e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home ఎడిట్‌ పేజీ ఊపిరి పీల్చుకున్న అమెరికా

ఊపిరి పీల్చుకున్న అమెరికా

ఊపిరి పీల్చుకున్న అమెరికా

అమెరికా స్వేచ్ఛా విగ్రహం సాక్షిగా జాత్యహంకారానికి తావులేదని ఫ్లాయిడ్‌ కేసులో స్థానిక కోర్టు తీర్పుచెప్పింది. ఆఫ్రో అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ను అత్యంత కర్కశంగా మోకాలుతో మెడను తొమ్మిది నిమిషాల పాటు అదిమిపట్టి ప్రాణాలు తీసిన పోలీస్‌ అధికారి డెరిక్‌ చౌనిన్‌ను దోషిగా తేల్చింది. నేరస్థునికి అమెరికా చట్టాల ప్రకారం కనీసం 40 ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. కోర్టు బయట తీర్పుకోసం ఎదురుచూస్తున్న వందల మంది ఫ్లాయిడ్‌ అభిమానులు ‘ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆరుగురు నల్లజాతి వారు, ఆరుగురు తెల్లజాతివారితో కూడిన జ్యూరీ ఈ తీర్పును వెల్లడించటం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ తీర్పు నేపథ్యంలో ‘అమెరికా సమన్యాయం తలెత్తుకొని నిలిచింది’ అని అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించటం గమనార్హం.

ఫ్లాయిడ్‌ ఉదంతంపై తీర్పు వెలువడుతున్న సమయంలోనే ఓహియోలో ఓ పదహరేండ్ల నల్లజాతి అమ్మాయిని పోలీసులు కాల్చిచంపారు. ఇది యాదృచ్ఛికమే అయినా, అమెరికాలో కొనసాగుతున్న వర్ణ వివక్షకు తార్కాణంగా చెప్పవచ్చు. ఇదే తరహాలో 2014లో మైఖేల్‌ బ్రౌన్‌, తమిర్‌ రైస్‌, గతేడాది బ్రియోనా టేలర్‌ సాయుధులైన పోలీసుల చేతిలో ప్రాణాలు వదిలారు. గత ఆరేండ్లలో 135 మంది నల్లజాతీయులు పోలీసుల చేతిలో హతులయ్యారు. కాల్పులకు తెగబడినవారిలో అత్యధిక శాతం శ్వేతజాతి అధికారులే కావటం కాకతాళీయమని సమాధానపర్చుకోలేం. అమెరికా సమాజంలో విద్వేష సంస్కృతి ఇంకా పెచ్చరిల్లుతున్నదనడానికి నల్లజాతి బాలిక బలికావడమే నిదర్శనం. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా నల్లజాతీయులు అహింసాయుతంగా, అప్పుడప్పుడు ఆగ్రహంగా స్పందిస్తూనే ఉన్నారు.

‘ఫ్లాయిడ్‌ ఉదంతం నల్లజాతీయుల సమస్య కాదు, కొందరి వర్ణాధిక్య సమస్య’ అన్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మాటలు అక్కడి సమాజ స్థితికి అద్దంపడుతున్నాయి. అమెరికాలోని గత ఉదంతాలతో పోలిస్తే బైడెన్‌ హయాంలో వచ్చిన ప్రస్తుత తీర్పు విశిష్టమైనది. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో ఆరోపణలను ఉపసంహరించుకోవడం జరుగుతుంది. మధ్యవర్తుల ప్రమేయంతో సివిల్‌ ఒప్పందాలతో కోర్టు బయటే కేసులు పరిష్కారమవుతాయి. సివిల్‌ పరిష్కారాల్లో సహజంగా ఉండే ఆధిపత్యం ఎవరిపక్షమో అర్థం చేసుకోలేనిది కాదు. బైడెన్‌ గెలుపు మాదిరిగానే ఫ్లాయిడ్‌ ఉదంతంలో తీర్పు కూడా భిన్నత్వాన్ని గౌరవించే సంస్కృతికి అద్దం పడుతున్నది. తాజా తీర్పు నల్లజాతి ప్రజలకు ఊరటను ఇవ్వడమే కాదు, సామరస్య సంస్కృతిని పెంపొందించే ప్రయత్నాలకు స్ఫూర్తిదాయకమవుతుంది. వర్ణవివక్షను రూపుమాపడానికి అహింసాయుత సుదీర్ఘ ఉద్యమం అవసరం. ఇందుకు శ్వేతజాతిలోని ఉదారవాదులు ముందడుగు వేయాలి.

Advertisement
ఊపిరి పీల్చుకున్న అమెరికా
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement