e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home ఎడిట్‌ పేజీ జాతీయత తిన్నెలపై వేల్పుల వన్నెలు

జాతీయత తిన్నెలపై వేల్పుల వన్నెలు


(1993 మే 7వ తేదీన న్యూ ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో రాజా రవివర్మ చిత్రాల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని పీవీ ప్రసంగం)

భారత చిత్రకళా ప్రపంచంలో గణనీయుడైన రాజా రవి వర్మ చిత్రాల ప్రదర్శనను ప్రారంభించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఆయన ట్రావంకోర్‌ రాజ కుటుంబంలో 1848లో జన్మించారు. భారతీయ చిత్రకళపై గాఢమైన ముద్రవేశారు. తాను బతికున్నప్పుడే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. శకుంతల, దమయంతి వంటి చిత్రాలు ఏవైనా కావచ్చు, ఆయన పెయింటింగ్‌ లేని ఇల్లు మన దేశంలో ఉండదు. నా చిన్నతనంలో నేను చూసిన మొదటి పెయింటింగ్స్‌ రవివర్మవే. సూర్‌దాస్‌ రాసిన బాలకృష్ణుడి చిత్రం చూశాను. ఆయన సూర్‌దాస్‌ రచనలు చదివి ఈ బొమ్మ వేశాడో లేదో నాకు తెలువదు. ఏక్‌ జీతీ జగ్‌తి తస్వీర్‌ ఆప్కే సామ్నే ఖడీ హోగయీ. వ్యక్తి మనముందు నిలబడినట్టే, కూర్చున్నట్టే, పడుకున్నట్టే- ఇక చూసేవారి ఊహకు మిగిలిందేమీ లేదన్నట్టుగా- ఉన్నదున్నట్టుగా చిత్రం వేయడం అరుదైన లక్షణం. ఈ విధంగా మేం మొదట్లో చిత్రకళ వైపు ఆకర్షితులమయ్యాం. మొదట్లో పిల్లలం చెత్త బొమ్మలు గీసేవారం. ఆ తర్వాత ఎంత వాస్తవికంగా బొమ్మలు వేయవచ్చో తెలిసింది.

రవివర్మ చిత్రం ఫొటో తీసినట్టుగా ఉంటుంది. ఆయన పెయింటింగ్‌కు, ఫొటోకు ఏమీ తేడా ఉండదు. ఇటువంటివి చూసే మేం చిత్రకళలోకి ప్రవేశించాం. ఆ తర్వాత ఇతర రూపాల్లోకి వెళ్లాం. మరింత క్లిష్టమైన, అల్ప మానవులకు అర్థం కాని సంక్లిష్టమైన చిత్రాలు మొదలయ్యాయి. ఎన్ని వచ్చినా రవి వర్మ మొత్తం తరంపై వేసిన ప్రభావం మరిచిపోలేనిది. ఆయన ఒక తరంపై కాదు, నాటి తరాలపైన ప్రభావం చూపారు.

ఒక శతాబ్దం పాటు భారతీయుల మస్తిష్కంపై రవివర్మ చిత్రాల ప్రభావం ఉన్నది. వారికి దేవుళ్లంటే రవివర్మ వేసిన చిత్రాల మాదిరిగానే కనిపించేవారు. రాముడు, కృష్ణుడు లేదా దమయంతి ఎలా ఉంటారో తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటే వారు రవివర్మ చిత్రాలను చూడవచ్చు. ఆయా దేవుళ్ల గురించిన సాహిత్యం ఇప్పటికే చదివి ఉన్నందున, ఈ చిత్రాలు చూడగానే ఇలా ఉంటారు, ఇలానే ఉండాలనిపిస్తుంది. దమయంతి ఇలాగే ఉండేదనుకుం టాం. మహిళల చిత్రాలన్నీ అందంగానే ఉన్నాయి. సౌందర్యమనే ఆలోచన, సౌందర్యం అంటే ఏమిటనే భావనను మనకు మొదటిసారి చూపించారు. శతాబ్దం పాటు భారతీయులు భారతీయ దేవుళ్లను, దేవతలను రవివర్మ చిత్రించినట్టుగానే చూశారు. ప్రజలకు దేవుళ్లతో అటువంటి అనుబంధాన్ని కలిగించారు. ఇప్పటికీ అవే ఉత్తమ చిత్రాలు. మిగతావారు అతడినుంచి స్ఫూర్తిని పొందారు. రవివర్మ చిత్రాలను మారు మూల గ్రామంలోని చిన్న గుడిసెలో కూడా చూడవచ్చు. రవివర్మ చిత్రం ఒకటో రెండో లేని గుడిసె ఉండదు. ఎవరైనా ఒక పెయింటింగ్‌ కావాలనుకుంటే, మొదట రవివర్మ చిత్రం గురించే ఆలోచిస్తారు. గుడిసెలలో రాజ భవనాల చిత్రాలు, రాజ భవనాలలో గుడిసెల చిత్రాలు కనిపించడం విచిత్రం.

మన దేశంలో ఆ కాలంలో సాగుతున్న సాంస్కృతిక పునరుజ్జీవన స్ఫూర్తిని రవి వర్మ తన చిత్రాలలో రంగరించారు. సంప్రదాయ కళల విలువలను ఉద్దేశపూర్వకంగా మార్చి భారతీయ సంప్రదాయంలో పాశ్చాత్య చిత్రకళాశైలిని మిళితం చేశారు. పాశ్చాత్య మెలకువలను భారతీయ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించారు. ఆయిల్‌ పెయింటింగ్‌ భారతీయులకు పరిచయం లేని సమయంలో ఆయన ఉపయోగించారు. నాడు మనకు మంచి పెయింటింగ్‌ మెటీరియల్‌ ఉండేది. కాలానికి తట్టుకొని నిలిచేవి ఉండేవి. అజంతా చిత్రాలు చూడండి, వేల ఏండ్లుగా ఉన్నాయి. కానీ ఆయిల్‌ పెయింటింగ్‌ను మాత్రం రవి వర్మ ప్రారంభించాడని అంటారు. ఇప్పుడు ఆయిల్‌ పెయింటింగ్‌ వేయడం సాధారణం. కానీ ఆనాడు ఆయిల్‌ పెయింటింగ్‌ను రవివర్మ ఉపయోగించారు. అది భారతీయ కళాకారులకు, కళాప్రియులకు ఎంతో ఉపయోగపడింది.

ఆనాడు భారతదేశంలో పెల్లుబుకిన జాతీయవాదంలో ఆనాటి గొప్పవారంతా జాతీయవాదులైన సందర్భంలో ఆయన జన్మించారు. వివిధరంగాలలో కృషిచేసిన గొప్ప దేశభక్తులు ఆనాటి భారతమాత ముద్దుబిడ్డలు. 1857 నుంచి శతాబ్దాంతం వరకు గొప్ప గొప్ప దేశభక్తులు జన్మించారు. అందుకే గత మూడేండ్లుగా శతజయంత్యుత్సవాలను వరుసగా జరుపుకొంటున్నాం. రవివర్మ చిత్రాలకు ప్రశంసలు లభించాయి. నాటి గొప్ప వ్యక్తులతో ఆయన అనుబంధం జాతీయవాదానికి కొత్త రంగులద్దింది. ఒక్కచోటు నుంచి మరో చోటుకు ప్రయాణించడం కష్టమైన ఆ కాలంలో ఆయన దేశంలోని వివిధ ప్రాంతాలు తిరిగి అక్కడి స్థానిక, సాంస్కృతిక, సంప్రదాయాలను జీర్ణించుకొని తన చిత్రకళలు మిళితం చేశారు. 1893లో రవివర్మ చిత్రాలు పదింటిని షికాగోలో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనలు భారతదేశం తరఫున పంపించారు. స్వామి వివేకానంద షికాగోలో సర్వమత సభలో ప్రసంగించిన సందర్భం అది. ఆ చిత్రాలు ఒక్క కళాకారుడి వ్యక్తిగత దృక్కోణం కాదు, భారతీయ జీవన జాతీయ అస్తిత్వానికి ప్రతీకలు. ఆనాటి దృశ్యకళల ప్రగతికి నిదర్శనాలు. 19వ శతాబ్దం చివరలో భారత చిత్రకళా ప్రపంచంలో చోటుచేసుకున్న ఆధునికతను, జాతీయవాదాన్ని రవివర్మ చిత్రాలు ప్రతిబింబిస్తాయి. యాత్రికులు, సాధువులు, భావజాలాల మాదిరిగా భారతీయ కళ కూడా సుదూర ప్రాంతాలకు ప్రయాణించింది. కళను మ్యూజియంకు, ఆర్ట్‌ గ్యాలరీలకు మాత్రమే పరిమితం చేయకూడదు.

రవివర్మ దించిన శివాజీ చిత్రమే చూడండి. అందులో అతడి శౌర్యముంటుంది. ఆత్మగౌరవం ఉంటుంది. శివాజీకి చెందిన అనేక లక్షణాలు అందులో ద్యోతకమవుతాయి. ఇటువంటి చిత్రాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదు. ఒక వ్యక్తి గురించి సంపూర్ణ అవగాహన ఉంటే తప్ప చిత్రించలేరు. దమయంతి, విష్ణు, లక్ష్మీ వంటి చిత్రాలు వేయడం వేరు. శివాజీ వంటి చిత్రాలు వేయడానికి మరింత పరిశీలన, ఏకాగ్రత అవసరం. రవివర్మతో మరొకర్ని పోల్చడం అంత సులభం కాదు. మనకు ప్రాచీన, మధ్యయుగ కళాసాహిత్యాల సుసంపన్న సంప్రదాయం ఉన్నది. సుసంపన్నమైన సంప్రదాయ, ఆధునిక కళాసాహిత్యాలు కూడా ఉన్నాయి. రవివర్మ చిత్రాలను దర్శించడం ద్వారా భారతీయ ఆధునిక కళ మూలాలను గుర్తించడం సాధ్యమవుతుంది.

మన దేశంలో ఆ కాలంలో సాగుతున్న సాంస్కృతిక పునరుజ్జీవన స్ఫూర్తిని రవివర్మ తన చిత్రాలలో రంగరించారు. సంప్రదాయ కళల విలువలను ఉద్దేశపూర్వకంగా మార్చి భారతీయ సంప్రదాయంలో పాశ్చాత్య చిత్ర కళాశైలిని మిళితం చేశారు. పాశ్చాత్య మెళకువలను భారతీయ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించారు.

Advertisement
జాతీయత తిన్నెలపై వేల్పుల వన్నెలు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement