e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home ఎడిట్‌ పేజీ ప్రగల్భాలతో పార్టీ నడిచేనా?

ప్రగల్భాలతో పార్టీ నడిచేనా?

తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది. ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన పోరాటం డబ్భు ఏండ్ల నాటిది. నిజాం కాలం నుంచి అవస్థ పడుతున్న తెలంగాణ ప్రజలకు 2014లో విముక్తి లభించింది. ప్రతి తెలంగాణ పౌరుడు కొత్త రాష్ర్టాన్ని సాధించుకున్న ఆనందంలో ఉన్నాడు. గత ఏడేండ్లలో సాధించిన విజయాలు, లభిస్తున్న పథకాలతో సంతోషంగా ఉన్నాడు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురు షర్మిలమ్మ అనుకుంటున్న మామూలు తెలంగాణ కాదు ఈ గడ్డ.

తెలంగాణ గురించి ఏం తెలుసని షర్మిలమ్మ తెలంగాణలో అడుగుపెట్టారు.కేసీఆర్‌ గురించి విమర్శించే స్థాయి ఆమెకు ఉందా? మానుకోటలో జగన్‌కు జరిగిన అవమానం తెలుసుకోవాలి. తెలంగాణ వచ్చిన ఏడేండ్ల తర్వాత తాను తెలంగాణ ఆడపడుచును అంటూ ఏదో నమ్మబలకాలనుకుంటున్నారు. కాని ఇక్కడి ప్రజలకు అన్నింటి గురించి తెలుసు.

ప్రగల్భాలతో పార్టీ నడిచేనా?

1948లో హైదరాబాద్‌ రాష్ట్రం, 1953లో ఆంధ్ర రాష్ట్రం వేర్వేరుగా ఏర్పాటైన తర్వాత తెలుగువాళ్లందరూ ఒకటేనని కుట్రపూరితంగా తెలంగాణలో ఆంధ్రులు పాగా వేశారు. లక్షల ఎకరాల భూములు సొంతం చేసుకున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 వరకు తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందే. నీళ్లు, నిధులు, నియామకాల్లో పూర్తిగా అన్యాయమైపోయింది. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో 369 మంది ప్రాణాలు పోయాయి. ఎంతోమంది ఎన్నోసార్లు ప్రత్యేక తెలంగాణ గురించి పోరాటం చేసినా వాటిని పురిట్లోనే అణిచేసేవారు. అయినా తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం కోసం పోరాటం ఆపలేదు. కేసీఆర్‌ నాయకత్వంలో 2014లో సిద్ధించిన తెలంగాణలో అప్పుడే పొగ పెట్టాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. 2018లోనే మహాకూటమి పేరుతో చంద్రబాబు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు వైఎస్సార్‌ కూతురు షర్మిలమ్మ కొత్త పార్టీతో ఏదో చేయాలనుకుంటున్నారు. ఖమ్మం సభలో తెలంగాణ గురించి కేసీఆర్‌ గురించి ఎక్కువగా మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తానంటూ ప్రగల్భాలు పలికారు.

దేశచరిత్రలో తెలంగాణది ఒక మహా పోరాటం. తెలంగాణ చరిత్ర, పరిశోధన అంటే పురావస్తు పరిశోధన లాంటిదే. పెద్ద మనుషుల ఒప్పందం, ఒప్పందం ఉల్లంఘనలు, విశాలాంధ్ర నిర్మాణం, ఫజల్‌ అలీ కమిషన్‌ నివేదికలు, ముల్కీ- నాన్‌ ముల్కీల ఉద్యమం, 1952లో హైదరాబాద్‌ హిత రక్షణ కమిటీతో విద్యార్థుల ఉద్యమాలు, నాటి నాయకులు కేశవరావు జాదవ్‌, రామానంద తీర్థ, కాళోజీ, వందేమాతరం రామచంద్రరావు, కొండా వెంకటరెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, జే చొక్కారావు, జయశంకర్‌, మల్లికార్జున్‌, శ్రీధర్‌రెడ్డి, రాజబహదూర్‌గౌర్‌ తదితరుల గురించి షర్మిలమ్మకు తెలుసా? 1969 నాటి జై తెలంగాణ ఉద్యమ నేపథ్యం, పోలీస్‌ కాల్పులు, నిరాహార దీక్షలు, తెలంగాణ విమోచన ఉద్యమ సమితి, అఖిలపక్ష ఒప్పందాలు, ఎనిమిది సూత్రాల పథకం, తెలంగాణ ప్రజా సమితి తదితర పోరాటాలు సుదీర్ఘమైనవి.

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటున్న షర్మిలమ్మ అసలు తెలంగాణకు తన తండ్రి ఎంతటి అన్యాయం చేసిందీ తెలుసుకోవాలి. గిర్‌గ్లాని కమిషన్‌ చెప్పినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్న రెండున్నర లక్షల మంది ఉద్యోగులను ఆంధ్రకు పంపించలేదు. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన వేలమంది ఆంధ్రులను క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగాల్లో నియమించారు. ఈ వివరాలు తెలుసా? పోలవరం ప్రాజెక్టు పేరుతో ఖమ్మం జిల్లాలోని వందల గ్రామాలను ముంపునకు గురిచేయడం వైఎస్సార్‌ చేసిన గొప్ప పనా? హైదరాబాద్‌ నగరానికి మంచినీటిని రాకుండా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను 10 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ రాయలసీమ ప్రాంతానికి తరలించలేదా? నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు అన్యాయం చేసేవిధంగా పులిచింతల ప్రాజెక్టు, రాజోలిబండ డైవర్షన్‌ స్కీంలకు ప్రణాళికలు వేయలేదా? ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలి.

తెలంగాణ చరిత్ర, భూగోళం, ఇక్కడి యాస, భాష , ప్రజల ఆటలు పాటలు, సంస్కృతి వైభవం గురించి తెలియని షర్మిలమ్మకు కేసీఆర్‌ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం సస్యశ్యామలంగా ఉన్నది. పచ్చని పంటలతో అలరారుతున్నది. ఊళ్లల్లో చెరువులు నిండి రైతులంతా ఆనందంగా ఉన్నారు. కాళేశ్వరం నీళ్లు ఉత్తర తెలంగాణ అంతటా పారుతున్నాయి. కేసీఆర్‌ అందిస్తున్న ప్రతి పథకం ప్రతి పేదవాడికి అందుతున్నది. ఎవరో పరాయివారు వచ్చి చెప్తే నమ్మే స్థాయిలో తెలంగాణ ప్రజలు లేరన్నది గుర్తుంచుకోవాలి.

కన్నోజు మనోహరాచారి

Advertisement
ప్రగల్భాలతో పార్టీ నడిచేనా?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement