శిశిర ధ్వని మలయానిల అలలపై తేలియాడి
అలసి సొలసిన తరుణాన
నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ
వసంత సమీరాలు మోసుకొచ్చే
కలకంఠి సుమధుర సుస్వర రాగ ఝరులు
కనువిందు చేసే లేమావి పిందెల నృత్య విలాసాలు
సొగసైన వేప పూతల విచిత్ర సౌరభాలు
అరుణ వర్ణ సొబగులతో అలరారే
ప్రణయ పరిమళాల పలాశ సుమాలు
తమస్సును పారద్రోలే మధుమాస
సుషిమ సుధాంశు లహరి
మనసును మధురోహల్లో విహరింపజేసే
మల్లికా సుగంధాలు
అలముకొన్న ఆమని శోభతో
ప్రకృతి పరవశించిన వేళ
‘ప్లవ’నామ నూతన వత్సర ఆగమనం
క్రొంగొత్త అనంతాకాంక్షల సందోహం
షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి
సుఖదుఃఖాల సమాహారమే జీవిత పరమార్థం
సకల సంక్షోభాల గ్రహణాలు వీడిపోవాలని
అఖిల మానవ భవిష్య విపంచి
మనోజ్ఞ గమకాలు పలకాలని
కోకిల మంజుల గీతంతో
శింజినుల రసరమ్య రాగ రవళినై
శృతి కలుపుతున్నాను!
రామా రత్నమాల 98857 00062