e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home ఎడిట్‌ పేజీ తథాస్థు.. వృక్షాభివృద్ధిరస్థూ..

తథాస్థు.. వృక్షాభివృద్ధిరస్థూ..

పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. అడవులు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమే. కాబట్టి ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచాలి. పర్యావరణ పరిరక్షణకు, అడవుల సంరక్షణకూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చేయూతనందించడం మనందరి కర్తవ్యం.

అంతర్జాతీయ లెక్కల ప్రకారం అత్యధిక తలసరి మొక్కలు కెనడాలో 10,163 ఉండగా, ద్వితీయ స్థానం లో గ్రీన్‌ల్యాండ్‌ 4,964, మూడో స్థానంలో ఆస్ట్రేలియాలో 3,266, నాల్గవ స్థానంలో అమెరికా 699 మొక్కలున్నాయి. చివరలో ఉన్న మన భారత్‌లో 25 మొక్కలే ఉండటం ఆందోళనకరం. దేశంలో జనాభా విస్ఫోటనం వల్ల వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ, భారీ ప్రాజెక్టులు, రహదారులు.. మొదలైన కార్యకలాపాల వల్ల అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది.

- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంలో అడవుల సంరక్షణకు కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి సఫలం కాలేదు. దీంతో పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెంపు లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015 జూలై 3న హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికోసం అన్ని శాఖలు కలిపి రూ.6,555 కోట్లు ఖర్చుచేశారు. హరితహారం ఫలితంగా 3.67 శాతం పచ్చదనం పెరిగిందని ‘ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా-2019’ నివేదిక వెల్లడించటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏడు విడతల్లో హరితహారం అమలైంది. మొత్తం 230 కోట్ల లక్ష్యానికి గాను 239.87 కోట్ల మొక్కలు లక్ష్యాన్ని మించి నాటారు. ఈ నేపథ్యంలోనే.. ‘హరితహారం’ కార్యక్రమాన్ని నిరంతరం, నిరాఘాటంగాను కొనసాగించడానికి నిధుల కొరత లేకుండా, రాకుండా చూడటం కోసం ‘హరిత నిధి’ (గ్రీన్‌ఫండ్‌)కు రూపకల్పన చేశారు. ‘హరితనిధి’కి సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు రూ.500 చొప్పున, ఐఏఎస్‌లు రూ.100, ఉద్యోగ, ఉపాధ్యాయులు రూ.25 చొప్పున, అన్నిరకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతీ లావాదేవీకి రూ.50 చొప్పున హరితనిధికి జమచేయాలి. వ్యాపారసంస్థల లైసెన్సు రెన్యువల్‌ సందర్భంగా రూ.1,000 జమచేయాలి. అడ్మిషన్ల సమయంలో పాఠశాల విద్యార్థులు రూ.10, ఇంటర్‌ విద్యార్థులు రూ.15, డిగ్రీ విద్యార్థులు రూ. 25 జమచేయాలి. వృత్తివిద్య అడ్మిషన్ల సమయంలో రూ.100 చొప్పున హరితనిధికి జమచేయాలి. ఈ ‘హరితనిధి’కి అన్నివర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడం విశేషం.

హరితహారాన్ని మరింతగా విస్తరణ చేసేవిధంగా గ్రామాల్లో, పట్టణాలో బృహత్‌ ప్రకృతి వనాల ఏర్పాటును ప్రభుత్వం వేగవంతం చేసింది. అటవీభూముల గుర్తింపు, వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. బ్లాకుల వారీగా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అడవుల పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణ ప్రాంతాల్లోని ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి, వాటిని పెంచే బాధ్యత ఆయా కుటుంబాలకు అప్పజెప్పుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,740 ఎకరాల్లో 109 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధిని ప్రభుత్వం చేపట్టింది. మొక్కల సంరక్షణ కోసం ప్రతి గ్రామానికి ఇద్దరేసి చొప్పున హరిత సైనికులను ఏర్పాటుచేసింది. 400 మొక్కలకు ఒక్క వాచ్‌గార్డును ఏర్పాటుచేయటం హర్షణీయం.

మొక్కల పెంపకంలో మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో సంరక్షణ శాతం అత్యధికంగా ఉన్నది. నాటిన మొక్కల్లో 85 శాతానికి పైగా సంరక్షించబడుతున్నాయి. మొక్కల పెంపకం, హరితహారం అమల్లో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది. సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి అడవుల విస్తరణకు దోహదపడాలి.

(వ్యాసకర్త: జి.లక్ష్మణ్‌కుమార్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సమాచార పౌరసంబంధాల శాఖ)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement