e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home ఎడిట్‌ పేజీ మన కవిత్రయం

మన కవిత్రయం

సమాజంలో రచయితలు, కవులు సందర్భానుసారంగా ప్రజలను చైతన్యపరిచి మార్పుతెచ్చిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు భారత స్వాతంత్య్ర సమరంలో బంకించంద్ర ఛటోపాధ్యాయ నింపిన చైతన్యం, విశ్వకవి రబీంద్రనాథ్‌ ఠాగూర్‌ వల్ల కలిగిన ప్రేరణ దేశ దిశనే మార్చివేసింది. తెలంగాణలో కూడా అలాంటి పేరుగాంచిన కవులు, రచయితలు ఎందరో ఉన్నారు. ఆ కవుల/రచయితల ప్రభావం సమాజంపై ఎంతగానో ఉన్నది.

వీరిలో సి.నారాయణరెడ్డి, దాశరథి, కాళోజీ ముందువరుసలో ఉంటారు. వారు తెలంగాణ సమాజాన్ని వారి వారి పద్ధతిలో ప్రభావితం చేశారు, వారితో ప్రేరణ పొంది రచనలు చేసినవారు, కవులు అయినవారు, సమాజం కోసం ఆరాటపడిన వారు, ఉద్యమించిన వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే వీరు ముగ్గురిని తెలంగాణ ‘కవిత్రయం’గా చెప్పుకొంటారు.

- Advertisement -

రచనలతో తెలుగు సాహితీ గగనంలో మెరిసిన కవికిరణం నిజాం వ్యతిరేక పోరాటాంలో గర్జించిన యువ కిశోరం పదముల పదనుతో నిజాంకే నిద్రలేకుండా చేసిన అతిరథి తన కలం బలంతో ప్రజలను నిద్ర లేపిన మహారథి దాశరథి.

దాశరథి కవి, రచయిత, సినీ గీత రచయిత, తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు. ఆయన ఏడేండ్లు అంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవిగా ఉన్నారు. దాశరథి బహుభాషా కోవిదుడు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, తమిళ, ఇంగ్లీష్‌ భాషలందు మంచి పట్టు ఉండేది. దాశరథి రెండు వేలకు పైగా సినీ గీతాలు రచించి తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారు. దాశరథి తెలంగాణ సాయుధ పొరాటంలో పోషించిన పాత్ర ఎంతో మహత్తరమైనది. అది యువతకు పెద్ద ప్రేరణ కలుగజేసింది. 20 ఏండ్ల వయసులోనే దాశరథి నిజాంకు వ్యతిరేకంగా రాసిన పదునైన పదాలు, పద్యాలు నిజాం గుండెల్లో గుబులు పుట్టిస్తే, మరోవైపు ప్రజల్లో చైతన్యాన్ని నింపాయి. 22 ఏండ్ల వయసులోనే ఆయన ‘అగ్నిధార’ పుస్తకం అచ్చు వేయబడింది. 49వ ఏట జాతీయ సాహిత్య అకాడమి అవార్డు రావడం, 52వ ఏట ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవిగా నియమించబడటం ఆయన అధిరోహించిన ఉన్నత శిఖరాలకు ఉదాహరణలు.

కాళోజీ నారాయణరావు ప్రజాకవి, రచయిత, రాజకీయ వాది. అన్నింటికి మించి ప్రజల మనిషి. నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేసిన వీరులలో అగ్రగామి కాళోజీ. హైదరాబాద్‌ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, పీవీ లాంటి వారితో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. నిజాం హైదరాబాద్‌ రాజ్యంలో తెలుగు భాష అస్తిత్వాన్ని కాపాడేందుకు, ఔన్నత్యాన్ని చాటేందుకు 1943లో ఆంధ్రసారస్వత పరిషత్తు ఏర్పాటుచేసిన వారిలో కాళోజీ ఒకరు. అది మొదలు కాళోజీ తెలుగు భాషా సేవ ఆయన చనిపోయే వరకు అప్రతిహతంగా కొనసాగింది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ పదవులను ఆశించకుండా సాధారణ జీవితం గడిపిన కాళోజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆదర్శాలను ఎన్నడూ విడనాడలేదు. కాళోజీతో పాటు పనిచేసినవారు నలుగురు ముఖ్యమంత్రులైనారు, ఒకరు ప్రధాని అయినారు. అయినా కాళోజీ ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు. తన బతుకు తను బతుకుతూ.. ప్రజల గొడవను తన గొడవగా చెప్పుకొన్నారు.

కాళోజీ రాజకీయ జీవితం కాంగ్రెస్‌తో మొదలైనప్పటికీ కొద్దికాలంలోనే కాంగ్రెస్‌ను వీడి జీవితాంతం స్వతంత్రుడిగా వ్యహరించారు. కాళోజీ తన కలం, గళం ద్వారా మానవహక్కులను కాపాడటానికి నిరంతరం పోరాడారు. కాళోజీ తన రచనలు, వ్యక్తిత్వం, చేసిన పోరాటాల వల్ల ప్రజాకవి అయ్యారు.

తూటాల్లాంటి మాటలతో కత్తిలాంటి కవితలతో సందేశం
కోరుకున్నదెప్పుడూ సామాన్య ప్రజల సంక్షేమం
అందరి గొడవే తన గొడవంటూ స్ఫూర్తిదాయకం
జీవితమే ఒక పొరాటం, ప్రజలే కాళోజీ ఆరాటం

సినారె కవిగా, రచయితగా, సినీ గేయ రచయితగానే కాకుండా ఒక ప్రొఫెసర్‌గా, వైస్‌ఛాన్స్‌లర్‌గా ఆ పదవులకే వన్నె తెచ్చారు. సినారె వాఖ్యాతగా సాంస్కృతికరంగంపై అలరించారు. సినారె వ్యక్తిత్వం వెనుక రాజసం దాగి ఉన్నది. ఆయన విజయాల వెనుక అపార ప్రజ్ఞా పాటవాలున్నాయి. దీనివల్ల ప్రజల్లో తెలుగు పండితులంటే, రచయితలంటే గౌరవం పెరిగింది. అలాగే తెలుగు భాషను నమ్ముకుంటే ఒక భవిషత్తు ఉంటుందన్న విశ్వాసం కూడా కలిగింది.

సినారెతో నాకు అనుబంధం ఉంది. అదొక విధంగా ఏకలవ్య సంబంధమే. మేం చిన్నప్పుడు చిక్కడపల్లిలో ఉన్నప్పుడు సినారె ఇంటిముందరి నుంచి లైబ్రరికి వెళ్లేవాళ్లం. అలా వెళ్లేటప్పుడు సినారె పేరు Name Plateపై చూసినప్పడల్లా అంత ప్రఖ్యాత రచయితతో ఒక ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లే గొప్ప అనుభూతి కలిగేది. కొన్నేండ్ల తర్వాత మా నాన్నకు కరీంనగర్‌ బదిలీ అయ్యింది. అక్కడ మా బడిలో తెలుగు టీచర్‌ సినారె శిష్యుడు. ఆయన ప్రతిరోజు మాకు సినారె గురించి ఎదో ఒక విషయం చెప్పేవారు. అది నా స్మృతిపథంలో ఉండిపొయింది. ఆ విధంగా సినారెపై ఒక అభిమానం కలిగి, ఆయన లాగ జనం మెచ్చే రచనలు చేయాలనే ప్రేరణ కలిగింది.

తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో ఉద్ధండ పండితుడు
రచనారంగంలో రాణించిన రాయడు నారాయణుడు
విద్యారంగంలో ఆచార్యగా విరాజిల్లిన విలక్షణ తార
సినారె సినీ గీత పాలపుంతలో వెలసిన ఒక సితార.

ఈ ముగ్గురు మహానుభావులను కన్న పుణ్యభూమి తెలంగాణ. వారు తెలంగాణ సాహితీవనంలో తమ కవితలతో ప్రజల సాహితీ తృష్ణను తీర్చిన సెలయేర్లు. వారి రచనలు దైనందిన జీవితంలో సేద తీర్చుకునే అవకాశం కల్పించిన సాహిత్య మలయమారుతాలు. జాతి గర్వించేవిధంగా రచనలు చేసిన కవి సామ్రాట్లు. ఈ ముగ్గురు- సినారె, దాశరథి, కాళోజీ అధునిక తెలంగాణ కవిత్రయం. వారు ఖండకావ్యాలను కలిసి రాయలేదు కానీ, కలిసి సమాజాన్ని ప్రభావితం చేశారు. తమ రచనలతో ప్రజలకు స్ఫూర్తినిఇచ్చారు.

కవితలతో రచనలతో ప్రభంజనం సృష్టించిన సినారె..
సాహిత్యంతో పోరాట పటిమ ప్రదర్శించిన దాశరథి
ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఉద్యమాన్ని నింపుకొన్న కాళోజీ..
ముగ్గురి సాహితీ సృజనాత్మకతో స్ఫూర్తిపొందిన సమాజం
ఈ అధునిక తెలంగాణ కవిత్రయానికి ప్రణామము.

  • సునీల్‌ రాజవరం, క్యాల్గరి, కెనడా
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement