e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home ఎడిట్‌ పేజీ తెలంగాణవాదం సజీవమే

తెలంగాణవాదం సజీవమే

మొదట యథాతథంగా ఫలితాలను చూద్దాం. హైదరాబాద్‌, నల్లగొండ స్థానాలు రెండింటినీ టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. గెలుపు మొదటి ప్రాధాన్యతా ఓట్లతో కాకుండా రెండవ ప్రాధాన్యతతో లభించింది. హైదరాబాద్‌లో రెండవ స్థానం బీజేపీకి, మూడవది స్వతంత్ర అభ్యర్థికి లభించాయి. నల్లగొండలో రెండవ స్థానం, మూడవ స్థానం కూడా స్వతంత్రులవి అయ్యాయి.

ఇందులో విశేషం ఏమీ లేదన్నది ముందుగా అర్థం చేసుకోవలసిన విషయం. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎవరైనా సరే మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవటం ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఈసారీ జరగలేదు. ఈ సారి విశేషం ఏదైనా ఉంటే నల్లగొండ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ నిలబెట్టుకోవటం, హైదరాబాద్‌ను కొత్తగా గెలవటం. యాంటీ ఇంకంబెన్సీ బలంగా ఉంటే రెండు చోట్లా ఓడవలసింది. ముఖ్యంగా ఇటీవల వేగంగా ఎదుగుతున్నదని, అందుకే జీహెచ్‌ఎంసీలో అనూహ్యంగా సీట్లు వచ్చాయని, పైగా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న గ్రాడ్యుయేట్‌ ఓటర్లని లెక్క చూసినప్పుడు బీజేపీ అభ్యర్థి తప్పక తిరిగి గెలవవలసింది. అది కూడా బహుశా మొదటి ఓట్లతోనే కాని ఇదేమీ జరగలేదు.

- Advertisement -

మరి తెలంగాణవాదం అంతమవుతున్నదెక్కడ? నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే, ఇటువంటి సూత్రీకరణ చేసేవారి దృష్టిలో ఉన్నది టీఆర్‌ఎస్‌ పార్టీ, అది నడుపుతున్న ప్రభుత్వం. ఈ పార్టీ తెలంగాణవాదాన్ని, లక్ష్యాలను మరిచిపోయిందని, పరిపాలనలో విఫలమైందని, దానితో అసలు తెలంగాణ వాదమే బలహీనపడుతున్నదని వీరంటారు. టీఆర్‌ఎస్‌ పార్టీ, తెలంగాణవాదం సమానం కాదనే ఈక్వేషన్లు ఒకవేళ వారికి తెలిసినా, టీఆర్‌ఎస్‌ పైన రాళ్లు విసిరేందుకు పనికివస్తుంది గనుక ఇటువంటి వక్ర నిర్వచనాలు చెప్తుంటారు.

హైదరాబాద్‌కు సంబంధించి మరికొన్ని గమనించండి. ఓటర్ల దృష్టిలో టీఆర్‌ఎస్‌ ఒక ప్రభుత్వం అయితే, బీజేపీ చేసిన మహాతీవ్రమైన విమర్శలను కొట్టివేసి, ఆ పార్టీ రెండవ ప్రాధాన్యత ఓట్లు నలభై వేలు టీఆర్‌ఎస్‌కు ఎందుకు పడ్డాయి? ఇక్కడ నిజమైన అర్థంలో సైద్ధాంతిక వైఫల్యం కనిపించింది కాంగ్రెస్‌తో పాటు, వామపక్షాలు బలపరచిన స్వతంత్ర అభ్యర్థి విషయంలో. కాంగ్రెస్‌ అభ్యర్థి నుంచి రెండవ ప్రాధాన్యత ఓట్లు అధికంగా లభించింది బీజేపీకి. సెక్యులర్‌ అయిన టీఆర్‌ఎస్‌కు స్వతంత్ర అభ్యర్థికి అంతకన్న తక్కువే. అంతకన్న విచిత్రంగా వామపక్షాలు బలపరిచిన ఆ స్వతంత్ర అభ్యర్థి రెండవ ప్రాధాన్యత ఓట్లు సెక్యులర్‌ టీఆర్‌ఎస్‌కు 21 వేలు మాత్రమే రాగా, సెక్యులర్‌ కాదని వారే ప్రచారం చేసే బీజేపీకి 18 వేలు మళ్లటం విశేషం. జయాపజయాలను అట్లుంచితే దారుణంగా విఫలమైంది కాంగ్రెస్‌, వామపక్షాల సెక్యులరిజం. మరి సెక్యులరిస్టు విలువలను పాటించటకుండా, తెలంగాణవాదంలో అదొక విడదీయరాని భాగమని గుర్తించకుండా, వీరు ఏ మౌలిక ప్రాతిపదికలను ఆధారం చేసుకొని టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారు?

ఇప్పుడు నల్లగొండ విషయం చూద్దాం. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు గణనీయమైనన్ని ఓట్లు రావటం నిజం. అది ముందుగా ఎవరూ ఊహించలేదు గనుక కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. కాని వారికి వచ్చిన ఓట్లు టీఆర్‌ఎస్‌ వైఫల్యం వల్ల, ఆ పార్టీ విశ్వాసం కోల్పోవటం వల్ల వచ్చినవి కావు. కాంగ్రెస్‌, వామపక్షాలు చిత్తుగా ఓడి వారి ఓట్లు ఆ ఇద్దరికి మళ్లాయి. కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా నల్లగొండ, వరంగల్‌, ఖమ్మంలలో సంప్రదాయంగా బలమైనవి. ఇప్పుడు దయనీయమైన స్థాయికి పడిపోయింది వారే తప్ప టీఆర్‌ఎస్‌ కాదు. ఇందులో మరొక గమనార్హమైన విషయం ఉంది. ఆ స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరూ ప్రభుత్వ వ్యతిరేక విమర్శకులకు ఉగ్ర నరసింహులవంటి వారు. వారిని బలపరిచేవారికి ప్రభుత్వం పట్ల ఆవగింజంత సదభిప్రాయమైనా ఉండటానికి వీలు లేదు. కాని వారిద్దరి రెండవ ప్రాధాన్యతా ఓట్లు కూడా 40 శాతానికి పైగా టీఆర్‌ఎస్‌కు లభించటానికి ఎటువంటి అర్థ తాత్పర్యాలు చెప్తాం? అవి ఇతర విమర్శకులకు ఎందుకు మళ్లలేదు? గమ్మత్తు ఏమం టే, ఇంత స్థాయిలో ఓట్లు టీఆర్‌ఎస్‌కు మళ్లటం ఇతర పార్టీల కన్న, సోకాల్డ్‌ సెక్యులర్‌ పార్టీల కన్న, ప్రభుత్వాన్ని తీవ్రాతి తీవ్రంగా విమర్శించే వారి నుంచే ఎక్కువ జరిగింది. అంటే, ఆ ఓటర్లు ఆ ఇద్దరికి మొదటి ప్రాధాన్యత ఓట్లను ఎందుకు వేసి ఉన్నా, వారి విమర్శలకు పరిమితమైన విలువ మాత్ర మే ఇచ్చారన్న మాట.

అంతిమంగా గుర్తించవలసింది ఇవి తెలంగాణ సమాజంలోని అన్నివర్గాల అభిప్రాయాలను ప్రతిబింబించే ఎన్నికలు కావు. గ్రామీణ వర్గాలకు, పట్టణాలలోని దిగువ తరగతులకు ఇందులో భాగస్వామ్యం లేదు. అందువల్ల, పైన చెప్పుకొన్న ఈ రెండు ఎన్నికల విశ్లేషణలను బట్టి అయినా, ఇతరత్రా అయినా, సూత్రీకరణల పండితులు, టీఆర్‌ఎస్‌ తెలంగాణవాదాన్ని విఫలం చేస్తున్నదనే తొందరపాట్లకు పోకపోవటం మంచిది.

-టంకశాల అశోక్

ఇవీ కూడా చదవండి..

ఇష్టదైవం ప్రసాదం నేరుగా ఇంటికే : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా : మంత్రి ఎర్రబెల్లి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement