e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home ఎడిట్‌ పేజీ ప్లవకు స్వాగతం

ప్లవకు స్వాగతం

ప్లవకు స్వాగతం

ఏటేటా ఒక్క రోజైనా/ ఇలా ఉగాది రాకపోతే/ మానవ జీవితపు టెడారిలో/ మల్లెలెలా వికసిస్తాయి?/ చేదు బ్రతుకుల వేప కొమ్మమీద/ చిలక కూర్చొని తీయగా పలకనీ!/ కళ్లకు కనపడకపోయినా, కోయిల/ కడు దూరం నుంచైనా పాట వినిపించనీ!’ అంటూ ఆనాడు ప్రజల కష్టాలు, కన్నీళ్లు పట్టని పాలకుల ఏలుబడిలో.. సహజ ప్రకృతే తన ఒడిలోకి తీసుకొని జనులను లాలించాలని తెలంగాణ వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్య ఆకాంక్షించారు. తరతరాల దోపిడీ అణచివేతలు, నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా తమ జీవితాల్లో సుఖ సంతోషాల వెలుగురేఖలన్నవే లేని దుస్థితిలో.. ‘ఈ ఉగాదే రాకుంటే ఇంకేముంది?/ఈ పెదవులపై చిరునవ్వు ఎలా పుడుతుంది?/ఈ ఉగాది ఇంటింటా అవతరించాలి/ ఇక నిరాశ లోకంలో అంతరించాలి..’అని తెలంగాణ భవిష్యత్‌ కాలాన్ని కలగన్నాడు. తెలంగాణ మాగాణం ఎలా పసిడిపంటలతో కాంతులీనాలని, ప్రజలంతా ఎలా ఆనందడోలికల్లో ఊగాలని దాశరథి ఆశించాడో, ఆకాంక్షించాడో అది అక్షర సత్యంలా కండ్లముందర సాక్షాత్కారమవుతున్న శుభ సందర్భ యుగాది ఇది.

యు(ఉ)గాది అనగానే.. మనకు షడ్రుచులు గుర్తుకు వస్తాయి. తొలి పండుగగా జరుపుకొనే ఉగాది రోజున ఆరు రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని సేవిస్తే ఏడాదంతా జీవనం సుఖప్రదంగా సాగుతుందని విశ్వాసం. అలాగే ఇంటికొచ్చిన యాసంగి పంటనుంచి దోసెడు గింజలైనా తీసి కొత్తన్నం పేర వండి నైవేద్యంగా సమర్పించి భుజించటం ఆనవాయితీ. తెలంగాణలో నూతన సంవత్సరాదిని చంద్రమాన గణన ఆధారంగా చైత్ర శుక్ల ప్రతిపత్తుతో ప్రారంభించటం ఆచారం. ఇది ప్లవనామ సంవత్సరం. ప్లవ అంటే-దాటడం, దాటించునది అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే ప్రస్తుత పరిస్థితుల్లో మనమే కాదు, సమస్త మానవాళి ఎదుర్కొంటున్న అగడ్తలు, చీకట్లనుంచి మనుషుల్ని వెలుగులోకి తీసుకుపోవు ప్లవనామ సంవత్సరానికి కోటి ఆశలతో సాదర ఆహ్వానం పలుకుదాం.

అనంత కాలగమనాన్ని అరవై ఏండ్ల చక్రగమనంలో ఒక్కో ఏడాదికి ఒక్కో సార్థక నామంతో పిలుచుకోవటం తెలుగునాట తరతరాల సంప్రదాయం. గత వికారి (వికృతి), శార్వరి(చీకటి)నామ సంవత్సరాలు సార్థక నామాలుగా ప్రపంచంలో తమ ప్రభావాన్ని చూపాయి. వికారినామ సంవత్సరంలో కరోనా వ్యాప్తి వికృతాన్ని ప్రపంచమంతా అనుభవించింది. వైరస్‌ ప్రభావంతో శార్వరిలో అలుముకున్న చీకటి మానవ జీవితంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మానవానుబంధాలను వికృత విలయాలు చిదిమేశాయి. గడ్డ కట్టిన చీకట్ల నుంచి మనిషిని వెలుగులోకి దాటించే ప్లవనామ సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. దాశరథి అన్నట్లు.. ‘తెలుగింటి ముందరి వసారా/లో మ్రొగె నౌబత్‌ నగారా../ వెలసింది వాసంత లక్ష్మి/ విజయం గులాబీలదేరా..!

Advertisement
ప్లవకు స్వాగతం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement