e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home ఎడిట్‌ పేజీ విధ్వంసం కాదు.. వికాసమే

విధ్వంసం కాదు.. వికాసమే

విధ్వంసం కాదు.. వికాసమే

వరంగల్‌ సెంట్రల్‌ జైలు కూల్చివేతను కొందరు సామాజిక ఉద్యమకారులుగా చెప్పుకొంటున్నవారు వ్యతిరేకిస్తున్నారు. వీరే, మొదట్లో వరంగల్‌ నడిబొడ్డున ఉన్న జైలును తరలించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ఆర్‌ చేసిన ప్రతిపాదనను సమర్థించారు. మారుతున్న, పరిస్థితులు, శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో నగరాల నడిబొడ్డులో ప్రజోపయోగాలకు ప్రభుత్వ స్థలం దొరకడం చాలా సమస్యగా పాలనా యంత్రాంగానికి మారింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో వరంగల్‌ నట్టనడుమ ఉన్న సెంట్రల్‌ జైలును శివారు ప్రాంతాలకు తరలించి, ఆ స్థలంలో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన, రూరల్‌ కలెక్టరేట్‌ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని ప్రతి ఒక్కరూ సమర్థించడం పోయి ఏదో మొక్కుబడిగా వ్యతిరేకిస్తున్నారు.

- Advertisement -

వరంగల్‌ సెంట్రల్‌ జైలు చారిత్రకమైనదే. దేశంలోని అన్ని జైళ్లలో కన్నా ఆధునికమైనదే. 135 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ జైలును కూల్చివేయకుండా ప్రస్తుతం కట్టే చిన్నపిల్లల దవాఖానను ప్రతిపాదిత సెంట్రల్‌ జైలును నిర్మించే ధర్మసాగర్‌లోనే నిర్మిస్తే ఎంతో వ్యయం ప్రభుత్వానికి మిగులుతుందనేది వీరి వాదన. దవాఖానలనేవి ప్రజలకు అందుబాటులో ఉండాల్సినవి. దాన్ని శివార్లకు తరలిస్తే సామాన్య ప్రజలకు ఒనగూడేదేమీ ఉండదు. మారిన పరిస్థితుల్లో కారాగారాలనేవి నగరాలు, పట్టణాలకు దూరంగా ఉండాలనేదే నూతన దృక్పథం. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ సెంట్రల్‌ జైలు విషయంలోనూ ఇది నిరూపణ అయింది. అప్పుడు కూడా ముషీరాబాద్‌ జైలును చర్లపల్లికి తరలిస్తే షరా మామూలుగానే కొందరు వ్యతిరేకించారు. చివరికి ఏమైంది, ప్రస్తుత కరోనాతో పాటు నిరుపేదలకు ఉచిత వైద్యం అందించే కల్పతరువుగా మారింది. అసలు, రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం నిర్మించిన ప్రత్యేక దవాఖానలైన పంజాగుట్ట బొక్కల దవాఖాన, కోరంటి, నిలోఫర్‌ పిల్లల దవాఖాన, ఉస్మానియా, మానసిక వికలాంగుల, టీబీ దవాఖానల అనంతరం రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రత్యేక దవాఖాన ఒక్కటి రాలేదు. ఉత్తర తెలంగాణతో పాటు నల్గొండ, ఖమ్మం, మెదక్‌ జిల్లాలు అనువుగా ఉన్న వరంగల్‌ నగరంలో చిన్న పిల్లలకు ప్రస్తుత సెంట్రల్‌ జైలు స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో వరంగల్‌తో పాటు పరిసర జిల్లాల ప్రజల్లో ముఖ్యంగా పేదల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

దాదాపు 55 ఎకరాలున్న ఈ జైలు భూమిలో కొంతభాగం వైద్యశాల నిర్మించి మిగిలిన భూమి అన్యాక్రాంతం చేస్తారనే అనవసర అనుమానాలను కూడా రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే, ఈ స్థలంలో ఏడెకరాలను కాళోజీ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి కేటాయించారు. ఈ స్థలంలో అద్భుతమైన కాళోజీ యూనివర్సిటీ అద్భుత పాలనా భవనం నిర్మాణమైంది. మరికొంత భూమిని నిత్యం ప్రజలకు అవసరపడే వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌ను నిర్మించడానికి నిర్ణయించారని తెలుస్తున్నది. వరంగల్‌ వాసులకు ముఖ్యంగా ఉద్యోగులందరికీ తెలుసు, సుబేదారిలోని నిజాం నిర్మిత వరంగల్‌ కలెక్టరేట్‌ భవనం కూడా హెరిటేజ్‌ భవనం అయినప్పటికీ వర్షాకాలం వస్తే కురియడం, భవనం పెచ్చులు ఊడిపడటం ఇలా ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. ఆ భవనం తొలగించి ప్రస్తుతం అధునాతన అద్భుత భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఈ నెల 21న నూతన కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇదే మాదిరిగా ప్రస్తుత సెంట్రల్‌ జైలు స్థలంలోనూ అద్భుతమైన చిల్డ్రన్స్‌ సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల కూడా నిర్మితమవుతున్నది. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కేసీఆర్‌ గొప్ప దూరదృష్టితో చేపట్టిన సెంట్రల్‌ జైలు తరలింపు నిర్ణయం, దాని స్థలంలో అద్భుతమైన ఆసుపత్రిని మరో ఏడాది కాలంలో చూద్దాం. అంతేకానీ, ప్రజోపయోగం కోసం చేసే ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకించడం సమంజసం కాదు.
(వ్యాసకర్త: పూర్వ డీపీఆర్‌ఓ, వరంగల్‌)

కె.వెంకటరమణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విధ్వంసం కాదు.. వికాసమే
విధ్వంసం కాదు.. వికాసమే
విధ్వంసం కాదు.. వికాసమే

ట్రెండింగ్‌

Advertisement