e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home Top Slides Telangana History | కృష్ణానది గట్టునున్న ఏలేశ్వరంలో వికసించిన రసవిద్య

Telangana History | కృష్ణానది గట్టునున్న ఏలేశ్వరంలో వికసించిన రసవిద్య

గోదావరీ కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని విస్తరించిన శాతవాహన సామ్రాజ్యంలోని చాలా నగరాలు, పట్టణాలు భూగర్భంలో ఇప్పటికీ దాగి ఉంటే, కొన్ని జల సమాధి అయిపోయినయి.

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో కృష్ణానది గట్టునున్న ఏలేశ్వరం ఇప్పుడు నాగార్జున సాగరంలో మునిగి పోయింది. రాతియుగపు ఆనవాళ్ళు మొదలుకొని, తొలి చారిత్రక యుగానికి చెందిన శాతవాహన కాలపు ఆధారాలతోపాటు, అసఫ్‌జాహీ (నిజాం) కాలాల గుండా 1960 దశకం వరకు వేల ఏండ్లు కృష్ణాలోయ నాగరికతకు సాక్షిగా నిలిచింది ఏలేశ్వరం. దాదాపు రెండు వేల ఏండ్లకిందటి నుంచి కృష్ణానది ప్రవహిస్తున్న నల్లమల అటవీ ప్రాంతంలోని ఒక పెద్ద భూభాగాన్ని సిరి పర్వత ప్రాంతం (సంస్కృత రూపం శ్రీ పర్వతం) అని పిలుచుకున్నట్టుగా పురాతత్వ, లిఖిత ఆధారాలున్నాయి. మలి శాతవాహనుల కాలంలో ప్రాముఖ్యంలోకి వచ్చి,శాతవాహనుల తర్వాత రాజ్యమేలిన ఇక్ష్వాకుల పాలనకు ఇదే కేంద్ర ప్రాంతం.

- Advertisement -

ఇప్పుడు నాగార్జున కొం డగా వ్యవహరిస్తున్న కొండ మాత్రమే సిరి పర్వత ప్రాంతం కాదు. కృష్ణానది ఎడమగట్టున తెలంగాణ, కుడి గట్టున ఆంధ్రప్రదేశ్‌ ఉంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేసేముందు ప్రాచీన చారిత్రక ప్రాంతాలు, ఆధారాలు జలాశయంలో మునిగిపోక ముందే తవ్వకాలు జరిపి జలాశయం బయటకు తరలించి, సంరక్షించాలి. కానీ ఈ తవ్వకాలు నదికి కుడివైపు ఏపీలోని ఏడు గ్రామాల్లో మాత్రమే జరిగాయి. తెలంగాణ వైపు ముంపునకు గురైన 48 గ్రామాల్లో తవ్వకాలు కాదు కదా, సర్వే కూడా సరిగా జరగలేదు. దీంతో తెలంగాణ వైపున్న చరిత్ర ఆధారాలు, సంపద అంతా జలసమాధి అయిపోయింది. ఒక్క ఏలేశ్వరంలో మాత్రం రాష్ట్ర పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టింది. అందుకే ఇప్పుడు మనం చూస్తున్న సిరిపర్వత ప్రాంత వైభవమంతా పాక్షికమే.

ఇంకో ముఖ్యమైన విషయం- సిరి పర్వత ప్రాంత ప్రాచీన చరిత్రను తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి వారసత్వ సంపదగా గుర్తించడం. ఎందుకంటే నాగరికత, సంస్కృతి నదికి రెండువైపులా విలసిల్లుతాయి. అందుకే సిరి పర్వత ప్రాంతంలో విలసిల్లిన నాగరికత తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి వారసత్వ సంపదే అవుతుంది.

ఏలేశ్వరం
ఇప్పుడు కూడా గూగుల్‌ మ్యాప్స్‌లో చూస్తే నది మధ్య నాగార్జున కొండకు ఎడమవైపున ఏలేశ్వరం గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్ట సానువుల్లో ఉండిన పట్టణమే ఏలేశ్వరం. కృష్ణా నల్గొండ జిల్లాలో ఇక్కడే కృష్ణానది ప్రవేశిస్తుంది. 1939-40లోనే గులాం యజ్దాని నేతృత్వంలో ఏలేశ్వరంలో క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం శాసనాలను గుర్తించారు. బ్రాహ్మీ లిపిలో ఉన్న రెండు శాసనాలు శాతవాహన కాలానివి. దీంతో ఏలేశ్వరంలో 1955-56లో డాక్టర్‌ పి. శ్రీనివాసాచార్‌ నేతృత్వంలో తవ్వకాలు మొదలై 1958 వరకు కొనసాగి తిరిగి అబ్దుల్‌ వహీద్‌ఖాన్‌ సారథ్యంలో 1960-62 మధ్య జరిగినయి.

ఏలేశ్వరం నేల వేర్వేరు కాలాల చరిత్రను పొరలుపొరలుగా దాచుకొని తవ్వకాల్లో స్పష్టంగా తిరిగి మనకు అందించింది. 13 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఏలేశ్వరంలో మొత్తం 6 దశలకు సంబంధించిన సాంస్కృతిక క్రమం (కల్చరల్‌ సీక్వెన్స్‌) దొరికింది. మొదటి దశ చరిత్ర పూర్వయుగం ఉంటే పాత రాతి నుంచి కొత్త రాతియుగంలోని బృహత్‌ శిలాయుగం వరకు, రెండు మూడు దశల్లో శాతవాహన, ఇక్ష్వాకుల కాలం, ఆ తర్వాత విష్ణుకుండి, పల్లవ, బాదామి, వేంగీ చాళుక్య, కాకతీయ, బహమనీ, విజయనగర, కుతుబ్‌ షాహీ, అసఫ్‌జాహీ ఆధారాలు నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే ఏలేశ్వరం కృష్ణాతీరంలో ఉన్న ఒక చారిత్రక మ్యూజియం లాంటిది. శాతవాహన కాలం నాటి చరిత్ర క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తుశకం ఒకటి-రెండు శతాబ్దాల వరకు ఇక్కడ దొరికింది.

ఇక్కడ పట్టణం ఎత్తయిన ప్రదేశం మీద దీర్ఘ
చతురస్రాకార పద్ధతిలో, చుట్టూ మట్టి కోట వంటి నిర్మాణాలతో కట్టినట్టు ఆధారాలున్నాయి. అశోకుడి లేదా ఖారవేలుడి పట్టణమైన ఒడిశాలోని శిశుపాల్‌ గఢ్‌ లో(క్రీస్తు పూర్వం 4 లేదా 3 శతాబ్దాల నాటిది) కూడా సరిగ్గా ఇలాంటి పట్టణ నిర్మాణమే కనిపించింది. సింధు లోయ పట్టణాల్లో ఉన్నట్లు ఒక ఇంకుడు గుంతలతో కూడిన డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ ఉంది.

ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి రెండు కట్టడాలు-మొదటిది స్నానఘట్టం, రెండోది మండపం. నది ఒడ్డున కడప స్లాబ్‌తో వరుసగా మెట్లతో ఒక పెద్ద స్నానఘట్టం వంటి నిర్మాణం దొరికింది. ప్రస్తుతం మనం పుష్కర ఘాట్ల దగ్గర కడుతున్న మెట్లకు ఏమీ తీసిపోనిది ఈ నిర్మాణం. ఈ మెట్లన్నిటినీ ఇప్పుడు మళ్ళీ నాగార్జునకొండ మీద పునర్నిర్మించి కాపాడారు. ఇంకో ప్రముఖ నిర్మాణం మండపం. దాదాపు 150 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పుతో, స్తంభాలతో నది ఒడ్డున కట్టిన ఈ మండపం నాటి సమావేశ మందిరం లేదా మతపరమైన నిర్మాణం కావచ్చు. స్తంభాలపై శంఖలిపిలో ఉన్న అక్షరాలు అరిగిపోయి ఉండటంతో చదవలేకపోయారు.

ఇంకా మధ్య, పశ్చిమ భారతంలో దొరికే ఎరుపు పాత్ర లు, బర్మాలోని రంగమహల్‌, కేక్తమొమ్యో వంటి ప్రాంతాల్లో తవ్వకాల్లో దొరికిన స్ప్రింక్లర్ల వంటి మట్టి కూజాలు, రోమన్‌ తరహా మట్టి పాత్రలు ఏలేశ్వరానికి బయటి ప్రపంచానికి ఉన్న సాంస్కృతిక బంధాన్ని తెలుపుతాయి. టెర్రకోటతో చేసిన మానవాకృతుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, దీపపు సెమ్మెలు, పూసలు, కొండాపూర్‌, మహారాష్ట్రలోని తేర్‌లను పోలి ఉన్నాయి. దాదాపు 400 టెర్రకోట వస్తువులు దొరికిన ఏలేశ్వరం విభిన్న ప్రాంతాల లక్షణాలకు సంగమంగా కనిపిస్తుంది.

ఇక్కడ శాతవాహన రాజైన పులుమావికి చెందిన రెండు నాణేలు ‘సిరి పులుమావిస’ అని రాసి ఉన్నవి దొరికినాయి. క్రీస్తు శకం రెండో శతాబ్ది నాటి రోము చక్రవర్తి సెప్టిమస్‌ సెర్విరాస్‌ బంగారు నాణెం కూడా దొరికింది.

బౌద్ధం, వైదికం
తవ్వకాల్లో దొరికే భౌతిక ఆధారాలు మనకు ఆ నాటి మతం గురించి కూడా చెపుతాయి. ఒక వైపు బౌద్ధం మరోవైపు అప్పుడే విస్తరిస్తున్న వైదిక మతం- ఇదీ ఏలేశ్వరం ముఖచిత్రం. మలి శాతవాహన కాలం నుంచే వైదిక నిర్మాణాలు మొదలైనాయని అదీ కృష్ణా లోయలోని ఏలేశ్వరం, నాగార్జున కొండ చుట్టూ పక్కల పెద్ద ఎత్తున మొదలైనాయని చెప్పడానికి స్పష్టమైన ఆధారం మందిరం లాంటి కట్టడమే. ఇక్కడ బౌద్ధ స్థూపాల వంటి ఆనవాళ్లు కూడా దొరికినాయి. అయితే తక్కువ సమయంలో, దొరికిన అవశేషాలను బయటకు తీసి పరిరక్షించడమే ప్రధాన కర్తవ్యం కాబట్టి ఏలేశ్వరం ఇంకెన్ని రహస్యాలను దాచుకుందో మనకు తెలువకుండా పోయింది. నాటి పునరుత్పత్తికి సంబంధించిన మత విశ్వాసానికి (ఫెర్టిలిటీ కల్ట్‌) ఆనవాలుగా ఇక్కడ లజ్జా గౌరీ శిల్పం, తల్లీ-పిల్ల టెర్రకోట బొమ్మ దొరికాయి.

ఈ నల్లని కృష్ణా గర్భం దాచిన నాగరికతలెన్నో!
కృష్ణా పరీవాహక ప్రాంతంలోని తెలంగాణ గ్రామాలు ఇప్పటికీ శాతవాహన చరిత్రను కాపాడుకుంటూనే ఉన్నాయి. నాగార్జున సాగరంలో మునిగిన 48 గ్రామాల్లో ఎంత మేరకు శాతవాహన, ఇక్ష్వాకు, బౌద్ధ, తొలి వైదిక చరిత్ర జల స్థాపితం అయిందో ఊహించలేం. ఇప్పటికైనా కృష్ణా తీరంలోని గ్రామాల్లో పురాతత్వ సర్వే, తవ్వకాలు జరిగితే కృష్ణా లోయలో, సిరి పర్వత ప్రాంతంలో వికసించిన మన చారిత్రక వారసత్వాన్ని చూపగలుగుతాం.

ఏలేశ్వరం తవ్వకాల్లో దొరికిన అవశేషాలు, వస్తువులు ఒకే దగ్గర ప్రదర్శనకు లేకుండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మ్యూజియంలలో పంచారు. ఏలేశ్వరం నీట మునిగితే, ఏలేశ్వరం కథను చెప్పే అవశేషాలు చెల్లాచెదురుగా, ప్రాముఖ్యం లేకుండా ఉండిపోయా యి. మన రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగ ర్‌లో నిర్మించిన అద్భుత నిర్మాణం బుద్ధవనంలో ఏలేశ్వరం నమూనాను నిర్మించాలి. అప్పుడే ప్రపంచ చారిత్రక, పర్యాటక పటంలో తెలంగాణ సరైన స్థానం పొందుతుంది.

సిద్ధ నాగార్జునుడి రసవిద్యా కేంద్రం
రసవిద్య అంటే పాదరసం, సీసము వంటి లోహాల్ని బంగారంగా మార్చడం. అంతేకాదు వివిధ మూలకాలు, లోహాలు, రసాయనాలతో రోగాలను నయం చేసే వైద్య విధానం. భారతదేశంలో రసవిద్యకు ఆద్యుడు అని చెప్పుకొనే సిద్ధ నాగార్జునుడు ఈ ఏలేశ్వరంలోనే తన ప్రయోగశాలను నెలకొల్పాడని భావించేందుకు కావాల్సిన ఆధారాలు తవ్వకాల్లో దొరికినాయని వి.వి.కృష్ణశాస్త్రి ప్రస్తావించారు.

ఏలేశ్వరంలోని ఏలేశ్వర స్వామి, మాధవస్వామి ఆలయాలకు నైరుతి దిశలో ఒక కోట వంటి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో మధ్య యుగానికి చెందిన కుండలు, పెద్ద ఎత్తున కర్ర బొగ్గు, వైద్యానికి ఉపయోగించే గురుగులు వాటిలో బూడిద.. ఇలా ఎన్నో అవశేషాలు, వస్తువులు దొరికినయి. దురదృష్టవశాత్తు ఆ ఆధారాలను ఎక్కడా భద్రపరచ లేదు. తాను చేసిన ప్రయోగాలన్నీ సిద్ధ నాగార్జునుడు ‘రసేంద్ర మంగళం’ అనే గ్రంథం ద్వారా ప్రపంచానికి అందించాడు. నాగార్జునుడి పేరుతో వేర్వేరు కాలాల్లో ఉన్న నలుగురు ప్రముఖ నాగార్జునుల్లో సిద్ధ నాగార్జునుడు నాలుగోవాడు, 13వ శతాబ్దానికి చెందినవాడని చరిత్రకారుల భావన.

డా. ఎం.ఏ. శ్రీనివాసన్‌
81069 35000

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement