e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home ఎడిట్‌ పేజీ ప్రజామోదమే యోగ్యతాపత్రం

ప్రజామోదమే యోగ్యతాపత్రం

ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యంలో మంచి పాలకులు చేసే పని. రైతుబంధు, రుణమాఫీ,కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, వృద్ధాప్య పింఛన్‌, కులాల వారీగా ఆదాయ మార్గాలు పెంచడానికి గొర్రెలు, బర్రెలు, చేపలు, సెలూన్లు, భవన నిర్మాణాల వంటివి ఎన్నో అమలుచేశారు కేసీఆర్‌. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. వీటన్నింటినీ ఓట్ల కోసం చేసిన చర్యలుగానో, మరోవిధంగానో విమర్శించే వాళ్లూ ఉన్నారు. వీటితో చిన్న రైతుల ముఖాల్లో వచ్చిన వెలుగు, ఆయా పథకాల ఫలాలను అనుభవిస్తున్న సామాన్యులను అడిగితే తెలుస్తుంది అసలు విషయం, పనిగట్టుకొని తప్పుబట్టేవారికేం తెలుస్తుంది ఆ ఫలాల్లో ఉన్న అనుభూతి?

ప్రజామోదమే యోగ్యతాపత్రం

కరెంటు కష్టాలు అనుభవించిన తెలంగాణ ప్రజలు, రైతులు నిరంతర విద్యుత్‌ సౌకర్యంతో తమ బతుకుల్లో వెలుగు నింపుకొంటున్నారు. వీళ్లనడిగితే తెలుస్తుంది యోగ్యతా పత్రమంటే ఎలా ఉండాలో! చాలీచాలని జీతాల నుంచి గణనీయంగా పెరిగిన ఉద్యోగుల జీతభత్యాలు, ఉద్యోగ విరమణ వయోపరిమితి, ప్రైవేట్‌, ప్రభుత్వరంగంలో పెరిగిన, వస్తున్న ద్యోగులనడిగితే తెలంగాణలో ఏం జరుగుతున్నదో తెలుస్తుంది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అనతికాలంలోనే కాళేశ్వరం లాంటి మహాద్భుతాలను పూర్తిచేసి తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసిండు కేసీఆర్‌. మహబూబ్‌నగర్‌, నల్గొండ లాంటి నీటి కరువు ప్రాంతాలూ పచ్చగా మారాయి. చెరువులు, కుంటలు, వాగులు,ఒర్రెలు, కాలువలు, నిండుగా పారి జలకళ వచ్చింది. రైతు కంటతడి ఆరి హృదయతడి పెరిగింది. తెలంగాణ కరువు ప్రాంతం గా కాకుండా ధాన్యాగారమవుతున్నది. వ్యవసాయం పండుగ కావడంతో ఆనందపడుతున్న లక్షల రైతు కుటుంబాలు కదా కేసీఆర్‌కు యోగ్యతా పత్రమిచ్చే అర్హత ఉన్నవాళ్లు.

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, నీటి ప్రాజెక్టులు లాంటి అనేక పథకాల వల్లే కదా.. ఇంటింటికి మంచినీరు, ప్రతి అంగుళానికి సాగునీరు అందుతున్నది. అంతేకాదు భూగర్భ జలాలు పెరిగి భూ తాపం తగ్గుతున్నది. హరితహారం పథకం ద్వారా కోట్ల మొక్కలు నాటడం ద్వారా చెట్ల నుంచి వెలువడే ఆక్సిజన్‌తో గాలిలో విష వాయువులు తగ్గి వాతావరణ కాలుష్యం తగ్గుతున్నది. మన దేశం గ్రామాల్లో నివసిస్తుందన్నది వాస్తవం. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను ప్రకృతి, వాతావరణ సంరక్షణ కేంద్రాలుగా మారుస్తూనే పట్టణ వసతులు కలిగించే పనిని కేసీఆర్‌ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమను విస్తరింపజేస్తూ పల్లెలనూ ఆదాయ వనరులుగా మారుస్తున్నారు.

గడప దగ్గరకే వస్తున్న భగీరథ నీటిని, ఆదాయ మార్గాలను, పొందు తున్న లక్షల మంది పల్లె ప్రజలు కేసీఆర్‌కు ఇస్తున్న యోగ్యతా పత్రమే విలువైనది. చెట్ల మధ్యలోకి వెళ్లి చల్ల గాలిని పీల్చుకున్నవారికే తెలుస్తుంది హరితహారం ఆ పథకంలోని గొప్పతనం. మహబూబ్‌నగర్‌, నల్గొం డ, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి పొట్టచేత బట్టుకొని వలస పోయిన ప్రజలు తిరిగి సొంతూర్లకు రావడం గురించి ఆలోచిస్తున్నారంటే తెలంగాణలో ఏం జరుగుతున్నదో అర్థమవుతూనే ఉన్నది. వ్యవసాయం లాభసాటిగా మారింది.అనేక మందికి ఉపాధి లభిస్తున్నది. వ్యవసాయ అనుబంధ రంగాల ఆదాయ మార్గాలూ పెరిగాయి. అందుకే తెలంగాణ గ్రామాల దిక్కు, తెలంగాణ దిక్కు నేడు ప్రపంచం చూస్తున్నది.

కరెంటు కష్టాలు అనుభవించిన తెలంగాణ ప్రజలు, నిరంతర విద్యుత్‌ సౌకర్యంతో రైతులు తమ బతుకుల్లో వెలుగు నింపుకొంటున్నారు. వీళ్లనడిగితే తెలుస్తుంది యోగ్యతా పత్రమంటే ఎలా ఉండాలో! చాలీచాలని జీతాల నుంచి గణనీయంగా పెరిగిన ఉద్యోగుల జీతభత్యాలు, ఉద్యోగ విరమణ వయోపరిమితిపెంపు, ప్రైవేట్‌, ప్రభుత్వరంగంలో వస్తున్న ఉద్యోగులనడిగితే తెలంగాణలో ఏం జరుగుతున్నదో తెలుస్తుంది. నిరాదరణకు గురైన తెలంగాణ భాష, జానపదకళలు, యాచకవృత్తుల కళలు అందలమెక్కి సినిమాల్లోనూ తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. కుల, మతాలకతీతంగా జరుపుకొనే అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న జాతీయ పండుగ బతుకమ్మ. టీవీల్లో, సినిమాల్లో తెలంగాణ పాత్రలు, భాష, కథలు చోటుచేసుకుంటూ తెలంగాణ కళాకారులు ఎదుగడానికి దోహదం చేస్తున్నాయి. ఈ కళాకారులనడిగితే తెలుస్తుంది తెలంగాణ అంటే ఏమిటో? అంతేకానీ కుహనా మేధావులకు, గోడమీది పిల్లి రాజకీయులకేం తెలుస్తుంది?

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన పనుల్లో, చిన్న జిల్లాల ఏర్పాటు ఒకటి. ఇది కూడా తప్పుగానే కనబడింది కొందరికి. కాగజ్‌నగర్‌ నుంచి ఆదిలాబాద్‌కు పోవాలంటే రోజంతా అయిపోయేది. ప్రయాణభారం, ఖర్చు కూడా మూడింతలు. అలాగే నారాయణ్‌ఖేడ్‌ నుంచి సంగారెడ్డి, మహాదేవ్‌పూర్‌ నుంచి కరీంనగర్‌కు రావడం దూరాభారం కాదా! చిన్నజిల్లాల ఏర్పాటు వల్ల ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ప్రమోషన్లు లభించడమే కాకుండా, ఉద్యోగాలూ పెరిగాయి. అధికారులు జిల్లాల సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం లభిస్తున్నది. చిన్న జిల్లాల వల్ల ఏ మేరకు లాభాలున్నాయో జిల్లా కేంద్రాలకు పనుల కోసం వెళ్లే జనాన్ని అడిగితే కదా తెలిసేది?

త్వరలో యాదాద్రి, అద్భుతమైన సచివాలయ భవనాలను కూడా పూర్తిచేసి, అంబేద్కర్‌ 125 అడుగుల ఎత్తు విగ్రహం, మిగిలిపోయిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించి ప్రజల నుంచి మరిన్ని యోగ్యతాపత్రాలు పొందుతారనడంలో సందేహం లేదు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా చేస్తున్న అనేక కార్యక్రమాల వల్ల ఆత్మగౌరవం, భాషా సాంస్కృతికరంగాల్లో తెలంగాణ ఆత్మ ప్రతిధ్వనిస్తున్నది. వ్యవసాయం, పారిశ్రామిక, ఆర్థిక, పరిపాలనారంగాల్లోనూ మౌలిక మార్పులు వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అందుకే తెలంగాణ ప్రజలు 2014 నుంచి ప్రతి ఎన్నికలోనూ కేసీఆర్‌నే అఖండ మెజారిటీతో గెలిపించి హృదయానికి హత్తుకుంటున్నారు. ఇదే హైదరాబాద్‌ దక్కన్‌ (తెలంగాణ) ప్రజలు కేసీఆర్‌కు ఇస్తున్న యోగ్యతాపత్రం. ప్రజాస్వామ్య యుగం లో ‘ఓటు’ను మించిన యోగ్యతా పత్రం మరేమున్నది?

డాక్టర్‌ కాలువ మల్లయ్య

Advertisement
ప్రజామోదమే యోగ్యతాపత్రం

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement