e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఎడిట్‌ పేజీ ఈ ప్రేమ నాడు ఏమైంది?

ఈ ప్రేమ నాడు ఏమైంది?

ఈ ప్రేమ నాడు ఏమైంది?

తెలంగాణలో పార్టీ పెట్టేందుకు షర్మిలతో సహా ఎవరికైనా హక్కు ఉంటుంది. కాని ఆ దిశలో మొట్టమొదటి కార్యక్రమమే అబద్ధాలతో మొదలైతే? ఆమె తమ మొదటి కార్యక్రమంగా ఈ నెల 15 నుంచి ఉద్యోగ సమస్యపై నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు గత శుక్రవారం ఖమ్మంలో ప్రకటించారు. కేసీఆర్‌ ‘ఇంటికో ఉద్యోగం’ ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నది తన ఆరోపణ.ముఖ్యమంత్రి ఆ మాట ఎన్నడూ అనకపోయినా అన్నారని వాదించటం అబద్ధం కాదా?

కేసీఆర్‌ ఆ మాట అని ఉంటే షర్మిల అందుకు సంబంధించి ఏదో ఒక రూపంలో రుజువు చూపించాలి. ఇప్పుడు పత్రికలలో, ఛానళ్లలో ప్రతిదీ రికార్డు అవుతున్నది. షర్మిలకు నిజాయితీ ఉంటే అటువంటిది ఏదైనా చూపాలి లేదా కేసీఆర్‌కు క్షమాపణ చెప్పి తన అబద్ధాన్ని ఉపసంహరించుకోవాలి. ఇదేమీ చేయనట్లయితే తను అధికారం కోసం అబద్ధాలు ఆడే వ్యక్తి అని తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. తను అటువంటి రుజువులు ఈ 15 లోగా ప్రజల ముందుంచాలి. లేదా కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలి.

‘ఇంటికో ఉద్యోగం’ అనే మాటపై ప్రతిపక్షాలవారు, విమర్శకులు సుమారు ఐదేండ్లుగా రభసను సాగిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో, బయట కూడా పలుమార్లు వివరణ ఇచ్చారు. ఆయన చెప్పినదాని సారాంశం ఈ విధంగా ఉంది:-తను ఆ మాట ఎన్నడూ అనలేదు. అని ఉంటే రుజువు చూపాలి. ఇంటికొక ఉద్యోగం అంటే తెలంగాణలోని కోటి కుటుంబాలకు కోటి ఉద్యోగాలు అవుతాయి. ప్రస్తుతం మూడు లక్షల చిల్లరమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా 97 లక్షల మందిని తీసుకోవలసి వస్తుంది. ఇంటికొక ఉద్యోగం అనేది గతంలో ఉన్నదా? దేశంలో ఎక్కడైనా ఉన్నదా? అసలది సాధ్యమా? మొత్తం బడ్జెట్‌ను అంతా జీతాలకే కేటాయించినా కోటిమందికి జీతాలు ఇవ్వటం వీలవుతుందా? కోటి మంది చేసేందుకు పనులుంటాయా? పిచ్చివాళ్లు తప్ప ఇటువంటి హామీ ఎవరూ ఇవ్వరు.

ముఖ్యమంత్రి ఈ మాటలు ఎన్నిసార్లు వివరించి చెప్పినా గత ఐదేండ్ల కాలంలో ప్రతిపక్షాలు, విమర్శకులు ఎటువంటి రుజువు చూపలేకపోయారు. అదే ఆరోపణను మాత్రం చేస్తూనే పోయారు. దానితో వారి అబద్ధాలు ప్రజలకు అర్థమయ్యాయి. ప్రతిపక్షాలను నమ్మటం మానివేశారు. స్వయంగా విమర్శకులు కూడా ఈ మాటను ఇటీవల తగ్గించారు. కాని షర్మిలకు ఇదంతా తెలిసినట్లు లేదు. అందుకే కావచ్చు పాతబడిన అబద్ధాన్ని మళ్లీ ముందుకుతెచ్చారు. ఈ అంశంపై ఖమ్మంలో తన మాటల తీరును, హావభావాలను గమనించగా, అసలు ఈ అబద్ధాన్ని తను అప్పుడే కొత్తగా కనిపెట్టినట్లు నమ్ముతున్నారని తోచింది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలను నమ్మించవచ్చుననేది గోబెల్స్‌ సూత్రమని అందరికీ తెలుసు. కాని ఈ నిర్దిష్టమైన గోబెల్స్‌ ప్రచారంలో అందరూ ఇప్పటికే విఫలమైన తర్వాత, తన సరికొత్త గోబెల్స్‌ అవతారం సఫలం కాగలదని షర్మిల ఆశించటం అమాయకత్వమవుతుంది. చంద్రబాబు పెత్తందారీతనం అంతమైన సమయానికి ఈమె సరికొత్త ఆంధ్రా పెత్తందారుగా అవతరించజూస్తున్నారు.

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి సమస్యలున్న మాట నిజం. ప్రభుత్వంలో అనేక నియామకాలు జరిగినా, ప్రభుత్వం సాధించిన అభివృద్ధి వల్ల వ్యవసాయం ఆర్థిక, ప్రైవేట్‌, స్వయం ఉపాధి రంగాలలో అనేక అవకాశాల సృష్టి జరుగుతున్నప్పటికీ ఉపాధి సమస్యలు ఉండటాన్ని కాదనలేము. వీటన్నింటిని గుర్తిస్తూ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే ఆక్షేపించవలసింది ఉండదు. కాని అందుకు అబద్ధాలను ఆధారం చేసుకోవాలా? మరొక అబద్ధాన్ని చూడండి. రైతులకు ఉచిత విద్యుత్‌ తన తండ్రి ఇచ్చారన్నారామె. తొమ్మిది గంటలని చెప్పి నాలుగు గంటలే ఇవ్వటం, అది కూడా పలు విడుతలలో ఇవ్వటం ఏ అపరాత్రి వస్తుందో తెలియక వెళ్లే రైతులు పాము కాట్లతో చావటం, లో ఓల్టేజ్‌తో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలటం, పరిశ్రమలకు పవర్‌ హాలీడేలు, ఇళ్లూ వ్యాపారాలకు జనరేటర్లు, యూపీఎస్‌లు ఆమెకు తెలియదా? అప్పటికి, ఇప్పటికి తేడాలు తెలియవా?

షర్మిల నిజాయితీతో కూడిన రాజకీయం చేస్తే గౌరవనీయత ఏర్పడుతుంది. కానీ అధికారం కోసం అబద్ధాలు చెప్పటం, తప్పుదారి పట్టించి రెచ్చగొట్టజూడటం తగిన పని కాదు. ఆమె ఖమ్మం ప్రసంగంలో ఇంకా అనేక అబద్ధాలున్నాయి. తెలంగాణ ఉద్యమ విషయంలో తన తండ్రికి గల బ్లాక్‌ రికార్డునంతా కప్పిపెట్టారామె. తను తెలంగాణ బిడ్డనే అని ఇప్పుడు ప్రకటించుకుంటున్న ఆమె, ఉద్యమకాలంలో వందలాది బిడ్డలు చనిపోయినప్పుడు మొసలికన్నీరు అయినా ఎందుకు కార్చలేదో చెప్పాలి. బలహీనవర్గాలు నిరుద్యోగ యువకులు విప్లవోద్యమాలలో చేరగా తన తండ్రి ప్రభుత్వం వారిని పిట్టల వలె ఎందుకు కాల్పించిందో చెప్పాలి. రాజన్న రాజ్యంలో మంచి ఏదైనా జరిగితే తప్పక చెప్పవచ్చు. కాని అందుకు అనేక రెట్లు జరిగిన చెడును తెలంగాణ ప్రజలు మరవలేదని, అదంతా ఎదురు తిరుగుతుందని కూడా గుర్తుంచుకోవాలి. లేనట్లయితే, మరణించిన తన తండ్రిని ఇన్నేళ్లకు తిరిగి బరిలోకి లాగి బద్నాం చేసినవారవుతారు. తన అధికారం కోసం ఆయనను పావుగా మార్చితే అది చెల్లని చదరంగ క్రీడ అవుతుంది.

తెలంగాణ ప్రజలకు రాయలసీమ ముఠాల భూమి కబ్జాలు, గుండాగిరీలు బాగా తెలిసినవే. ఇప్పుడు షర్మిల అసలు తెలంగాణనే కబ్జా చేయాలని కలలు కంటున్నారు. ఆంధ్ర ధనికవర్గాల పెత్తనం, దోపిడీపై 55 సంవత్సరాలు పోరాడి ఊపిర్లు తీసుకుంటున్న ఇక్కడి ప్రజలు మరొకసారి పరాయి పెత్తనాన్ని ఎందుకు స్వాగతించాలో షర్మిల చెప్పాలి. అయినా ఆమె తన అమితమైన ప్రేమను వెనుకబడిన రాయలసీమపై కురిపించకపోవటం ఒక విచిత్రం.

-టంకశాల అశోక్

Advertisement
ఈ ప్రేమ నాడు ఏమైంది?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement