e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home ఎడిట్‌ పేజీ సర్కార్‌ బడికి ‘రాజసం’

సర్కార్‌ బడికి ‘రాజసం’

సర్కార్‌ బడికి ‘రాజసం’


అతని పేరు మంకు రాజయ్య. పేరులోనే ‘మంకు’ ఉన్నది. ఆ మంకు ఏమంటే.. అందర్నీ కలుపుకొనిపోయే మంకు. ప్రభుత్వ బడులను బాగుచేయాలనే మంకు. ఈ ఆశయంతోనే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టి, ప్రజలను భాగస్వామ్యం చేసి ఆదర్శంగా నిలిచాడు రాజయ్య. జాతీయస్థాయిలోనే ఉత్తమ ఎంఈఓగా విద్యానిర్వహణాధికారిగా అవార్డు అందుకున్నారు.

మండల విద్యాధికారిగా ఒకే ప్రాంగణంలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు ఉండాలని నూతన విద్యావిధానం చెబుతుంది. దీన్ని రాజయ్య 2010లోనే విజయవంతంగా చేపట్టారంటే అతని దార్శనికతను అర్థం చేసుకోవచ్చు. హుజురాబాద్‌ డివిజన్‌ డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌గా నేను పనిచేస్తున్నప్పుడు రాజ్యయ ఎంఈఓగా ఎల్లారెడ్డిపేట మండలంలో పనిచేసేవాడు. మంచి విద్యావేత్త. మంచి చేద్దామనే తపన నరనరాల్లో జీర్ణించుకున్న మంచి వ్యక్తి. ఆయన పట్టదల, నిబద్ధత గురించి తెలిసిన నేను అతి తక్కువ విద్యార్థులున్న ఓ ప్రభుత్వ పాఠశాలకు ఆయన్ను పంపించా. ఆయన కృషితో క్రమంగా ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఊరి ప్రజలను, విద్యార్థుల తల్లిదండ్రులను, ప్రజాప్రతినిధులను సమావేశ పరిచి విద్యార్థుల ప్రతిభను ప్రదర్శింపజేసేవారు. దీంతో తల్లిదండ్రులు సంతోషించారు. ప్రభుత్వ బడులపై విశ్వాసం పెరిగింది. అలాగే పాఠశాలలో ప్రజల సహకారంతో మౌలిక వసతులు కల్పించి, రకరకాల పేయింటింగ్స్‌, బొమ్మలతో అలంకరించారు. దీంతో బడి ప్రైవేటు స్కూల్‌కు దీటుగా సుందరంగా, ఆకర్షణీయంగా తయారవటంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగింది. ఆ నేపథ్యంలోనే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయుల పిల్లలు కూడా సర్కార్‌ బడిలో చేరారంటే.. రాజయ్య కృషిని అర్థం చేసుకోవచ్చు. దీంతో ఎల్లారెడ్డిపేటలోని దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు స్కూల్‌ డ్రెస్‌, టై, బెల్ట్‌, బూట్లు సమకూర్చి సర్కార్‌ బడిని ఆదర్శంగా నిలిపారు. రాజయ్య చేసిన కృషితో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలన్నీ ఆయన బాటలో నడిచాయి. రాజయ్య ఎన్నడూ నా ఒక్కడితో అంత పెద్ద బాధ్యత నెరవేరుతదా అని ఆలోచించలేదు. ఏ పనినైనా ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయటం ఆయన శైలి. అందుకే ఆయన ఏది చేసినా విజయవంతమైంది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవటానికి కారణాలపై మా ఇద్దరిమధ్య చర్చ సాగింది. ముఖ్యంగా వసతుల లేమి, ఇంగ్లీష్‌ మీడియం లేకపోవటం ప్రభుత్వ పాఠశాలల ప్రధాన లోపమని గ్రహించి దాన్ని అధిగమించేందుకు కృషిచేశాడు రాజయ్య. తన పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభించి ఉపాధ్యాయులనూ సమాయత్తం చేశాడు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కనీస వసతుల కల్పనకు కృషిచేశాడు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆయన ఉంటే మొత్తం రాష్ర్టానికే ఆదర్శంగా ఉండేవిధంగా పాఠశాలలను తీర్చిదిద్దేవారు. ఏటా ఉపాధ్యాయులకు మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రభుత్వం ప్రకటిస్తుంది. పాలనారంగంలో క్షేత్రస్థాయి అధికారులుగా పనిచేస్తున్న ‘ఎంఈవో’లకు ఆయన పేరు మీద అవార్డులను ప్రకటించటం లేదు. ఇకనుంచైనా రాజయ్య పేరు మీద ఎంఈఓలకు అవార్డులు ప్రకటించాలి.

రాజయ్య అకాల మరణం పాఠశాల విద్యకే తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చూపిన మార్గం ఉన్నది. ఆయనతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులు ఆయన మార్గంలో పయనించి, సమాజానికి ఉత్తమ విద్యను అందించటంలో తమ నిబద్ధతను చాటుకుంటారు. తద్వారా అతనికి నివాళులు అర్పిస్తారు.
(వ్యాసకర్త: గాజర్ల రమేశ్‌, పాఠశాల విద్యలో అడిషనల్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌)

ఇవీ కూడా చదవండీ…

చెరువు మట్టే చేనుకు చేవ

కరోనాకు దీటైన వైద్యం(సంపాదకీయం)

గిరిజనులను బలిపెట్టొద్దు

Advertisement
సర్కార్‌ బడికి ‘రాజసం’
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement