ, కేసీఆర్‌కు కానీ ఒనగూడిన ప్రయోజనం ఏమీ లేదన్నది మొదటి నుంచీ పార్టీలో ఉన్న ముఖ్యులెవరినడిగినా చెప్తారు. ఒక జర్నలిస్టుగా నేను గమనించింది కూడా అదే.

ఈటల రాజేందర్‌పై తాజాగా వచ్చిన అభియోగాలు తీవ్రమైనవి. ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు, అసైన్డ్‌, సీలింగ్‌, దేవాదాయ భూములను చౌకగా కొని ఆస్తులు పెంచుకున్నట్టు తెలుస్తున్నది. అవే భూములను జాతీయ బ్యాంకు ల్లో తాకట్టు పెట్టి వందల కోట్ల రుణం కూడా తీసుకున్నట్టు బయటపడింది. అధికారుల ప్రాథమిక విచారణలోనూ ఈటల అవినీతికి పాల్పడినట్టు తేలడంతోనే ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి పదవి నుంచి తొలగించారు.

అవినీతి మరకలతో మంత్రి పదవి నుంచి తొలగించబడిన రాజేందర్‌కు అనూహ్యంగా ప్రతిపక్షాల నుంచి మద్దతు లభిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇదో సిగ్గుమాలిన కొత్త సంప్రదా యం. ప్రభుత్వం మీదనో, ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనో ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకభావం ఉంటే ఉండొచ్చు. రాజేందర్‌ లాగే అవినీతి ఆరోపణలు వచ్చిన వారు ఇంకా ఉండి ఉంటే దానికోసం కూడా పట్టుబట్ట వచ్చు, ఆందోళనలు చేయవచ్చు. వారిపై కూడా విచారణలు కోరవచ్చు. ఇంకా మిగిలిన విషయాల్లో ముఖ్యమంత్రితో ఎన్నైనా విభేదించవచ్చు, తప్పులేదు. కానీ అవినీతి మరకలు అంటిన మంత్రిని తొలగొస్తే ప్రతిపక్షాలు సంబంధిత వ్యక్తిని వెనకేసుకురావడం విషాదం. ఇంకా ఆయన సామాజిక వర్గంను దృష్టిలో పెట్టుకొని సానుభూతిని వ్యక్తం చేయడం విడ్డూరం. ఈ పరిణామాలను గమనిస్తూ జనం నవ్వుకుంటున్నారు. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా విజృంభిస్తున్న వేళ రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల పనితీరు కూడా మెచ్చుకోలుగా ఏమీ లేదు. ఆయన వైఫల్యం కళ్లకు కట్టినట్టు కనిపించింది. అయినా ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ను వీడి తమ తమ పార్టీల్లోకి వస్తాడనే ఆశతోనే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు ఆయనకు మద్దతు తెలుపుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇది రాజకీయ దిగజారుడుకు నిదర్శనం.

కేవలం కేసీఆర్‌పై ఉన్న గుడ్డి వ్యతిరేకతతోనో లేదా తమ రాజకీయ ప్రయోజనాల కోసమో ప్రతిపక్ష పార్టీలు ఇంతలా బరితెగించడం క్షమించరానిది. ఇలాంటి పరిణామాలు రాజకీయ అవినీతిని మరింతగా ప్రోత్సహించేవే. రాజకీయ లబ్ధి కోసం అవినీతిని నెత్తికెత్తుకోవటం మంచి సంప్రదాయం కాదు. అవినీతి అక్రమా లను అందరూ అసహ్యించుకు కోవాలి.
(వ్యాసకర్త: శ్రీనివాస్‌గౌడ్‌ ముద్దం, సీనియర్‌ జర్నలిస్టు)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విపక్షం ఉల్టా.. పల్టా!

ట్రెండింగ్‌

Advertisement