e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home ఎడిట్‌ పేజీ రాజీయే రాజమార్గం

రాజీయే రాజమార్గం

ప్రజల్లో రోజురోజుకు స్పర్ధలు పెరుగుతున్నాయి. కుటుంబాలు కూలిపోతున్నాయి. ఆలుమగలు విడిపోతున్నారు. పసిపిల్లలకు తల్లిదండ్రులు కరువవుతున్నారు. ఆస్తి తగాదాలు, భూమి, అద్దెలు, వ్యాపారాలు ఒక్కటేమిటి మానవ సంబంధాలన్నీ కక్షలు, కార్పణ్యాలతో కునారిల్లుతున్నా యి. కోర్టులు, పోలీసుస్టేషన్ల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా కోర్టుల్లో నాలుగున్నర కోట్లకు పైగా కేసులు తీర్పుల కోసం ఎదురుచూస్తున్నాయి. కోర్టుల మీద, పోలీసుస్టేషన్ల మీద ఒత్తిడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కోర్టులు, న్యాయవ్యవస్థ కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయమే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థ. దీంట్లో భాగమే.. ‘మధ్యవర్తిత్వంతో రాజీపడటం’. దీన్నే ఇటీవల మన దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నొక్కిచెప్పారు. ఈ మధ్యవర్తిత్వం ఏమిటి? ఎందుకు? ఎప్పుడు, ఎవరు? ఎలా? అన్న విషయాలు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి.

- Advertisement -

మధ్యవర్తిత్వం అంటే ఏమిటి?: కక్షిదారులు కోర్టులో కేసు వేయకుం డా సుశిక్షితులైన మూడో వ్యక్తి దగ్గరికి వెళ్లినప్పుడు సదరు వ్యక్తి సమస్యను క్షుణ్ణం గా విని, విశ్లేషించి కక్షిదారులను కూర్చోబెట్టి, వారిద్దరి మధ్య చర్చ ప్రారంభించి, కోర్టులకు వెళ్తే కలిగే కష్టనష్ట్టాలను తెలియజేసి సమస్యను పరిష్కరించడమే మధ్యవర్తిత్వం. కోర్టులు, చట్టాలు, పోలీసులు లేని కాలంలో కూడా సమస్యలు ఉండేవి. గ్రామ, కుల పెద్దలు కక్షిదారుల మధ్య రాజీ కుదిరించేవారు. అలాంటివారిని సమాజం పెద్దమనుషులనీ, మధ్యవర్తులనీ గౌరవించేది.

పెండింగులో కోట్ల కేసులు: కోర్టుల్లో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం ఢిల్లీ నుంచి జిల్లా, తాలూ కా స్థాయి వరకు దాదాపు నాలుగున్నర కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయి. రోజు లక్షలాది కేసులు వాటికి జమవుతున్నాయి. కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఎంత చిన్న కేసైనా నెలలు, ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పైపెచ్చు లాయర్ల ఖర్చులు, కోర్టు ఫీజులు, తిరగడానికి పనులు వదులుకోవడం వల్ల నష్టాలు, ఫలితంగా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడం వింటూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో మధ్యవర్తుల అవసరం ముం దుకొస్తున్నది. ఇరుపక్షాలను కూర్చోబెట్టి సమస్యను ఇద్దరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారమయ్యేట్టు చేస్తుంది ఈ ప్రక్రియ. ఖర్చులు తగ్గిస్తుంది. సమయం వృథా కాదు. సంబంధాలు చెడిపోవు. ఇరుపక్షాలు సామరస్యంగా కలిసిమెలిసి ఉండటమో, సంతోషంగా విడిపోవటమో జరుగుతుంది. కనుక ప్రస్తుతం కోర్టు లు మధ్యవర్తిత్వానికి మొగ్గుచూపుతున్నాయి. కుటుం బ, వాణిజ్య కోర్టుల చట్టాలు రాజీపడటాన్ని సమర్థిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న లోక్‌ అదాలత్‌లు మధ్య వర్తిత్వ విధానంతో కేసుల పరిష్కారాన్ని నొక్కి చెప్తుతున్నాయి.

మధ్యవర్తిత్వంలో ఎవరెవరుంటారు?: దీంట్లో సుశిక్షితులైన, గుర్తింపు పొంది, ఏండ్ల అనుభవం ఉన్న మధ్యవర్తులుంటారు. హక్కుల కోసం పోరాడుతున్న ఇరుపక్షాల వారుంటారు. అవసరమనుకుంటే వారి బంధువులుంటారు. కానీ వీలైనంతవరకు మధ్యవర్తిత్వంలో జరిగే సంప్రదింపులు చాలా గోప్యంగా ఉం టాయి. కనుక కక్షిదారులు ముందు ఒక్కరొక్కరుగా మధ్యవర్తితో తమ సమస్యలు తెలుపుకొంటారు. ఇలా స్థూలంగా ముగ్గురు అంటే మధ్యవర్తి, ఇద్దరు కక్షిదారులు ఉంటారు.

మధ్యవర్తిత్వం ఎలా చేస్తారు?: మధ్యవర్తులు కక్షిదారులను ఒక్కొక్కరిని వేర్వేరుగా, తర్వాత వారి ఇష్టానుసారం అందరినీ కలిపి సమస్యను చర్చిస్తారు. సామరస్యపూర్వక వాతావరణం నెలకొల్పి, సమస్యలో ఉన్న సాధకబాధకాలు వివరించి, కక్షిదారులు రాజీకి వచ్చేట్టుగా వివరిస్తారు. ఉదాహరణకు ఒక మహిళ కుటుంబపరంగా హింసకు గురైనప్పుడు ముందు పోలీసుస్టేషన్‌కు, తర్వాత ఉమెన్‌ సెల్‌కు, ఆ తర్వాత మధ్యవర్తిత్వానికి, అటు పిమ్మట మళ్లీ కోర్టుకూ వెళ్లాల్సివస్తుంది. కానీ కేవలం మధ్యవర్తిత్వం కోసమే ఏర్పాటైన సంస్థలకు స్త్రీలు ఇతర కక్షిదారులు నేరుగా రావచ్చు. చిన్నపాటి నేరాలకు పాల్పడినవారు కూడా మధ్యవర్తుల ద్వారా రాజీపడి కఠినమైన శిక్ష పడకుండా తమ జీవితాలను చక్కదిద్దుకోవచ్చు.

ఎన్నో ప్రయోజనాలు: సమయం ఆదా అవుతుంది. డబ్బు మిగులుతుంది. కక్షిదారులు ఎడముఖం పెడముఖం పెట్టుకోవడం ఆపేసి ఆప్తమిత్రుల్లా మిగిలిపోతారు. అమీతుమీ తేల్చుకోవాలన్న అహంభావ మనస్తత్వం నుంచి అయ్యో! ఇద్దరమూ తప్పు చేశామా అనే అవగాహనకో, లేదా, ఎవరిదీ తప్పు కాదు కదా అన్న అవగాహనకో వచ్చి జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారు.

(వ్యాసకర్త: అడ్వకేట్‌, అధ్యక్షులు, ‘అమికా’ మధ్యవర్తిత్వ కేంద్రం)కోర్టుల్లో మధ్యవర్తిత్వ కేంద్రాలున్నాయి. కానీ అవి కోర్టు ద్వారా వెళ్లాల్సిన కేంద్రాలు. అవిగాక హైదరాబాద్‌లోని వనస్థలిపురం సమీపంలో ‘అమికా’, గాంధీభవన్‌ వద్ద ‘ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌’ (ఐసీఏడీఆర్‌) ప్రాంతీయ కేంద్రం, బెంగళూరులోని ‘సామా’, పూణెలోని ‘భారత్‌ లా సొసైటీ’ లాంటివి చాలా ఉన్నాయి.

మధ్యవర్తిత్వం ఎప్పుడు?
సాధారణంగా వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, వ్యాపారుల మధ్య, వ్యాపారులు- వినియోగదారుల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు-పిల్లల మధ్య తగాదాలు ఏర్పడుతాయి. అవి కోర్టుల్లో, పోలీస్‌ స్టేషన్లలో అమీతుమీ తేల్చుకోవాలనుకున్నప్పుడు మధ్యవర్తిత్వం గురించి ఆలోచించాలి. ‘మా దగ్గర అంత సమయం ఉందా? డబ్బులున్నాయా? కోర్టు తగాదాలు, పోలీసు కేసులు అయిన తర్వాత తలెత్తుకోగలమా’ అని ఆలోచించుకున్నప్పుడు ‘అమికా’ లాంటి మధ్యవర్తిత్వ సంస్థలు అవసరం అవుతాయి.

-జి.జ్యోతిరావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana