e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home ఎడిట్‌ పేజీ మానవీయ రాజనీతిజ్ఞుడు

మానవీయ రాజనీతిజ్ఞుడు

‘రానున్న ఎన్నికల గూర్చి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు! రాబోయే తరాల గూర్చి యోచించేవాడు రాజనీతిజ్ఞుడు’ అన్నారు పెద్దలు. దురదృష్టవశాత్తు కొంతకాలంగా ‘డబ్బుతో అధికారం! అధికారంతో డబ్బు అనేలా రూపాంతరం చెందినయి దేశ రాజకీయాలు! ఏం చేసైనా రాజ్యాధికారాన్ని లాగేసుకోవాలనుకుంటున్న రాజకీయ వ్యాపారులైన నాయకులే కనిపిస్తున్నారు, కానీ, దేశానికి రాజనీతిజ్ఞులు కరువయ్యారు!

ఆకాశంలో హరివిల్లులా అరుదుగా కనిపించే రాజనీతిజ్ఞులను గుర్తించి, వాళ్ళను ప్రోత్సహించటం సమాజానికి అవసరం. ఈ కర్తవ్యాన్ని గుర్తించి, మేధావులు, రచయితలు, మీడియా ఆ దిశగా ప్రజలను చైతన్యం చేయటం ఆవశ్యకం. అరుదైన రాజనీతిజ్ఞులలో కేసీఆర్‌ ఒకరు. ‘పాలకులకు చదివే తీరికుండదు, కానీ అధ్యయనం చేయనివారు పాలనకు అనర్హులు!’ అన్నాడు ప్లేటో. నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, అంబేద్కర్‌, జాకీర్‌ హుస్సేన్‌, వాజపేయి, పీవీ వంటి అధ్యయనశీలియైన పాలకుడు కేసీఆర్‌! తెలంగాణ ప్రగతి సాధనకు తీవ్ర అధ్యయనం చేశారు. రాష్ట్రం పారిశ్రామికంగా ఎదగాలంటే, ప్రజల కొనుగోలుశక్తి పెరగాలి. రాష్ట్ర జనాభాలో అరవై శాతం మంది వ్యవసాయాధారంగా జీవిస్తున్నారు. వాళ్ళ కొనుగోలు శక్తి పెరగటానికి వ్యవసాయాభివృద్ధే శరణ్యమన్న వాస్తవాన్ని గుర్తించి, తద్వారా పారిశ్రామికాభివృద్ధిని సాధించి, అమెరికాకు దీటుగా ఎదుగుతున్న చైనా మార్గాన పయనిస్తున్నారు.

- Advertisement -

వ్యవసాయాభివృద్ధి: ‘మిషన్‌ కాకతీయ’ పథకం ద్వారా కాకతీయుల నాటి పంట చెరువుల పూడిక తీయించారు. పుష్కలంగా సాగునీటితో పాటు, గణనీయంగా భూగర్భ జలాలు పెరిగినయి. వ్యవసాయానికి నిరంతర నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను రూపొందించారు. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకాలనూ రూపొందించారు. పోడు, బీడు భూములను సాగులోకి తెచ్చారు. రాష్ట్రంలోని రైతులకు రైతుబంధును అందిస్తూ, తద్వారా, 4 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తెచ్చారు. పంజాబ్‌, హర్యానాలను మించి ధాన్యాన్ని అందించిన కేసీఆర్‌, ‘నీతి ఆయోగ్‌’ నుంచి ప్రశంసలందుకున్నారు. ‘పరిణతి చెందిన ముఖ్యమంత్రి’గా ప్రధాని మోదీ చేత కీర్తించబడ్డరు!

పర్యావరణ పరిరక్షణ: భావితరాల గురించి యోచించే రాజనీతిజ్ఞుడు, పర్యావరణ పరిరక్షణా కార్యక్రమాన్ని తప్పక తన ఎజెండాలో పెట్టుకుంటాడు. భూ భాగంలో 33.3 శాతం అడవులుంటేనే ప్రకృతి సమతూకంతో ఉన్నట్లు! ఆ మేరకు అడవులను కాపాడుకుంటేనే, వర్షాలు కురిసి, పాడి పంటలు వర్ధిల్లుతయి. మనుషుల ప్రాణుల ఉనికిని కాపాడుతయి. వాతావరణాన్ని వేడెక్కకుండా రక్షిస్తయి. అందుకే వృక్షో రక్షతి, రక్షితః అన్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన కేసీఆర్‌ అటవీ సంరక్షణ, అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. కోట్లాది మొక్కలను నాటిస్తూ; వాటిని రక్షిస్తూ వన మహోత్సవాలుగా రూపొందిస్తున్నారు.

పారిశ్రామికాభివృద్ధి: వ్యవసాయాభివృద్ధి ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరగటంతో పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు దృష్టిసారించారు. ఏ పరిశ్రమకైనా సరే 15 రోజుల్లో అనుమతి లభించేలా, ‘సరళీకృత పారదర్శక’ ‘టీఎస్‌ ఐపాస్‌’ విధానాన్ని తెచ్చారు. తొలి హయాంలోనే 1,34,923 కోట్ల పెట్టుబడులతో 8,284 పరిశ్రమలొచ్చినయి. 8,54,667 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి లభించింది.

పరిశ్రమల వికేంద్రీకరణ: ఉమ్మడి పాలనలో పారిశ్రామిక అభివృద్ధి కొన్ని నగరాలకే పరిమితమైంది. ఇప్పుడు ఆ అనుభవంతోనే పలు జిల్లాలకూ పరిశ్రమలను వికేంద్రీకరిస్తున్నారు కేసీఆర్‌! ఉదాహరణకు వరంగల్‌ జిల్లా శాయంపేటలో ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు’. ఖమ్మం, మెదక్‌ వగైరా జిల్లాలలో వివిధ పరిశ్రమలను నెలకొల్పటం కేసీఆర్‌ ముందుచూపునకే నిదర్శనం!

కేసీఆర్‌ వ్యవసాయంతో పాటు ప్రభుత్వరంగ విద్యాభివృద్ధ్ధికీ ప్రాధాన్యం ఇచ్చారు. మండల, జిల్లా, పరిషత్‌ పాఠశాలల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా, మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి ప్రకాశింపజేయాలన్న సంకల్పంతో 550 గురుకులాలను పౌష్టికాహారశాలలుగా, జ్ఞాన నిలయాలుగా రూపొందించారు. గజ్వేల్‌లో 60 ఎకరాల్లో అపూర్వమైన ఎడ్యుకేషనల్‌ హబ్‌ను నిర్మించారు. అక్కడ రూపొందిన మేలిమి రత్నాలను ఉన్నత విద్య కోసం నేరుగా విదేశీ యూనివర్సిటీలకు పంపే ఏర్పాటుచేసింది కేసీఆర్‌ ప్రభుత్వం.

సంస్కృతీ పరిరక్షణ: మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను కాపాడుకోవటం ద్వారా నేటి తరానికి స్ఫూర్తి కలిగించవచ్చు. పూర్వీకుల పట్ల కృతజ్ఞత, ప్రజల పట్ల మమకారం, దేశభక్తీ కలిగిన రాజనీతిజ్ఞులు మాత్రమే వీటిని అంకితభావంతో నిర్వహిస్తారు. నాడు తిరుపతి పుణ్యక్షేత్రాభివృద్ధికి ఎన్టీఆర్‌ పూనుకున్నడు. నేడు యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రాభివృద్ధికి కేసీఆర్‌ పూనుకున్నరు. వీరిద్దరూ హరివిల్లు లాంటి అరుదైన జననేతలు!

మత సామరస్యత: కుల, మత భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఓట్లు దండుకోవాలనుకుంటాడు నాయకుడు! మత సామరస్యంతో జాతీయ సమైక్యతను సాధించి ప్రజలకు సుఖశాంతులను అందించాలనుకుంటాడు రాజనీతిజ్ఞుడు. ‘ఏ నది గుండా ప్రవహించినా, ఆ నీరంతా చేరేది సముద్రానికే, ఏ మతం గుండా పయనించినా వారంతా చేరుకునేది సర్వేశ్వరున్నే’ అన్న గీతోపదేశాన్ని విశ్వసిస్తున్న సిసలైన హిందువు కేసీఆర్‌!అందుకే ఆయన పాలనలో ‘హిందూ-ముస్లిం-క్రిస్టియన్‌-సిక్కూ భాయీ! భాయీ- భాగ్యనగరం మనదేనోయీ’ అంటూ ఈ విశ్వనగరంలో ప్రజలు నిశ్చింతగా నివసిస్తున్నారు. మేధావి, అధ్యయనశీలి, మానవీయ కేసీఆర్‌ వంటి రాజనీతిజ్ఞులు రాష్ర్టానికే కాదు, దేశానికీ అవశ్యం. అట్టి రాజనీతిజ్ఞులను స్వాగతిద్దాం. ప్రోత్సహిద్దాం. కాపాడుకుందాం.

-పాతూరి వేంకటేశ్వరరావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement