e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home ఎడిట్‌ పేజీ బహుముఖ ప్రజ్ఞకు శతక వందనం

బహుముఖ ప్రజ్ఞకు శతక వందనం


దేశం మెచ్చిన సంస్కరణల రూపశిల్పి పీవీ నరసింహారావు. తెలంగాణలోని వంగర నుంచి హస్తిన దాకా ఎదిగి, తెలంగాణ మట్టి గొప్పదనాన్ని చాటిన అపర చాణక్యుడాయన. ఢిల్లీలో చక్రం తిప్పినా పునాదులను మర్చిపోకుండా దక్షిణ భారత దేశం నుంచి ఏ అతిథి వచ్చినా అక్కున చేర్చుకున్న సౌజన్యమూర్తి. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆ మేధావిపై ఆర్థికశాస్త్ర ఉపన్యాసకులు డాక్టర్‌ కర్నాటి లింగయ్య రాసిన శతకం ‘నవభారత నిర్మాత పివి.. దేశానికే ఠీవి!’.

బహుముఖ ప్రజ్ఞకు శతక వందనం

పరిపాలనాదక్షుడిగా, బహుభాషాకోవిదుడిగా పేరున్న పీవీ నరసింహారావుతో సుదీర్ఘ కాలం పరిచయం ఉన్న సాహితీవేత్త డాక్టర్‌ కర్నాటి లింగయ్య. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా భూసంస్కరణల చట్టం అమలును పీవీ నరసింహారావు ప్రారంభించిన రోజు ఇతర అధ్యాపకులతోపాటు ఆయనను కలిసి అభినందనలు తెలిపిన జ్ఞాపకం లింగయ్యది. పీవీ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు 1982లో ఇతర అధ్యాపకులు, విద్యార్థులతో సహా ఢిల్లీలో ఆయనను కలిశారు లింగయ్య. అందరినీ ఆప్యాయంగా పలకరించి, వారి బృందయాత్రా విశేషాలను పీవీ తెలుసుకున్నారు. అధ్యాపకులతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, వాతావరణ పరిస్థితులను చర్చించారు. ప్రముఖ అవధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌ శతావధానానికి విచ్చేసిన నాటి ప్రధానమంత్రి పీవీని ఇతర సాహిత్య ప్రముఖులతోపాటు కలిసిన లింగయ్య తాను రచించిన గ్రంథాలను ఆయనకు అందజేశారు. కీలకమైన ముఖ్యమంత్రి, విదేశాంగమంత్రి, ప్రధానమంత్రి మూడు పదవులను నిర్వహిస్తున్న సందర్భాలలో పీవీని వ్యక్తిగతంగా కలిసిన చిరుపరిచయాన్ని నెమరు వేసుకుంటూ వివిధ రంగాలలో ఆయన ప్రతిభను అక్షరీకరిస్తూ డాక్టర్‌ లింగయ్య రాసిన శతకమిది.
‘ఇదియే కర్నాటి మాట మేటి బాట’ అనే మకుటంతో ఈ శతక రచన చేశారు లింగయ్య. జననం నుంచి శత జయంతి ఉత్సవాల వరకు వందేండ్ల కాలాన్ని వంద పద్యాల్లో కూర్చారు. ఈ పద్యాలు చదివితే పీవీ నరసింహారావు జీవిత విశేషాలు ఒక క్రమంలో కండ్లముందు కదలాడుతాయి.
పివి సీతారామారావు రుక్మాబాయమ్మ
పుణ్యదంపతుల తనయుడై జన్మించాడు
రంగారావు రత్నాబాయి దత్త పుత్రుడయ్యాడు
ఇది జన్మవృత్తాంతం. సహజంగానే జననం తర్వాత ఎవరి జీవితంలో అయినా ముఖ్యమైంది బాల్యం, చదువు. పీవీ బాల్యాన్ని లింగయ్య రెండు పద్యాల్లో వివరించారు.
గణితం అంటే అమితంగా ఇష్టపడేవాడు
చదువులోనే కాదు ఆటల్లోనూ ముందుండేవాడు
టెన్నిస్‌ ఆటను గొప్పగా ఆడేవాడు
చిన్నప్పటి నుంచే కళలపై మక్కువ చూపించారు పీవీ. ఈ విషయాన్ని వివరిస్తూ ఇలా అంటారు.
సంగీతం, కళలంటే ప్రాణం
భజనలు, కీర్తనలు శ్రావ్యంగా పాడినాడు
భక్తిభావనలను అందరికీ పంచినాడు
ఇదేక్రమంలో ఫెర్గ్యూసన్‌ కాలేజీలో చదువు విషయం, న్యాయశాస్త్ర పట్టా అందుకున్న విష యం తర్వాతి పద్యంలో వివరించారు. హైదరాబాదు సంస్థాన విమోచనోద్యమంలో కృషిచేసిన స్వామి రామానంద తీర్థ బాటలో పీవీ నడిచారు. నాటి ప్రముఖ నాయకుడు బూర్గుల రామకృష్ణారావుకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు. ఈ విషయానికి ఇలా పద్యరూపం ఇచ్చారు.
స్వామి రామానంద తీర్థను అనుసరించి
సోషలిస్ట్‌ అభ్యుదయవాదిగా మారి
బూర్గుల రామకృష్ణకు ఇష్టుడయ్యాడు
వివిధ భాషల్లో చక్కటి అభినివేశాన్ని ప్రదర్శించారు పీవీ నరసింహారావు. దేశీయ భాషలతోపాటు విదేశీ భాషల్లోనూ అనర్గళంగా ప్రసంగించగల మేధ ఆయన సొంతం. అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్‌లో ప్రసంగించి, ప్రపంచ దేశాల నేతలను నివ్వెరపరిచారు.
పదునాలుగు భాషలకు సుపరిచితుడై
అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో
స్పానిష్‌ భాషలో అనర్గళంగా ప్రసంగించాడు
తొలిరోజుల్లో పాములపర్తి సదాశివరావుతో కలిసి కాకతీయ అనే పత్రికను నిర్వహించారు పీవీ నరసింహారావు. ఆ పత్రిక కోసం అనేక కలం పేర్లతో రచనలు చేశారు.
కాకతీయ పత్రికా సంపాదకులుగా
తెలంగాణ వాఙ్మయానికి సాక్షులుగా
వందేమాతరం ఉద్యమసారథుడిగా నిలిచాడు
సాహిత్యరంగంలో కృషిపై-
రామానంద తీర్థచే స్థితప్రజ్ఞ బిరుదు అందుకుని
వేయిపడగలును సహస్రఫణ్‌గా అనువదించి
తన జీవిత విశేషాలను ఇన్‌సైడర్‌లో ఉంచాడు
అని పేర్కొన్నారు. పీవీ మాటల నాయకుడు కాదు. తాను చెప్పేదాన్ని ముందుగా ఆచరించి చూపాలన్న మనస్తత్వం కలవారు. భూదానోద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన వారసత్వంగా వచ్చిన ఆస్తిని భూదానోద్యమానికి అందజేశారు. ఆదర్శంగా నిలిచారు.
వారసత్వంగా తనకు సంక్రమించిన భూమిని
50 ఎకరాలు భూదానోద్యమానికిచ్చి
భూసంస్కరణలతో రైతు బంధువయ్యాడు
సంస్కరణలు పక్కవాడి నుంచి కాకుండా మననుంచే ప్రారంభం కావాలన్న గొప్ప వ్యక్తిత్వం పీవీది. ఈ విషయాన్ని కూడా లింగయ్య ప్రస్తావించారు.
భూ సంస్కరణలు మా నుండే ప్రారంభించి
మాలో ఎవరికెంత భూమి పోతుందో
మొదట మేమే డిక్లేర్‌ చేస్తామన్న ధీరుడు
ఆర్థిక సంస్కరణలతో దేశ అభివృద్ధికి పాదులు తీశారు పీవీ నరసింహారావు. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు జీవం పోసి, ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించారు.
పి.వి. భారతదేశ ఠీవిగా నిలిచి
నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టి
దేశ సౌభాగ్యమునకు కృషి చేసిన ధీశాలి
తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత పీవీ శత జయంతి సందర్భంగా సంవత్సరమంతా కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేస్తారు ఈ కవి.
తెలంగాణ బిడ్డకు శతజయంతి ఉత్సవాలు
సంవత్సరం పొడవునా సభలు జరుపుతూ
పాములపర్తికి నివాళి అర్పించాలి
సింహనాదం అందరికీ పరిచితమైన పదం. మాజీ ప్రధాని నరసింహారావు పేరును ఈ పదంతో లంకె పెట్టి నరసింహనాదంగా పేర్కొని పదచమత్కారం చూపించారు.
విశ్వమంతా నరసింహనాదం వినాలని
శతజయంతి ఉత్సవాలు ప్రారంభించి
జ్ఞానభూమి ఏర్పాటు చేశారు
ఈ శతకంలో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, జైళ్లలో వృత్తి విద్యావకాశాల కల్పన, విదేశీ సంబంధాలు, పంచాయతీరాజ్‌ సంస్థలకు చట్టబద్ధత, పన్నుల సంస్కరణలు, జాతీయ స్టాక్‌ ఎక్సేంజీ ఏర్పాటు మొదలైన అంశాలను ప్రస్తావించారు.
లింగయ్య రాసిన నూరు పద్యాలు ఛందోరహితాలు. స్వతంత్ర భావం ఉన్న ముక్తకాలు. ఈ పద్యాల్లో సులభశైలిలో రాయడం కనిపిస్తుంది. పదాడంబరాలు లేకుండా అందరికీ తెలిసిన పదాల్లోనే పీవీని చిత్రించారు లింగయ్య. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, కీలకమైన శాఖల మంత్రిగా, బహుభాషావేత్తగా, సంపాదకుడిగా, సాహితీవేత్తగా నరసింహారావు సాధించిన విజయాలకు అద్దం పట్టే శతకమిది.
(నవభారత నిర్మాత పివి.. దేశానికే ఠీవి!, కవి: డాక్టర్‌ కర్నాటి లింగయ్య, ప్రచురణ: నందనవనం సాహితీ సమితి, హైదరాబాదు. వెల: రూ.99, ప్రతులకు: కవి, 8332947239)

డాక్టర్‌ రాయారావు సూర్యప్రకాశ్‌ రావు
9441046839

Advertisement
బహుముఖ ప్రజ్ఞకు శతక వందనం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement