e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఎడిట్‌ పేజీ సమష్టి విజయం సాధిద్దాం

సమష్టి విజయం సాధిద్దాం

సమష్టి విజయం సాధిద్దాం

దేశంలో కొవిడ్‌ సంక్రమణం రెండో దశకు చేరింది. మొదటిసారి కంటే వైరస్‌ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నది. ఒకసారి మనం కరోనా వ్యాప్తి గురించి సింహావలోకనం చేసుకుంటే, గతేడాది ఇదే సమయంలో ఉన్న పరిస్థితి కన్నా ఇప్పుడు ఎక్కువ ఉధృతి చూస్తున్నాం. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ మొదలైన రాష్ర్టాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది.

గతేడాదితో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, త్వరలో ఇవి కూడా పెరిగే ఆస్కారం ఉంది. వైరస్‌ వ్యాప్తి ఇంతకు ముం దు కంటే వేగవంతం కావడం, కొవిడ్‌ పరీక్ష చేసుకున్న వారిలో ఇదివరకు కంటే పాజిటివిటీ ఎక్కువ ఉండ టం ఆందోళనకరం. అయితే ఉపశమనం కలిగించే విషయం ఏమంటే.. వ్యాధి లక్షణాల గుర్తింపు, పరీక్షల నిర్వహణ, చికిత్స తదితర అంశాల్లో మెరుగైన అవగాహనతో ఉన్నాం. అదే విధంగా ఈ వ్యాధికి విరుగుడుగా రెండు రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడం ఊరటనిచ్చే అంశం.

ముందుగా వ్యాధి లక్షణాల అంశం తీసుకుంటే.. సామాన్య ఆరోగ్య కార్యకర్త నుంచి, సమాజంలో చాలామందికి అవగాహన ఏర్పడింది. దానివల్ల కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలనే స్పృహ కలిగింది. మొదట్లో పదుల సంఖ్యలో పరీక్షలు చేసే స్థితి నుంచి, ఇప్పుడు రోజుకు లక్షకు పైగా పరీక్షలు చేయగలిగే స్థితికి చేరుకున్నాం. వ్యాధి లక్షణాలను అర్థం చేసుకొని అదనంగా కొవిడ్‌ నిర్ధారణ రక్త పరీక్షలు, ఎక్స్‌రే, సిటీ స్కాన్‌ మొదలైనవి చేయగలుగుతున్నాం. కొవిడ్‌ చికిత్సకు అవసరమైన అన్నిరకాల మందులు (అత్యవసరమైనవి, అరుదైనవి, ఖరీదైనవి కూడా) అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్‌ కోసం ప్రత్యేకంగా పడకలు, ఐసీ యూ పడకలు, వెంటిలేటర్‌లను పెద్ద సంఖ్యలో ఏర్పరుచుకొని బాధితులను కాపాడుకోగలుగుతున్నాం. ఈ సందర్భంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి, తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన వైద్య సిబ్బందికి, ముందు వరస సైనికుల్లా తమ కర్తవ్యం నిర్వహించిన పోలీస్‌, మునిసిపల్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సిబ్బందికీ, తమ వంతు బాధ్యత నిర్వర్తించిన మీడియా మిత్రులకు, సహకరించిన ప్రతీ పౌరుడికి మనం ఎంతో రుణపడి ఉన్నాం.

వీరందరి త్యాగాలు వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేసుకున్నవారు ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. ఇందులో రెండున్నర లక్షల మంది ఆరోగ్య సిబ్బంది, లక్షా 50వేలకు పైగా ఫ్రంట్‌లైన్‌ వారియర్లు, 45 ఏండ్లు దాటిన 16 లక్షల మంది దాకా ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొవిడ్‌ నివారణ చర్యల్లో ఒక భాగం మాత్రమే. మొదటి నుంచి పాటి స్తూ వస్తున్న మాస్క్‌ ధారణ, సామాజిక దూరం (2 గజాలు) పాటించడం, చేతులు తరచూ శానిటైజర్‌/సబ్బుతో శుభ్రపరుచుకోవడం వంటివి పాటించడం అవసరం, శ్రేయస్కరం.

వ్యాధి తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయడం, టీకా అందుబాటులోకి రావడం మొదలైన కారణాల వల్ల మనం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను నిర్లక్ష్యం చేశామన్నది నిజం. మన చేతిలో ఉన్న ప్రభావవంతమైన ఆయుధం వ్యాక్సిన్‌. ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు చేసి ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి.. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగానూ, ప్రైవేట్‌లో నామ మాత్రపు రుసుముతో ప్రభుత్వం అందిస్తున్నది. ఇది ఎంతో అభినందనీయం. కానీ, వ్యాక్సిన్‌ విషయంలో లేనిపోని అపోహలు, అపనమ్మకాలతో వ్యాక్సిన్‌ వేయించుకోకుండా, అర్హులై కూడా కాలయాపన చేస్తున్న వారందరిదీ బాధ్యతారాహిత్యమే. దేశంలో 10 కోట్ల మందికి, రాష్ట్రంలో 20 లక్షల మందికిపైగా అందించిన ఈ టీకాలు సురక్షితం, ప్రమాదరహితం.

ప్రపంచ జనాభాలో మూడో వంతు మందికి వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. ఎన్నో దేశాలు వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నాయి, భారత్‌ సహాయాన్ని కోరుతున్నాయి. దీన్ని గుర్తెరిగి, అర్హులైన వాళ్లు వ్యాక్సిన్‌ తీసుకోవటం అవసరం. వ్యాక్సిన్‌ తీసుకున్నవారు, తీసుకోనివారు కూడా కొవిడ్‌ జాగ్రత్తలు విధిగా పాటించాలి. మన ముఖ్య పండగలైన ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా, శుభ/అశుభ కార్యాల్లోనూ, కార్యాలయాల్లోనూ, వినోద కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లోనూ అధిక సంఖ్యలో గుమిగూడటం ప్రమాదకరం. వివిధ రకాలుగా కొవిడ్‌ వైరస్‌ మ్యుటేషన్‌ చెందడం, ఆయా స్ట్రెయిన్‌లపై, వ్యాక్సిన్‌ ప్రభావశీలత ఎంతో తెలియక పోవడం వల్ల, ఈ కట్టుబాట్లు పాటించడం మన అందరి బాధ్యత. ముఖ్యంగా యుక్త వయస్కులు ఈ జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల, వారి ఇంట్లో, సమాజంలో ఉన్న చిన్న పిల్లలూ, స్త్రీలు-ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు (చక్కెర/బీపీ, ఊపిరితిత్తులు/గుండె/మూత్రపిండాలు, క్యాన్సర్‌ మొదలైనవి) గలవారికి ఈ కొవిడ్‌ ప్రమాదకరం, ప్రాణాంతకంగా మారవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వ్యాధి మనందరం తీసుకుంటున్న ఈ చర్యలతో ఒక ప్రదేశానికో, దేశానికో, సమూహానికో పరిమితమయ్యే రోజు త్వరలోనే రావచ్చు. ప్రస్తుతం రెండు వ్యాక్సిన్‌లు మాత్రమే ఉన్న పరిస్థితి నుంచి పలురకాల వ్యాక్సిన్‌లు (ముక్కు ద్వారా, నోటి ద్వారా కూడా ఇవ్వగలిగేవి) అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అంతవరకు వ్యాధిపై పోరాటం చేస్తూ అలిసిపోతున్న ఆస్పత్రుల్లోని ఆరోగ్య, ఇతర సిబ్బందిపై, తద్వారా ప్రభుత్వంపై, అనవసర భారం పడకుండా చూసుకోడం మన కర్తవ్యం. అందరి భాగస్వామ్యంతోనే కరోనాపై విజయం సాధ్యమవుతుంది తప్ప, ఒంటరి పోరాటం వల్ల కాదు. అందుకే ప్రభుత్వ చర్యలకు తోడు, కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి.
(వ్యాసకర్త: ప్రజారోగ్య సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం)

పదుల సంఖ్యలో పరీక్షలు చేసే స్థితి నుంచి, ఇప్పుడు రోజుకు లక్ష పైగా పరీక్షలు చేయగలిగే స్థితికి చేరుకున్నాం. వ్యాధి లక్షణాలను అర్థం చేసుకొని అదనంగా కొవిడ్‌ నిర్ధారణ రక్త పరీక్షలు, ఎక్స్‌రే, సిటీ స్కాన్‌ మొదలైనవి చేయగలుగుతున్నాం. కొవిడ్‌ చికిత్సకు అవసరమైన అన్నిరకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్‌ కోసం ప్రత్యేకంగా పడకలు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్‌లను పెద్ద సంఖ్యలో ఏర్పరుచుకొని బాధితులను కాపాడుకోగలుగుతున్నాం.

-డాక్టర్‌ గడల శ్రీనివాసరావు

Advertisement
సమష్టి విజయం సాధిద్దాం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement