e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home ఎడిట్‌ పేజీ కేంద్రమా! ఏమిటీ వివక్ష?

కేంద్రమా! ఏమిటీ వివక్ష?

తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమైన వాటి విషయంలో మాత్రం కేంద్రం అత్యుత్సాహం చూపుతున్నది. అందులో భాగంగానే తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకొ ని, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచటానికి మాత్రం ససేమిరా అంటున్నది. మరో ఐదేండ్లు ఆగాల్సిందేనని చెప్పటం వివక్షాపూరితమే!

రాష్ర్టాల సమాఖ్యనే భారతదేశం. రాజ్యాంగం ప్రకారం రాష్ర్టాల ఏర్పాటు జరిగింది. రాష్ర్టాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే. యాభై ఏండ్లకుపైగా వలస పాలనలో నలిగిపోయిన తెలంగాణ ప్రజలు సుదీర్ఘపోరాటాల ద్వారా ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నారు. స్వయంపాలనలో ప్రజల అవసరాలకు అనుగుణంగా బృహత్తర పథకాలకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తూ అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నది. అయితే, రాష్ట్ర ఆవిర్భావం నుంచే కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను పోలవరం పేరుతో ఏపీకి అప్పనంగా కట్టబెట్టింది. ఇప్పటికీ అదే విధానాలను కొనసాగిస్తున్నది. సమ యం దొరికినప్పుడల్లా తెలంగాణపై వివక్ష చూపుతున్నది. రాష్ట్రం ఆవిర్భవించి ఏడేండ్లయినా తెలంగాణకు దక్కాల్సిన హక్కులేవీ అమలుకు నోచుకోవటం లేదు.

- Advertisement -

సాధారణంగా కొత్త రాష్ర్టాల ఏర్పాటు జరిగినప్పుడు అక్కడి ప్రజల అవసరాలు, వారి ఆకాంక్షలకు అనుగుణం గా కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక హామీలు ఇవ్వడం జరుగుతున్నది. తెలంగాణ కన్నా ముందు ఆవిర్భవించిన రాష్ర్టాలకు అనేక హామీలు అమలు చేశాయి. ఇదేవిధంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణకు పునర్వ్యవస్థీకరణ చట్టంలో నాటి యూపీఏ ప్రభుత్వం పలు హామీలిచ్చింది. కానీ, 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నది.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు సంబంధించి అనేక అంశాలను పొందుపరిచారు. వాటి అమలు కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేయాల్సి వస్తున్నది. ప్రధానంగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ, ఐఐఎం, ఐఐటీలు ఏర్పాటుచేయాలని ఉన్నది. రైల్వేలో కొత్త జోన్‌ ఏర్పాటుచేస్తే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ డివిజన్లుంటాయి. కాబట్టి, కాజీపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటుచేయాలనే డిమాండ్‌ ఉన్న ది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుంది. గిరిజనుల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీపై కూడా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. గిరిజన వర్సిటీ ఏర్పాటుపైనా నిర్లక్ష్యధోరణి అవలంబిస్తున్నది.

రాష్ట్రంలో ప్రజలకు మంచినీటికి గోస ఉం డొద్దని సీఎం కేసీఆర్‌ ఇంటింటికీ తాగునీటినీ అందించే ‘మిషన్‌ భగీరథ’ పథకాన్ని తీసుకొచ్చారు. దీన్ని స్వయంగా ప్రధాని మోదీనే ప్రారంభించారు. ఈ పథకానికి రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ, ఇప్పటికీ కేంద్రం ఒక్క రూపాయీ ఇవ్వలేదు. చెరువులను పునరుజ్జీవింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మిష న్‌కాకతీయ’ పథకానికి రూపకల్పన చేసింది. దీనికోసం కేంద్రం రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. కానీ కేంద్రం పట్టించుకోలేదు. బృహత్తర ‘కాళేశ్వరం’కు జాతీయ హోదా కల్పించాలని కోరుతున్నా పెడచెవిన పెడుతున్నది. రాష్ట్రం పట్ల కేంద్రం ఇంతటి వివక్ష చూపడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.

పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటు చేయాలి. అలాంటి హామీలపై కేంద్రం ఇప్పటివరకు ఒక్క ప్రకటన చేయలేదు. ప్రతి జిల్లాకేంద్రంలో కేంద్రీయ విద్యాలయాన్ని, నవోదయ పాఠశాలలను ఏర్పాటుచేయాలని రాష్ట్రం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. వాటి పై కూడా సానుకూలంగా స్పందించలేదు. ఇవేగాక జీఎస్టీ, గ్రామ పంచాయతీ నిధుల విడుదల విషయంలో కూడా కేంద్రం వివక్ష చూపుతుంది. జాతీయ రహదారుల నిర్మాణం విషయంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 12 జాతీయ రహదారులను ఇప్పటివరకు మంజూరు చేయలేదు. 13 రహదారులు మంజూరైనా మూడేండ్లుగా పనులు చేపట్టలేదు. జహీరాబాద్‌- దెగ్లూరు, మిర్యాలగూడ- నర్సారావుపేట, భద్రాచలం- దేవన్‌పల్లి, కరీంనగర్‌- పిట్లం, తాండూరు- మహబూబ్‌నగర్‌, చౌటుప్పల్‌- కంది, మెదక్‌- ఎల్కతుర్తి, హైదరాబాద్‌- కొత్తగూడెం, కొత్తకోట- మంత్రాలయం, రంగశాయిపేట- చింతనెక్కొండ- కేసముద్రం- మహబూబాబాద్‌, భూపాలపల్లి- కరీంనగర్‌, సారపాక- ఏటూరునాగారం- కాళేశ్వరం- చెన్నూరు- కౌటాల-సిర్పూర్‌ రహదారులు ఇప్పటివరకూ మంజూరుకు నోచుకోలేదు. హైదరాబాద్‌- భైంసా, నిజాంపేట- బీదర్‌, మద్నూర్‌- బోధన్‌, హైదరాబాద్‌- యాద్గిర్‌, కోదాడ- జడ్చర్ల, సిరిసిల్ల- సూర్యాపేట, మంచిర్యాల- రెబ్బెన, నిర్మల్‌- రాయికల్‌, వరంగల్‌- ఖమ్మం, సూర్యాపేట-రాజమహేంద్రవరం, సగ్రోలి- నిజామాబాద్‌, ఆదిలాబాద్‌- కొర్పాన, సంగారెడ్డి- చౌటుప్పల్‌ మార్గాల్లో పనులు జరగడం లేదు.

పార్లమెంటు వర్షకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను అమలుచేయాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. సవరణలతో అసెంబ్లీ స్థానాలను పెంచే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అంశాలను వెంటనే పరిగణనలోకి తీసుకోవాలి. వీటితోపాటు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
(వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్టు)

  • బండారి జితేందర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana