e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home ఎడిట్‌ పేజీ తెలుగు, తమిళం బాంధవ్యం

తెలుగు, తమిళం బాంధవ్యం

తెలుగు, తమిళం బాంధవ్యం

తెలుగు మృదుమధురమైన భాష. ఎంత మృదువంటే సుమసదృశమంత కోమలం. ఎంత మధురమంటే మామిడిపండు కన్న తీపి. ‘పృథివి’ అనే సంస్కృత పదాన్ని ‘పుడమి’గా మార్చుకునేంత సుకుమారం. ‘కృష్ణయ్య’ను ‘కన్నయ్య’గా తీర్చి దిద్దుకునేంత మెత్తదనం. తెలుగు మాధుర్యాన్ని ఇంత బాగా రుచి చూపించగలవారు డాక్టర్‌ నలిమెల భాస్కర్‌ మాత్రమే. మాతృ భాషలోని మమకారాన్ని చవిచూస్తూనే, అవిశ్రాంతంగా 14 భాషలు నేర్చుకొని ఆయా భాషల అందాల గంధాలను తెలుగు వారికి అందిస్తూ రచనలు చేస్తున్నవాడు భాస్కర్‌. తెలంగాణ భాషకూ, తమిళభాషకూ సంబంధ బాంధవ్యాలను తెలియజేస్తూ నలిమెల భాస్కర్‌ ‘తెలంగాణ భాష తమిళ పదాలు’ అన్న గ్రంథాన్ని రచించాడు.

ఊరు, కాలు, అక్క, ఇల్లు-తమిళంలో ఊర్‌, కాల్‌, అక్కా, ఇల్‌. నేను, నీవు, అది అనేవి.. నాన్‌, నీ, అదు. పోవడం, చేయడం అనేవి పోవదు (పోగువుదు), శెయ్‌ వదు. తమిళంలో ‘అత్తై’ తెలుగులో ‘అత్త’ అవుతుంది. ‘నమ్మిక’ తమిళ ‘నంబిక్కై’ నుంచి వచ్చింది. అవి, ఇవి, ఏవిలు తమిళంలో అవై, ఇవై, ఎవైలు. కానీ తెలంగాణలో అవ్వి, ఇవ్వి, ఎవ్వి అనే రీతిలో కన్పిస్తాయి. ద్రవిడ భాషలైన తెలుగు, తమిళం మాటల మధ్య సాన్నిహిత్యం ఎంత అద్భుతంగా ఉందో అంతే గొప్పగా
తెలంగాణ తెలుగు-తమిళాల మధ్య కూడా ఉంది.

తెలంగాణ తెలుగులో ఇన్నూరు తమిళంలో ‘ఇరునూరు’. గడ్డపార ‘కడప్పారై’, సరికిసరి ‘సరిక్కుసరి’, చిరుతపులి ‘చిఱుతైపులి’. తొడగొట్టి సవాల్‌ చేయడం ‘తొడై తట్టుదల్‌’. పట్టగొలుసులు ‘పట్టె కొలుసు’, అపనమ్మకం ‘అవనంబిక్కై’. పులుపు ‘పుళిప్పు’, మరచెంబు ‘మరైచ్చెంబు’, మిరియాల చారు ‘మిళగు చారు’, మొదాలు మొదాలు ‘ముదల్‌ ముదల్‌’, మొదటి రకం ‘ముదల్‌ రకం’, దొర ‘దురై’, దొరసాని ‘దురైశాని’. ఈ గ్రంథాన్ని చదివితే ఇటువంటి వందల తమిళ పదాలు పరిచయమౌతాయి. తమిళం ఏ మాత్రం కఠినం కాదని, మనం నేర్చుకోవడానికి సులువైనదని గ్రహించగలుగుతాం.

‘పగవాడు’ అనే అర్థంలో తెలంగాణ ‘పగోడు’ తమిళంలో ‘పగైవన్‌’. ప్రయాణం చేయడమనే అర్థంలో తెలంగాణలో ‘పైనం కట్టుడు’ తమిళంలో ‘పయణం కట్టుదల్‌’. తమిళంలో ‘విలవిత్తల్‌’ అంటే విలవిలలాడటం- తెలంగాణలో ‘గిలగిల కొట్టుకునుడు’. కథలు చెప్పేటప్పుడు కొందరు ఊ.. కొడుతుంటారు. తెలంగాణలో ‘ఊ కొట్టుడు’ తమిళంలో ‘ఊంగొట్టుదల్‌’. తొలిచూలు, మలిచూలు తెలంగాణలో తొల్సూరు, మల్సూరు. ‘చూలు’ తమిళంలోని ‘చూళ్‌’ జన్యం. తెలుగులో ‘గది’కి సమానార్థకమైన ‘అఱ’ తెలంగాణలో ‘అర్ర’, ‘అర్ర’కు మూల రూపం తమిళంలో ‘అరై’. ‘అజ్ఞానం’ అనే సంస్కృత శబ్దానికి తెలంగాణలో ‘తెల్వని తనం’ అనే చక్కని మాట ఉంది. తమిళంలో ‘తెలియాత్తనం’ అనేది సమానార్థకం. స్వతంత్రము అనే మాట తమిళంలో ‘సుదంతిరం’ తెలంగాణ ప్రజల పలుకుబడిలో ‘ససంత్రం’ అవుతుంది. ‘కష్టం’ అనే మాట తమిళంలో ‘కట్టం’ అయిపోయింది. తెలంగాణ జానపదుల వ్యవహారంలో ఈ ‘కట్టం’ ఉంది. అయితే పదాలను భాస్కర్‌ వివరించే, విశ్లేషించే తీరు మనకు అచ్చెరువు గొలుపుతుంది. ఆనందం కలిగిస్తుంది. ఆలోచన పెంచుతుంది. చైతన్యం అందిస్తుంది. తెలంగాణ ‘దార’ తమిళ ‘దారై’లు సంస్కృత ‘ధార’ నుంచే దారవడినై అని పద విన్యాసాలు చేస్తాడు.


‘కొనెల్ల’, ‘ఎల్లకాలం’లోని ‘ఎల్ల’కూ తమిళం లోని ‘ఎల్లా’కు సంబంధం ఉందంటూ ‘చదువుల్లో సారమెల్ల చదివితి తండ్రీ’ అనే భాగవత వాక్యాన్ని ఉదహరిస్తాడు. ‘అవ్వ’కు మూలపదం తమిళలో ‘అవ్వ’. తెలంగాణలో ‘తల్లి’ అనే అర్థంలో వాడుకలో ఉంది. నన్నయ్య భారతంలో ‘అవ్వ’ అనే నుడిని ‘స్త్రీ’ అనే అర్థంలో వాడినాడని, పోతన్న భాగవతంలో అవ్వ అనే మవ్వమైన మాటను తల్లి అనే అర్థంలోనే ఆరుసార్లు వాడినాడని అంటాడు.

‘వరంగల్లు’ నిజానికి ‘ఓరుగల్లు’. ఇంకా చెప్పాలంటే ‘ఒరుకల్‌’, ‘ఒరు’ అంటే ఒకటి. ‘కల్‌’ అంటే రాయి. ఈ ‘ఒరు’ ‘కల్‌’ రెండూ తమిళ పదాలు. తెలంగాణ మీద తమిళ ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో చెప్పడానికి ఇది చాలు అంటాడు నలిమెల.

‘నీరు’ పదాన్ని, నీటి ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఈ ‘నీరు’ తమిళ ’తన్నీర్‌’గా ఉందని, తమిళ ‘తణ్ణిర్‌’ తెలంగాణ ఇంటి పేర్లలో నిలిచి ఉందని అంటాడు. తమిళ ‘తంబి’ క్రమంగా ‘తమ్మి’గా మారి ఆ తర్వాతే ‘తమ్ముడు’ అయినాడని తమిళ తంబికీ, తెలంగాణ పిలుపులోని ‘తమ్మీ’కి ఉన్న దగ్గరితనాన్ని తెలియజేస్తాడు.

తెలుగులో కాపలా, కాపలాదారుడు అనే మాటలు తెలంగాణలో ‘కావలి’ కి తమిళంతో దగ్గరి సంబంధం. అక్కడ పోలీస్‌ శాఖను ‘కావల్‌ తుటై’ అని, పోలీస్‌ స్టేషను ‘కావల్‌ నిలైయం’ అని అంటారు. ‘కావల్‌’ అంటే రక్షణ. తెలుగులో రక్షకభట నిలయం, దేశీపదమైన ‘కావల్‌’ను పోలీస్‌ విభాగానికీ, నిలయానికి ఉపయోగించడం స్వాభిమానానికి నిదర్శనమని తమిళుల మాతృ భాషాభిమానాన్ని ప్రశంసిస్తాడు భాస్కర్‌.పెండ్లిలో ఒక ఆచారమైన ‘ఎదురుకోలు’ తమిళంలో ‘ఎదిరో కోళ్లుదల్‌’. వాడు నాకు ఎదురుపడ్డడు అనే వ్యవహారంలోని ‘ఎదురుపడుడు’ తమిళంలో ‘ఎదిర పడుదల్‌’. ఇటువంటి ఉదాహరణల వల్ల మన ఆచార వ్యవహారాలూ తెలుస్తాయి.

‘శంకు’ (శంఖం) గురించి రాస్తూ ‘పెంకుల పోస్తే నీళ్లు – శంకుల పోస్తే తీర్థం’ అనే సామెతను పేర్కొంటాడు. ‘సహవాస దోషం’ అనే అర్థంలో తమిళంలో ఉన్న సమాసం ‘శేరిక్కై వాసనై’. ఎంత గొప్పగా ఉంది! చేరిక వల్ల కలిగిన వాసన. స్నేహకారణంగా ఏర్పడిన అలవాటు అని చెబుతూ, ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెతను ఉదహరిస్తాడు. ‘ఉన్నోడు’ అంటే ధనవంతుడు. ఈ ఉన్నోడుకు పూర్వ రూపం ‘ఉన్నవాడు’ తమిళంలో ‘ఉళ్లవన్‌’ అని చెబుతూ ‘ఉన్నోడు పోయి ఉన్నోనికే పెట్టె- లేనో డు పోయి ఉన్నోనికే పెట్టె’ అనే తెలంగాణ సామెతను ఉటంకిస్తాడు.

కందిపప్పును ఆదిలాబాద్‌ జిల్లాలో తొగరుపప్పు అంటారు. ఆదిలాబాద్‌ ‘తొగరు’కు తమిళ ‘తువరై’కి ఉన్న బంధాన్ని చెప్తూనే తెల్లజొన్న రొట్టె మీదికి కందిపప్పు వేసుకొని తింటే ఆ రుచే వేరు అంటూ వంటల రుచి చూపిస్తాడు.

నలిమెల ఆయా పదాలను వివరించడానికి ఇచ్చే ఉదాహరణ వాక్యాలు జనజీవనం లోనివై ఉండి, జానపదుల మీద గౌరవం ఇనుమడింపజేస్తాయి. తెలంగాణ తెలుగు పట్ల మరింత గౌర వం పెరిగేలా, తమిళం నేర్చుకోవాలనే కుతూహ లం కలిగేలా, సాటి మనిషి పట్ల సానుభూతి పెరిగేలా, కర్తవ్య నిర్వహణ పట్ల నిమగ్నతను పెంచే లా ‘తెలంగాణ భాష-తమిళ పదాలు’ గ్రంథం రచించిన నలిమెల భాస్కర్‌ అభినందనీయుడు.

  • ఎ.గజేందర్‌రెడ్డి, 98488 94086
Advertisement
తెలుగు, తమిళం బాంధవ్యం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement