e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home ఎడిట్‌ పేజీ దొడ్డు వడ్లపై దొంగచూపు

దొడ్డు వడ్లపై దొంగచూపు

‘ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు’ ఉంది ఇకపై దొడ్డు వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారింది. 60 ఏండ్ల అన్యాయాలకు వ్యతిరేకంగా 14 ఏండ్లు కేసీఆర్‌ నాయకత్వంలో ఉద్యమించి సాధించిన ప్రత్యేక రాష్ట్రఫలాలను తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే అనుభవించేందుకు సిద్ధమవుతున్నది.

దేశంలో ఏ రాష్ర్టానికి సాధ్యం కాని పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశంలో అతి తక్కువ కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించి ఆదర్శంగా నిలిచింది. 2014 వరకు ఆకలి కేకలతో అలమటించిన తెలంగాణ గత వానకాలం, యాసంగిలో 3 కోట్ల టన్నుల పైచిలుకు వరిధాన్యం పండించి నేడు దేశానికే అన్నపూర్ణగా నిలిచింది. 60 ఏండ్లు తాగునీటికి మొహం వాచిన తెలంగాణ రైతాంగం నేడు తాగునీటితో పాటు సాగునీటి రాకతో ఉత్సాహంగా ఎవుసం చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పులు, ఆకలి చావులు, ఆత్మహత్యలతో తల్లడిల్లి వ్యవసాయం లాభసాటి కాదని ఇతర రంగాలకు మళ్లిన రైతాంగం ఇప్పుడు మళ్లీ వ్యవసాయం మీద దృష్టిపెట్టి నాలుగు పైసలు కండ్ల జూస్తున్నారు.

- Advertisement -

రాష్ట్ర ఏర్పాటుకు ముందే కేసీఆర్‌ సాగునీటి ప్రాధాన్యా న్ని గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పెండింగ్‌ ప్రాజెక్టుల మీద దృష్టిసారించి వాటిని పూర్తిచేసి కొత్తగా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామసాగర్‌ వంటి నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోనే ఇంజినీరింగ్‌ అద్భుతం కాళేశ్వరం ఎత్తిపోతలను కేవలం మూడున్నరేండ్లలో పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాదికి రూ.25 వేల కోట్లు బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల కోసం కేటాయించి ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగడం మూలంగా గత ఏడేండ్లలో వ్యవసాయరంగ స్వరూపమే మారిపోయింది. జనాభాలో 60 శాతం ఆధారపడి ఉన్న వ్యవసాయరంగం బలోపేతమై గ్రామీణ ప్రాంతాల ఆర్థికవ్యవస్థ పరిపుష్టి అయితే మిగతా రంగాలన్నీ వాటంతటవే పరిపుష్టి అవుతాయన్న దూరదృష్టితో కేసీఆర్‌ ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్నారు.

సాగునీరు అందించి చేతులు దులుపుకొంటే వ్యవసాయం బలోపేతం కాదని కేసీఆర్‌ భావించారు. అందుకే వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. సాగునీటిని అందిస్తూనే వానకాలం, యాసంగిలో కలిపి ఎకరానికి రూ.10 వేలు అందించే, ఏడాదికి రూ.15 వేల కోట్ల వ్యయం అయ్యే ‘రైతుబంధు’ పథకంతో పంట పెట్టుబడి అందిస్తు న్నారు. ఏడాదికి ప్రభుత్వం మీద సుమారు రూ.10 వేల కోట్ల భారం భరిస్తూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు అందిస్తున్నారు. రైతు ఏ కారణం చేత మరణించినా కుటుంబం రోడ్డు మీద పడకూడదని ప్రభుత్వమే ఏటా దాదాపు రూ.1500 కోట్లు బీమా ప్రీమియం చెల్లించి ‘రైతుబీమా’ పథకం అమలు చేస్తున్న ది. సాగునీటి సదుపాయం, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం, ప్రతి ధాన్యం గింజను కొనడం మూలంగా రైతుల్లో ఆత్మ విశ్వాసం పెరిగి వ్యవసాయం చేస్తున్నారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి వానకాలం, యాసంగి కలిపి 49.63 లక్షల ఎకరాల్లో ఉన్న వరిసాగు, 2021 నాటికి ఒక కోటీ 6 లక్షల ఎకరాలకు చేరుకున్నది. కొత్తగా సాగునీటి రాకతో రైతులు వరిసాగు వైపు ఎక్కువ మొగ్గుచూపారు. అయితే వరిసాగు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో రాబోయే ముప్పును పసిగట్టిన కేసీఆర్‌ ముందుచూపుతో వివిధ పంటల సాగు సరళి, వాతావరణ పరిస్థితులు, నేల రకాలు, మార్కెటింగ్‌ పరిస్థితులను అంచనా వేసి పంట కాలనీల ఏర్పాటు మీద అధ్యయనం చేసి చర్యలు చేపట్టారు. అంతేకాదు ప్రపంచంలో ప్రతి వస్తువు ఉత్పతి ధరను ఉత్పత్తిదారుడు నిర్ణయిస్తున్నప్పుడు, ఒక్క రైతు మాత్రమే తను పండించిన పంటకు ధర నిర్ణయించలేకపోతున్నాడని, రైతులు సంఘటింతంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని గ్రహించి ‘రైతుబంధు సమితు’లను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి 2601 రైతువేదికలను నిర్మించి ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించారు. దాంతోపాటు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలను గుర్తించి మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను రైతులు సాగు చేసేలా ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారి మార్కెట్‌ రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌’ అనే సంస్థకు అప్పగించారు. వచ్చే సీజన్‌ నుంచి దీని సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.

దేశంలో ఏటా 22 మిలియన్‌ టన్నుల వంటనూనెల డిమాండ్‌కు గాను కేవలం ఏడు మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. ఏటా రూ.70 వేల కోట్ల విలువైన పామాయిల్‌ను ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితిని గమనించి తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగును వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించాలని నిర్ణయించారు.

తెలంగాణలోని 25 జిల్లాలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలమని కేంద్ర ప్రభుత్వ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2024-25 నాటికి తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. గత ఏడేండ్లలో సీఎం కేసీఆర్‌ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా తెలంగాణ గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్టి చెందింది. ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. 2013-14లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.12 లక్షలు ఉండగా 2019- 20 నాటికి 103 శాతం వృద్ధితో రూ.2.28 లక్షలకు చేరుకున్నది. దీంతో దేశంలో తెలంగాణ 14వ స్థానం నుంచి 5 స్థానానికి చేరుకున్నది. రాష్ట్ర స్థూల ఆదాయంలో వ్యవసాయరంగం వాటా 2013-14లో 13.8 శాతం ఉండగా కరోనా క్లిష్ట పరిస్థితులను కూడా తట్టుకొని 2019-20 నాటికి 19.3 శాతానికి, 2020- 21 నాటికి 20.90 శాతానికి చేరుకోవడం గమనార్హం.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కరోనా విపత్తులో కూడా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. విత్తనం నుంచి వినిమయం వరకు రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో హఠాత్తుగా కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్ల కొనుగోళ్లను చేపట్టవద్దని నిర్ణయం తీసుకోవడం రైతాంగానికి తీవ్ర ఆం దోళన కలిగిస్తున్నది.

దశాబ్దాలుగా ఆయా రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ ద్వారా కేవలం దొడ్డు వడ్లనే సేకరిస్తూ వాటి సాగు వైపు రైతులను ఆకర్షించింది. సన్నరకాల వరిధాన్యం కన్నా దొడ్డు రకం వడ్లకు ఎక్కువ మద్దతు ధర ఇచ్చి మరీ కేంద్రం దొడ్డు రకాల సాగును ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా దొడ్డు వడ్ల సాగు వద్దన్న కేంద్రం పిడుగులాంటి వార్తను రైతాంగం జీర్ణించుకోలేకపోతున్నది. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న తెలంగాణ రైతాంగం దొడ్డు వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని కోరుతున్నది. తెలంగాణలోని అన్ని రాజకీయపార్టీలు ఈ విషయంలో రాజకీయాలు చేయడం మాని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దొడ్డు వడ్లపై కేంద్రం తన నిర్ణయం మార్చుకునేలా కృషిచేయాలి. ఈ విషయంలో కేంద్రం దొడ్డ మనసు చూపాల్సిన అవసరం ఉంది.

సందీప్‌రెడ్డి కొత్తపల్లి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana