e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home ఎడిట్‌ పేజీ ఈటల బీసీవాదం బూటకం

ఈటల బీసీవాదం బూటకం

ఈటల బీసీవాదం బూటకం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నది. ఇది గిట్టని కొందరు రెండేండ్ల నుంచే కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. చాపకింద నీరులా అసమ్మతివాదులను కూడగట్టే ప్రయత్నంలో ఈటల ఉన్నాడనేది నిజం. రెండోసారి కూడా మంత్రి పదవి పొందిన ఈటల అధిష్ఠానాన్ని ఇబ్బంది పెట్టడానికి కుయుక్తులు పన్నారు.

‘గులాబీ జెండాకు ఓనర్‌ను నేనే’ అని ప్రగల్భాలు పలికినా సీఎం కేసీఆర్‌ సహనంతో వ్యవహరించారు. నిజానికి టీఆర్‌ఎస్‌ పార్టీలో ఈటలకు దక్కిన గౌరవం ఎవ్వరికీ దక్కలేదు. ఇది బడుగులకు ఇచ్చిన అరుదైన గౌరవంగానే భావించాలి. భూ కబ్జాలు బయటపడటంతో ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించాల్సి వచ్చింది. అంతే తప్ప ఆయనపై వ్యక్తిగత కక్షతో కాదు. ఎప్పుడూ లేని బీసీ వాదాన్ని ఈటల ఇప్పుడు ఎత్తుకోవడం అవకాశవాదమే. మంత్రిగా పనిచేసిన ఈ ఏడేండ్లలో ఆయన బీసీలకు చేసిందేమీ లేదు. తాను బీసీగా వ్యవహరించింది లేదు. మంత్రి పదవి ఊడిపోగానే తాను బీసీ అన్న విషయం గుర్తుకురావడం విడ్డూరం!

- Advertisement -

సీఎం కేసీఆర్‌ చొరవతోనే 2004లో టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా ఈటల ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏడేండ్ల పాటు మంత్రి పదవి అనుభవించారు. పదవి ప్రజాసేవ చేయటం కోసమే. కానీ, ఈటల తన కోళ్ల ఫారాల అభివృద్ధి కోసం అసైన్డ్‌ భూములు తనఖా పెట్టి వందల కోట్లకు ఎసరు పెట్టారు. ఇది చాలదన్నట్టు ప్రభుత్వ అసైన్డ్‌ భూములు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల భూములు కబ్జా చేసి, కారుచౌకగా కొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. పేదల భూములు సొంతం చేసుకుంటున్నప్పుడు ఈటలకున్న అభ్యుదయ భావాలు ఏమయ్యాయి?

తన అక్రమ ఆస్తులు ఎక్కడ ప్రభుత్వపరమవుతాయో అనే భయంతో ఇప్పుడు బీసీ కార్డు వాడుతున్నరు. ఇది కాదా అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠ? బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన జ్యోతిరావుఫూలేను స్ఫూర్తిగా తీసుకున్న సీఎం కేసీఆర్‌ గ్రామీణ కులవృత్తులకు వెన్నదన్నుగా నిలిచారు. వృత్తులు పూర్వవైభవాన్ని పొందడానికి, జీవన ప్రమాణాల పెంపునకు అండగా నిలిచారు. గ్రామీణ జీవన సౌందర్యాన్ని, ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకువెళ్లే విధానాలు, వ్యూహాలు, ప్రణాళికల్లో ఆదర్శంగా నిలిచారు. కుల వృత్తులకు చేయూత ఇవ్వడమంటే బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడమే.

బండా ప్రకాశ్‌, బడుగుల లింగయ్య, బస్వరాజు సారయ్య తదితరులకు ఉన్నత పదవులిచ్చి అక్కున చేర్చుకున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాల్లో సింహభాగం లబ్ధి పొందేది బీసీలే. బీసీ వర్గాలకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ను నవతరం ఫూలే అనకుండా ఉండగలమా? టీఆర్‌ఎస్‌తోనే బీసీల సాధికారత సాధ్యమైందనేది నిర్వివాదాంశం.

రాష్ట్రంలో పార్టీలేవీ అందుకోనంత ఎత్తుకు గులాబీ జెండా ఎదిగింది. సమీప భవిష్యత్తులో ఇంకే పార్టీ పోటీపడే అవకాశం లేనంతగా బలపడింది. సబ్బండ వర్గాలకు గులాబీ జెండా నీడైంది. అందుకే ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే ఉంటున్నారు. ముఖ్యమంత్రి దూరదృష్టి పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఈటల లాంటివారు ఎవరితో చేతులు కలిపినా.. ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు వేసినా ఆ నాటకీయత తెలంగాణ గడ్డమీద చెల్లదు.
(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఫూలే ఆశయ సాధన సమితి)

డాక్టర్‌ సంగని మల్లేశ్వర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈటల బీసీవాదం బూటకం
ఈటల బీసీవాదం బూటకం
ఈటల బీసీవాదం బూటకం

ట్రెండింగ్‌

Advertisement