e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home ఎడిట్‌ పేజీ తెలంగాణ భక్తికి కట్టిన గోపురం

తెలంగాణ భక్తికి కట్టిన గోపురం

దశాబ్దాల కల తెలంగాణ. ఎడతెగని ఉద్యమ ఫలం తెలంగాణ. అమరవీరుల ఆత్మ బలిదానాల ప్రతిఫలం తెలంగాణ. కోటి ఆశలతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ వేసిన, వేస్తున్న అడుగులు బలంగా ఉన్నాయి. వేస్తున్న పునాదులపై బలమైన భవనాలు లేస్తున్నాయి. దిగువ నుంచి ఎగువకు మళ్లే గోదావరి గళగళల్లో కేసీఆర్‌ జలస్వప్నం తొంగిచూస్తుంది. బిరబిరా పరుగెత్తే కృష్ణమ్మ తెలంగాణ మాగాణాలకు పచ్చని పట్టుచీర కట్టడంలో కేసీఆర్‌ తపన కనిపిస్తుంది.

పెద్ద దృశ్యాన్ని కలగనడానికి సాహసం ఉండాలి. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎత్తిన పిడికిలి దించకుండా సాగే పట్టుదల ఉండాలి. ప్రత్యేక తెలంగాణను స్వప్నించి, ధ్యానించి, శ్వాసించి.. ఆ కలను సాకారం చేసుకున్న తర్వాత భవిష్యత్‌ తరాల కోసం అంతకంటే పెద్ద స్వప్నాలను సాకారం చేసే పనిలో సాహసంతో ముందుకు సాగుతున్నారు కేసీఆర్‌. అలా.. సాకారమవుతున్న మరొక పెద్ద స్వప్నం.. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం. ఎంతమంది శిల్పులు ఎన్నేండ్లు శ్రమించారు? ఎంతమంది ఆగమ నిపుణులు ఎంత మేధోమథనం చేశారు? స్థపతులెవరు? రాయి ఎక్కడిది? ఎన్ని వందల కోట్లు ఖర్చయింది? ఎన్ని ప్రాకారాలు? ఎన్ని పుష్కరిణులు? ఎన్ని దీపాలు? ఎన్ని వెలుగులు? ఎన్ని కాటేజీలు? ఇలా అన్ని ప్రశ్నలకు ఇన్నేండ్లుగా సమాధానాలు వార్తలుగా వస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ అంకెలతోపాటు వివరాలు బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ రాస్తే చర్వితచర్వణమవుతుంది.

- Advertisement -

యాదగిరి ఇప్పుడొక వేదగిరి.యాదగిరి ఇప్పుడొక నూత్నగిరి.యాదగిరి చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రం.యాదగిరి తెలంగాణ భక్తికి కట్టిన గోపురం.దేవుడి కార్యానికి అందరూ పెద్దలే. కానీ యాదగిరిగుట్ట పునర్నిర్మాణంలో కేసీఆర్‌ భక్తి, తపన, పర్యవేక్షణ, సలహాలు, సూచనలను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. సనాతన ఆగమశాస్త్ర విషయాలను పాటించడానికి శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి సలహాలను తీసుకున్నారు. ఇంజినీరింగ్‌ విషయాలు మొదలు విద్యుత్‌ బల్బులు, గుడి గంటలు ఎలా ఉండాలో స్వయంగా పర్యవేక్షించారు. నాలుగ్గోడలు, గోపురమే ఆలయమైతే ఊళ్లో తాపీ మేస్త్రీ కూడా గుడి కట్టేయగలడు. వాస్తు, శిల్ప, ఆగమ శాస్ర్తాల సమ్మేళనం గుడి నిర్మాణం. మొక్కుబడిగా గుడి కట్టడం కాదిది. మొక్కుకు ప్రతిఫలంగా తయారవుతున్న గుడి ఇది. కొన్ని తరాలు నిలిచి వెలగాల్సిన నారసింహ తత్త్వం ఇది. చరిత్రలో నిలిచిపోయే ఆలయ నిర్మాణం ఇది.

భక్తి కొందరికి ప్రదర్శన. కొందరికి రాజకీయం. కొందరికి అవసరం. కొందరికి భయం. కొందరికి మొక్కుబడి తంతు. కేసీఆర్‌ భక్తి సహజం. ఎవరేమనుకున్నా హిందూ ఆచారాలను నమ్మి మనసా వాచా కర్మణా పాటించే ముఖ్యమంత్రి. ఆధునిక కాలంలో ఇలా యాగాలు చేయగలరా? అని లోకం ఆశ్చర్యపోయేలా ఆయన యాగాలు చేశారు. రాష్ట్రంగా తెలంగాణ సుభిక్షంగా ఉండటానికి అవసరమైన క్రతువులు ఆయన మనసులో మెదులుతూనే ఉంటాయి. ఒక్కో ప్రాంతం ఉనికికి కొన్ని కొండ గుర్తులుంటాయి. తనవైన కొన్ని ఆచారాలు, వేషం, భాష, యాసలుంటాయి. కొన్ని నదులు, పుణ్యక్షేత్రాలు ఉంటాయి. తరాలు మారినా మారకుండా వెలిగేవి, వెలుగుతూ ఉండిపోయేవి కొన్నే ఉంటాయి. అలా ఉండిపోయేది పునర్నిర్మాణమైన యాదగిరిగుట్ట ఆలయం.

శాస్త్రీయంగా ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం నిర్ణయమైంది. హిరణ్యకశిపుడిని సంహరించడానికి విష్ణువు నరసింహంగా అవతరించాల్సి వచ్చింది. చెడు మీద మంచి గెలువడానికి, మంచిపనులు చేయడానికి నారసింహ బలమే మనకు కావాలి కాబట్టి.. రాజకీయాలను పక్కనపెట్టి.. ఈ పుణ్యకార్యంలో అందరూ పాల్గొనాలి. ఒక సోమనాథ్‌, ఒక బద్రీనాథ్‌, ఒక కేదార్‌నాథ్‌, ఒక తిరుమల ఎలాగో.. ఒక యాదాద్రి కూడా అలాగే విశ్వ ఆధ్యాత్మిక చిత్రపటం మీద నిలిచిపోవాలి.భక్తికి భావన ఆలంబన. ఆ భావనకు నూత్న యాదగిరిగుట్ట అమితాలంబన కాబోతున్నది. రండి.. మనమూ పాల్గొని పునీతులమవుదాం.

  • కాశ్యప్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement