e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home ఎడిట్‌ పేజీ ఫెడరలిజం అజేయం

ఫెడరలిజం అజేయం

ఫెడరలిజం అజేయం

సామంతులు కూటాలుగా ఏర్పడి తిరుగుబాట్లు చేశారు. అనువైనప్పుడు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. లేదా తామే కేంద్ర స్థానంలో అధికారానికి వచ్చారు. ఈ పరిణామ క్రమాలు ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్ధమైన ఫెడరలిజం రూపం తీసుకున్నాయి. చరిత్ర కాలపు ఘర్షణలు మరొక రూపంలో కొనసాగుతున్నాయి. ఈ డబ్భు ఏండ్లలో ఎంత ప్రయత్నించినా కేంద్రీకరణ ధోరణులు గెలువలేదు. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఫెడరలిస్టు శక్తులు ఓడలేదు. అసలు ఫెడరలిజం అనే భావనకు మూలాలు ఎక్కడున్నాయి? ప్రస్తుతం గల ఆలోచనల ప్రకారం ఇది దేశంలోని వివిధ ప్రాంతాల రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక హక్కులకు సంబంధించిన విషయం. ఆ హక్కులకు, కేంద్రంలోని శక్తులకు, రాజ్యాంగానికి మధ్యగల పరిపాలనా ఏర్పాట్ల విషయం. ఈ ఆలోచన, లేదా సూత్రీకరణ ఒక స్థాయిలో సరైనదేగాని, అది సంపూర్ణమైనది కాదు. ఫెడరలిజపు ప్రస్తుత స్వభావాన్ని అది రాజకీయ కోణానికి పరిమితమై చెప్తుంది.  అంతే తప్ప, అసలు ఈ భావనకు మానవ సమాజంలో, సుదీర్ఘ చరిత్రలో మూలాలు ఎక్కడున్నాయనేది ఈ పరిమితమైన, వర్తమాన కాలపు నిర్వచనాన్ని బట్టి తెలియదు. కేంద్రీకరణ శక్తుల నుంచి ఎన్నెన్ని వత్తిడులు ఎదురైనా, మధ్య మధ్య పరిస్థితులను బట్టి వెనుకంజ వేయవలసి వచ్చినా, ఫెడరలిజపు దుంప పిలకలు వేసి పెరుగుతూనే ఉన్నదంటే.., ఆ భావనకు మూలాలు ఎక్కడో సమాజపు లోతులలో ఉన్నాయన్నమాట. ఇది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే తప్ప మనకు వర్తమాన ఫెడరలిజంగాని, అది ఎందుకు చిరంజీవిగా వర్ధిల్లుతున్నదోగాని అర్థం కాదు. 

క్లుప్తంగా చెప్పాలంటే, ఫెడరలిస్టు భావనకు తల్లివేరు మూలం వ్యక్తి- కుటుంబం- తెగ- వారిభూమి- నివాసప్రాంతం- కార్యనిర్వహణా క్షేత్రం అనే వాటిలో ఉంది. ఈ ఆరు అంశాలు కలగలిసి ఫెడరలిస్టు భావనకు పునాది లేదా ప్రాతిపదిక అయ్యాయి. ఇది నిజానికి ఆటవిక సమాజ దశ. తర్వాత స్థిరమైన వ్యావసాయిక సమాజాలు ఏర్పడటం మొదలైనప్పుడు ఇదే ప్రాతిపదిక రాజకీయరూపంతో విస్తరించింది.  ఎక్కువ బలం గల ఒక సమాజం తన సరిహద్దులలోని ఇతర సమాజాలపై ఆధిపత్యం కోసం హింస ద్వారా ప్రయత్నించింది. ఈ కొత్త స్థితి- పైన అనుకున్నట్లు చరిత్ర పొడవునా ఘర్షణలు, సంధులు, తిరుగుబాట్లు, కూటములు, స్వాతంత్య్రాలుగా సాగుతూ పోయింది. దీనంతటి మధ్య గమనార్హమైన మరొక పరిణామం కూడా రూపుదిద్దుకోసాగింది. ఫెడరలిస్టు భావన ఉన్నత వర్గాలలో, పై స్థాయిలో కొనసాగుతూ కూడా పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులకు లోనైంది. కానీ క్షేత్రస్థాయిలో, సమాజ స్థాయిలో అది ఒక తెగ భావనగా, జాతి భావనగా బలపడి స్థిరపడుతూ వచ్చింది. ఇందుకు సమాంతరంగా జాతి నిర్మాణాలు (నేషన్‌ బిల్డింగ్‌) జరిగే క్రమంలో, అటువంటి ప్రయోజనాల కోసం గానీ, లేదా అందుకు ముప్పు ఏర్పడినప్పుడు గాని, ఈ మౌలిక ఫెడరలిస్టు భావన అవసరమైన సర్దుబాట్లు లేదా రాజీలకు సిద్ధపడింది. కాని, తన మౌలిక భావనను వదులుకోలేదు. ఫెడరలిజంలోని ఉన్నత వర్గాలు పరిస్థితులను బట్టి వెనుకడుగు వేసినా, తర్వాత వారిని నిలబెట్టి నడిపింది క్షేత్రస్థాయిలోని ఈ మౌలికమైన ఫెడరలిస్టు భావనే. అది ఒక సజీవ స్రవంతి. తను ఓడదు, తన నాయకత్వాన్ని ఓడనివ్వదు. అదే సమయంలో ఆ స్రవంతి సజీవతకు దోహదం చేసే బాధ్యత నాయకత్వంపైనా ఉంటుంది. స్రవంతి సజీవత నిరంతరమైనట్లు, ఈ దోహద ప్రక్రియ కూడా నిరంతరం కావాల్సి ఉంటుంది.

- Advertisement -

రాజకీయంగా గమనించినా భారత రాజ్యాంగంలోని సహకార ఫెడరలిజానికి మూలాలు ఎక్కడున్నట్టు? 1857 నాటి భారత ప్రథమ స్వాతంత్య్ర యుద్ధానికి ముందే వందేండ్లకు పైగా దేశం నలుమూలలా రైతులు, ఆదివాసీలు, స్థానిక పాలకులు తమ హక్కులు స్థానిక ప్రయోజనాల కోసం సాగించిన తిరుగుబాట్లలో ఉన్నాయి. 1857 తర్వాత 1885లో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడినప్పుడు, దేశంలోని వీలైనన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి వారి ఆకాంక్షలకు అవకాశం కల్పించటంలో ఉన్నాయి. తర్వాత 20వ శతాబ్దం వచ్చేసరికి బ్రిటిష్‌ పాలకులు వివిధ ప్రాంతాలకే గాక ఆయా సామాజిక వర్గాలకు కూడా చట్టబద్ధమైన హక్కులు ఇవ్వక తప్పని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్‌ ఉద్యమం పొడవునా చేసిన పలు తీర్మానాలలో, స్వాతంత్య్రానికి ముందే1937 నాటి ప్రభుత్వ చర్యలలో, చట్టసభల సభ్యులుగా జరిపిన వ్యవహరణలో ఉన్నాయి. అంతిమంగా 1950 నాటి రాజ్యాంగంలో ప్రతిఫలించాయి. ఇటువంటి వేల సంవత్సరాల మూలాలు, చరిత్ర గల ఫెడరలిజం అజేయమైనది.

-టంకశాల అశోక్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫెడరలిజం అజేయం
ఫెడరలిజం అజేయం
ఫెడరలిజం అజేయం

ట్రెండింగ్‌

Advertisement