e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఎడిట్‌ పేజీ బెంగాల్‌ బాట!

బెంగాల్‌ బాట!

బెంగాల్‌ బాట!

నాలుగు రాష్ర్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల తాజా ఫలితాలు ఊహించని అద్భుతాలేవీ ఆవిష్కరించలేదు. మూడు చోట్ల అధికార పార్టీకే పగ్గాలు దక్కగా, రెండు చోట్ల పాలనా పార్టీలను ఓటర్లు ఇంటికి పంపారు. సంప్రదాయాన్ని కాలదన్ని పినరయి విజయన్‌ కేరళలో అధికారం చేజిక్కించు కోగా, దశాబ్దం తర్వాత తమిళనాట పొద్దుపొడిచి డీఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో గెలుపొందింది. ఆధునిక రాజకీయ చరిత్రలో బీజేపీ చేస్తున్న అశ్వమేధ యాగంలాంటి రాజకీయ దూకుడుకు ఈ ఫలితాలు కళ్లెం వేశాయి. కేవలం భావోద్వేగాలు, అధికారగణం, ధనబలం ఆధారంగా బెంగాల్‌లో పాగా వేయాలనుకున్న కమలనాథులకు చేదు అనుభవమే మిగిలింది. దశాబ్దాల చరిత్ర కలిగిన సీపీఎం, కాంగ్రెస్‌లు బెంగాల్‌లో తుడిచిపెట్టుకుపోయాయి. కూటమిగా ఏర్పడి కూడా ఒక సీటుకే పరిమితమవటం వాటి దుస్థితికి నిదర్శనం. కాంగ్రెస్‌ మారోమారు నాయకత్వ లేమి, సమన్వయ లోపాన్ని చాటుకొని ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్నది. అనేక విధాలుగా ప్రత్యేకతలు కలిగిన ఈ ఫలితాలు దేశ భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతుందన్న దానికి సంకేతంగా నిలుస్తున్నాయి.

ఎన్నికల ప్రచారం ప్రారంభమైన కాలం నుంచీ దేశ వ్యాప్తంగా అందరి దృష్టి బెంగాల్‌పైనే ఉన్నది. ఆసేతు హిమాచలం తమ పట్టును నిరూపించుకునేందుకు బీజేపీ బంగ్లాను మొదటి మెట్టుగా భావించింది. ఎన్నడూ, ఏ రాష్ట్రంలో లేని తీరులో బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శించారు. ఫిరాయింపులను ప్రోత్సహించి తృణముల్‌ ముఖ్య నేతలను కమలం పార్టీలో చేర్చుకున్నారు. ఈ దూకు డే బీజేపీ కొంపముంచింది. ఫిరాయింపుదారులను బెంగాల్‌ ఓటర్లు తిరస్కరించారు. బెంగాల్‌ స్థానికతను కించపరిచేవిధంగా బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు వ్యతిరేక ఫలితాన్నిచ్చింది. ఎనిమిది దశల్లో ఎన్నికల నిర్వహణ మొదలు, కేంద్ర బలగాల మోహరింపు, ఎన్నికల సంఘం వ్యవహరణ ఎంత ప్రతికూలంగా ఉన్నా, అంతా తానై మమతా బెనర్జీ ఒంటరిగా, ఒంటికాలుతో ఒంటరి పోరుసాగించి అద్భుత విజయాన్ని సాధించారు. నందిగ్రామ్‌లో వ్యక్తిగత ఓటమి చవిచూసినా, పార్టీని గతంకన్నా ఎక్కువ స్థానాలతో విజయతీరాలకు చేర్చిన తీరు సాహసోపేతమైనది.

గత కొంతకాలంగా తమకు ఎదురే లేదన్న రీతిలో బీజేపీ వ్యవహరించింది. ప్రత్యర్థి పార్టీలను ఫిరాయింపులతో, దాడులతో ఆత్మరక్షణలో పడేసింది. ఇక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం అసాధ్యమేమో అన్న వాతావరణాన్ని సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల్లో నిబద్ధతతో పోరాడి బీజేపీని ఓడించవచ్చని మమత నిరూపించింది. ఇది ప్రతిపక్ష పార్టీలకు ఆదర్శం. ఎన్డీయేతర పక్షాలు ఏకతాటిపై వచ్చేందుకు ఇది కొత్త ఉత్సాహన్నిచ్చేదే. వచ్చే మే నెల లోపు యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవా రాష్ర్టాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిపై బెంగాల్‌ ప్రభావం ఉంటుందనటంలో సందేహం లేదు.

Advertisement
బెంగాల్‌ బాట!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement