e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home ఎడిట్‌ పేజీ నేటి తరానికి నాటి పోరాట స్ఫూర్తి

నేటి తరానికి నాటి పోరాట స్ఫూర్తి

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2022 ఆగస్టు 15 నాటికి 75 ఏండ్లు పూర్తవుతున్నందున ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట 75 వారాలపాటు ఉత్సవాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ ఈనాటి యువతరానికి స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే స్పందించారు. రాష్ట్రంలోని 75 ప్రదేశాల్లో హైదరాబాద్‌ నగరంలోని సంజీవయ్య పార్కులో ఉన్న అతి పెద్ద జాతీయ పతాకం మాదిరిగానే ఏర్పాటుకు రూ.25 కోట్లను మంజూరు చేశారు. ఉత్సవాలను ఈ నెల 12న వరంగల్‌ పట్టణంలో రాష్ట్ర గవర్నర్‌, హైదరాబాద్‌ పబ్లిక్‌గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించారు. నేటి తరానికి ఈ ఉత్సవాలు నిజంగానే చాలా అవసరం. 

నేటి తరానికి నాటి పోరాట స్ఫూర్తి

నేటి విద్యార్థులకు నాటి స్వతంత్ర పోరాటం గురించిన విశేషాలు పూర్తిగా తెలియవు. రాజకీయాలు, సినిమాముచ్చట్లు, ఇతర అభిరుచుల్లో తేలియాడేవారికి- 1498 నుంచి 1947 వరకు.. సుమారు 449 ఏండ్లు విదేశీ పాలకుల నీడలో గడిపిన భారతీయుల చేదు జ్ఞాపకాలను తెలియజేయడం ఎంతో అవసరం. పోర్చుగీసులు, డచ్చులు, డేన్స్‌, బ్రిటిషర్లు , ఫ్రెంచ్‌ పాలకులు వరసపెట్టి ఈ దేశాన్ని ఏలారు. కోటానుకోట్ల భారతీయ సంపదను భయంకరంగా దోచుకున్నారు. వారికీ వారికీ మధ్య జరిగిన యుద్ధాల్లో లక్షల మంది భారతీయలు చనిపోయారు. 1833లో గవర్నర్‌ జనరల్‌గా నియమితులైన విలియం బెంటిక్‌ నుంచి 1948 లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ వరకు బ్రిటిషర్ల పెత్తనం కొనసాగింది. 1856 వరకు జరిగిన పోరాటం ఒక ఎత్తయితే, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయితో మొదలయిన సమరం మరో ఎత్తుగా పరిగణించాలి. 

1857 నాటి భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం తరువాత వరుసగా ఎన్నో ఉద్యమాలు కొనసాగాయి. బ్రిటిష్‌ కబంధ హస్తాల నుంచి భారత్‌ను విముక్తి చేయడమే లక్ష్యంగా జరిగిన పోరాటాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. 1876లో సురేంద్రనాథ్‌ బెనర్జీ ఇండియన్‌ నేషనల్‌ మూవ్‌మెంట్‌ స్థాపించగా, 1885లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రారంభమయింది. 1905లో స్వదేశీ ఉద్యమం, 1916లో హోమ్‌ రూల్‌, 1919లో ఖిలాఫత్‌, 1922లో చౌరీచౌరా, సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో దండి మార్చ్‌, శాసనోల్లంఘన ఉద్యమం, 1942లో క్విట్‌ ఇండియా నుంచి 1948 జనవరి 30న గాంధీజీ చనిపోయేవరకు జరిగిన అనేక పోరాటాలలో ఎంతోమంది నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 

1919లో రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన పోరాటం.. జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన దమనకాండలో వందల మంది ప్రజల బలిదానం భారత స్వతంత్ర పోరాట చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోతాయి. మహాత్మాగాంధీతో పాటుగా గోపాలకృష్ణ గోఖలే, చిత్తరంజన్‌దాస్‌, దాదాబాయి నౌరోజీ, బద్రుద్ద్దీన్‌ త్యాగి, లాలా లజపత్‌రాయ్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మోతీలాల్‌ నెహ్రూ, బాలగంగాధర్‌తిలక్‌, భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు, అనీబిసెంట్‌, సుభాష్‌చంద్రబోస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభ్‌భాయ్‌ పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, అంబేద్కర్‌ మొదలైన ఎంతోమంది నాయకులు భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఎన్నోసార్లు అరెస్టయ్యారు. లాఠీదెబ్బలు తిన్నారు. ఈ మధ్యలోనే బెంగాల్‌ విభజన, వందేమాతరం ఉద్యమం వచ్చాయి. మరోవైపు ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్‌, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మతాల్ని రెచ్చగొట్టే పనిలో పడ్డాయి. బ్రహ్మసమాజ్‌, ఆర్యసమాజ్‌, ప్రార్థనా సమాజ్‌, జస్టిస్‌ పార్టీ, పెరియార్‌ ఉద్యమం లాంటివి రంగంలోకి వచ్చాయి. ఇంకా చంపారన్‌ సత్యాగ్రహ, ఖేడా సత్యాగ్రహ, మోప్లా తిరుగుబాటు, తెలంగాణ ఉద్యమం కూడా ప్రభావితం చేశాయి. 

భారత స్వాతంత్య్ర సంగ్రామం ఒక అద్భుతమైన పోరాట చరిత్ర. స్వతంత్రమే ఊపిరిగా బతికిన నాయకుల చరిత్ర ఈ తరానికి అవసరం. ఈ దేశ  చరిత్ర ఒక శాశ్వత ఘట్టంగా ముందు తరాలకు కనబడాలంటే- 1857 నుంచి 1947 వరకు.. అంటే 90 సంవత్సరాల చరిత్రను 75 వారాలపాటు కేవలం విద్యుత్‌ అలంకరణలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలతో ఉత్సవాలకే పరిమితం చేయకుండా ప్రభుత్వం కొన్ని ముఖ్య నిర్మాణాత్మక కార్యక్రమాలకు కూడా పూనుకుంటే బాగుంటుంది. స్వతంత్రం కోసం ఉద్యమాలు జరిగిన అన్ని ప్రదేశాలను కలుపుతూ ఒక సర్క్యూట్‌ రూట్‌ను ఏర్పాటుచేయడం అందులో ఒకటి కావాలి. ఆయా ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. భారత స్వతంత్ర సంగ్రామంతో సంబంధమున్న ప్రతి ప్రదేశం వివరాలను అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలి. స్వాతంత్య్రోద్యమంతో సంబంధమున్న నాయకుల జన్మదినోత్సవాలను రాజకీయాలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకోవాలి. నాటి నాయకుల పేర్లతో అవార్డులను ప్రవేశపెట్టాలి. కరెన్సీనోట్లపై మహాత్మాగాంధీ ఫొటోతోపాటుగా మరికొంతమంది నాయకుల ఫొటోలు కూడా ముద్రించాలి. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా- భారత స్వతంత్ర సంగ్రామ ఘట్టాలను ప్రతిబింబించేలాగా పెద్ద పెద్ద నగరాల్లో 10- 15 ఎకరాల విస్తీర్ణంలో చిత్రాలను లేదా మైనపు బొమ్మలను ప్రదర్శించాలి. సందర్శకులు కనీసం రెండు గంటలు తిలకించేలాగా ఏర్పాటు చేయాలి. విద్యాసంస్థల్లో గొప్ప నాయకుల చిత్రాలను వేయాలి. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో స్వతంత్ర ఉద్యమ పాఠాలను మరిన్ని ఎక్కువ జోడించాల్సిన అవసరం ఉంది. 

-కన్నోజు మనోహరాచారి 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేటి తరానికి నాటి పోరాట స్ఫూర్తి

ట్రెండింగ్‌

Advertisement