e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home ఎడిట్‌ పేజీ విషయాలు జనానికి చేరేదెట్లా?

విషయాలు జనానికి చేరేదెట్లా?

ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించిన వివరణలు బయట సరేసరి కాగా అసెంబ్లీ సమావేశాలలో ప్రతిసారి వస్తున్నవే. కానీ ఎందువల్లనో గాని ఈసారి అవి వెల్లువలా హోరెత్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర మంత్రులు దాదాపు ప్రతిరోజు విపులీకరించి మాట్లాడారు. మాట్లాడేందుకు వీలయ్యే ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. వారు చెప్పినదంతా కేవలం ప్రచారమా? కేసీఆర్‌ది సహజమైన వాగ్ధాటి మాత్రమేనా? కాదని దానినంతా నిర్వికారంగా గమనించిన ఎవరికైనా బోధపడుతుంది. ప్రతిపక్షాల నుంచి వచ్చిన స్పందనలే అందుకు తిరుగులేని గుర్తు. వారు మరికొన్ని ప్రతిపాదనలు చేసి ఉండవచ్చు. అమలులోని లోపాలపై కొన్ని సూచనలు చేసి ఉండవచ్చు. ఇంకా జరగవలసిన వాటిని గుర్తుచేసి ఉండవచ్చు. కాని ప్రభుత్వం చెప్పిన విషయాలు నిజం కాదని ప్రతిపక్షాలు అనలేదు. ఇటువంటి సమాచార వెల్లువలు, దృశ్యాలు అసెంబ్లీలో గతంలో ఎన్నడూ కన్పించలేదు. ప్రభుత్వం చెప్పిన ప్రతి ఒక్క అంశానికి గణాంక వివరాలను చూపారు. అందువల్ల ప్రజలకు, వివిధ రంగాలకు, రాష్ట్రానికి చేకూరిన ఫలితాలను పేర్కొన్నారు. అందుకు కేంద్రం నుంచి వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి లభించిన గుర్తింపులను ప్రస్తావించారు. ఇంకా జరగవలసినవి ఏవైనా ఉంటే వాటిని సైతం నిజాయితీతో చెప్పారు. అందువల్లనే ప్రతిపక్షాలు ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని, ఆయా విధానాలను సాక్షాత్తు అసెంబ్లీలోనే తరచు ప్రశంసించాయి.

వీటినన్నింటిని గమనికలోకి తీసుకున్నప్పుడు ఈ ఏడేండ్లలో ఏ అసెంబ్లీ సమావేశాలు కూడా ఇంత సంతృప్తికరంగా, సంతోషకరంగా జరగలేదనిపిస్తున్నది. ప్రభుత్వం దృష్టి నుంచి చూసినప్పుడు ఇంత విజయవంతంగా కూడా జరగలేదనుకోవచ్చు. ఇదంతా బాగున్నది గాని, ఇదంతా జన సామాన్యానికి చేరేది ఏ విధంగా? స్థూల దృష్టితో చూసినప్పుడు ఒకటనిపిస్తుంది. తమకు తెలిసినందువల్లనే కదా ప్రజలు ప్రతిసారి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తున్నారని. అది నిజమే. కానీ అదే సమయంలో ప్రజలకు ఉన్నది పాక్షిక పరిజ్ఞానం. అందువల్ల కలిగే పాక్షిక దృష్టి. అది ఆయా వ్యక్తులకు, వర్గాలకు తమ ప్రయోజనాలతో ముడిపడిన ఆత్మాశ్రయ (సబ్జెక్టివ్‌) ఆలోచన. అంతే తప్ప రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రయోజనాల గురించి ఆలోచించగల సామూహిక (ఆబ్జెక్టివ్‌) ఆలోచన కాదు. అటువంటి ‘తెలంగాణ చైతన్యం’ కాదు. అది జరిగినప్పుడే దానిని నిజమైన అర్థంలో తెలంగాణ చైతన్యం అనగలం. అది కలగటం లేదు ఇటువంటి లోపభూయిష్ట, పాక్షిక చైతన్యం కారణంగానే. ‘రైతుబంధు’ తీసుకునే ఒకరు, ఆ పథకం మరొకరికి ఎందుకంటారు. ఆ పథకం ద్వారా అత్యధికం గా లాభపడుతున్న సామాజిక వర్గాలు, అత్యంత దయనీయస్థితిలో గల దళితులకు ‘దళితబంధు’ సజావుగా రాకుండా అడ్డుపుల్లలు వేయజూస్తారు. తక్షణం తమకు కూడా అది అమలుచేయకుంటే ఎన్నికలలో ఓడిస్తామని శపథం చేస్తారు. ఈ విధంగా సమాచార లోపాల వల్ల, సామూహిక తెలంగాణ చైతన్య లోపాల వల్ల, సబ్జెక్టివ్‌ చైతన్యపు ప్రకోపనం వల్ల రెచ్చిపోయి తప్పుదారి పడుతున్నవారు కూడా పలువురున్నారు. ఏదో ఒక ప్రభుత్వానికే కాదు, ఏ సమాజానికైనా ఇది కీలకాంశం.

- Advertisement -

ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఇట్లా ఎందుకు జరుగుతున్నది, ఈ విషయంలో ఏమి జరగాలన్నవి ప్రశ్నలు. ఎందుకు జరుగుతున్నదనే దానికి స్థూలంగా అయిదు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వివిధ వర్గాలకు గల సమాచారం లోపం. ఈ లోపం అధికారపక్షపు దిగువ శ్రేణులలోనూ ఉంది. నూటికి నూరు మందికి, నూటికి నూరు శాతం సమాచారం, దానితో పాటు అవగాహన అనే దృష్టితో అనటం లేదు ఈ మాట. కానీ సమాచార శూన్యత, అవగాహనా లోపం వీలైనంత తగ్గుతూ పోవటానికి ప్రయత్నం జరగాలి. ఆ పని ఒక ప్రచారపు హోరు వలె కాదు. ఒక పద్ధతి ప్రకారం జరగాలి. రెండవది వ్యక్తులలో, ఆయా సామాజిక వర్గాలలో స్వప్రయోజనాల చైతన్యంతో పాటు సామూహిక తెలంగాణ ప్రయోజనాల చైతన్యం కలగకపోవటం. ఇది కలిగేటట్లు చేయటం అసాధ్యం కాదు. అందుకోసం కృషి జరగటం అవసరం. మూడవది ప్రతిపక్షాల ప్రచారం. వారు నిర్మాణాత్మక విమర్శలకు బదులు ఏమి చేస్తున్నారో కనిపిస్తున్నదే. అందువల్ల రాజకీయ లబ్ధి కలుగుతుందనుకోవటం భ్రమ అని రుజువైన వారు ఆ పద్ధతి మార్చుకోవటం లేదు. తమపై ఆ ఒత్తిడిని ప్రజలే తేగలరు. తగు సమాచారం, చైతన్యంతో ప్రజలు తీవ్రంగా తిరస్కరించినప్పుడు అది జరుగుతుంది.

నాల్గవది మీడియా, సోషల్‌ మీడియా పాత్ర. ఈ రెండు కూడా ఉద్దేశపూర్వకంగా అసంపూర్తి సమాచారాలకు, వక్రీకరణలకు, అసత్యాలకు పాల్పడుతున్నందున వాటికి తిరస్కరణ రావలసింది కూడా ప్రజల నుంచే. అందుకు ప్రజలు సిద్ధమయ్యేది తిరిగి వీలైనంత ఎక్కువ సమాచారం, పాక్షిక ప్రయోజన చైతన్యాలతో పాటు సామూహిక ప్రయోజన చైతన్యాల ద్వారానే. ఇది జరిగేది ప్రభుత్వం నుంచి కొంత అయితే మేధావులు, రచయితలు, కళాకారుల వైపు నుంచి చాలా ఎక్కువ ఉంటుంది. నిజానికి ఇప్పటివరకు గల లోపాలలో ఒక్కటి మేధావులు, రచయితలు, కళాకారులు వివిధ కారణాల వల్ల సినికల్‌గా వ్యవహరించటం. వారు కనీసం నెగెటివ్‌ సినిసిజం నుంచి పాజిటివ్‌ సినిసిజానికి మారినా తెలంగాణకు తగినంత మేలు జరుగుతుంది. విచారకరం ఏమంటే, వారిలో అధికులు వాస్తవ సమాచారాలను తెలుసుకొని అధ్యయనం చేసే ప్రయత్నమైనా చేయటం లేదు.

-టంకశాల అశోక్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement