గంపల నిండా తీపిముద్దల్లా
నింపుకొచ్చిన సీతాఫలాలు
దారిపొడవునా ఇంతేసి కళ్ళతో పిలుస్తుంటాయి!
గుట్టల వెంట, పుట్టల వెంట తిరిగి
అడవిలోని కమ్మదనాన్ని
అల్లారుముద్దుగా తీసుకొచ్చి అరచేతిలో పెట్టినట్లు,
వయసుతో నిమిత్తం లేకుండా
పల్లె ప్రజలంతా అమ్మకానికి తెస్తుంటారు,
దారిలో దాహమైనా ఆకలైనా
అమ్మలా కడుపు నింపేది ఆ సీతాఫలమే!
శ్రమకు తగిన ఫలితమొస్తేనే
వారికి అమృతఫలమౌతుంది..
పొద్దుగూకేలోపు గంపలు ఖాళీ అయితేనే
వారికి మధుర ఫలమౌతుంది!
కాయలను కాల్చినా
నల్లని దేహంలో
తెల్లని మనసులా మురిపిస్తుంది,
పండై విచ్చుకోగానే మెరిసే ముత్యాల వరుస
నోట్లోకి చల్లగా జారుకోగానే
తేనెను జుర్రుకున్న నాలుక
అలవోకగా గింజలను జారవిడుస్తుంది,
అడవితల్లి
ఎన్ని పూల మకరందాన్ని ఏరి కూర్చిందో
అందుకే అంత కమ్మదనం!
పండ్లలో రారాజు కాకపోవొచ్చు కానీ
రాణి మాత్రం అచ్చమైన మన సీతాఫలమే!
-పుట్టి గిరిధర్ ,94914 93170