e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home ఎడిట్‌ పేజీ ఆత్మవంచనగా మారిన ఆత్మగౌరవం

ఆత్మవంచనగా మారిన ఆత్మగౌరవం

ఆత్మవంచనగా మారిన ఆత్మగౌరవం

ఆత్మగౌరవం పేరుతో ఇన్ని రోజులు ఊరేగిన ఆస్తులరక్షణ పోరాటం నేడు నయా లౌకిక
వాదమై మతవాదుల పంచన చేరింది. తన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని మరిచి ఆత్మరక్షణగా మారిన కుహనా ఆత్మగౌరవానికి పరాభవం తప్పదని ప్రజాస్వామికవాదుల అభిమతం. సహజంగానే ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు, సామాజిక పోరాటాలకు చైతన్యానికి నెలవైన తెలంగాణలో కుల, మత జాడ్యాల పట్ల ప్రజలు ఆసక్తి చూపరు. తెలంగాణ సంస్కృతిలోనే మత సామరస్యం ఉన్నది. ప్రజలు సామరస్యంగా అన్నదమ్ముల వలె కలసిమెలసి జీవనం సాగిస్తారు. అందుకే ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రాజకీయ అస్తిత్వం కోసం యత్నిస్తున్న మతోన్మాద ఫాసిస్టు శక్తులకు ఏనాడూ ఆదరణ లభించలేదు. ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజల విశ్వాసాన్ని చూరగొన లేకపోయారు. ఇటీవలికాలంలో వారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసినా వారి ఉనికి తాత్కాలికమేనని తదనంతర పరిణామాలు నిరూపించాయి.

రాష్ట్రంలో తాజా రాజకీయపరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకొని రాజకీయంగా లబ్ధిపొందాలని భావిస్తున్నప్పటికీ, వారికి పెద్దగా ప్రయోజనం చేకూరదని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రి గా కొనసాగుతూ, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం మూలంగా మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ ఉద్వాసనకు గురయ్యారు. మొదట లౌకిక, ప్రజాస్వామికవాదిగా ఉండి ఇప్పుడు వామపక్ష భావజాలానికి తిలోదకాలిచ్చి పూర్తి గా విరుద్ధమైన మతతత్వ భావజాలం వైపు అడుగులు వేయడం ప్రజాస్వామికవాదులను విస్మయానికి గురిచేస్తున్నది. ఆయన పట్ల ఒకింత వ్యతిరేకతను కూడగడుతున్నది.

- Advertisement -

తాను కమ్యూనిస్టును, లౌకికవాదినని చెప్పుకొనే ఈటల తన ఆచరణలో ఆ భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా ఇతరుల హక్కులను హరిస్తూ వ్యక్తిగతంగా లబ్ధిపొందారు. తాను ప్రచారం చేసుకుంటున్న సామాజిక కోణంలో సైతం సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు చివరకు మతవాదులతో అంటకాగుతూ కూడా తనది లౌకికవాద, కమ్యూనిస్టు డీఎన్‌ఏ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నది. ఇవన్నీ ఆయన రాజకీయ అవకాశవాదానికి, వ్యక్తిగత స్వార్థానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

రాష్ర్టాల హక్కులను కేంద్రంలోని బీజేపీ హరిస్తున్నదని, రైతుల ప్రయోజనాలను తాకట్టుపెట్టి నల్ల చట్టాలు తీసుకువచ్చిందని ఎన్నో సందర్భాల్లో విమర్శించిన ఈటల ఇవ్వాళ అదే పార్టీలో చేరడం భావదారిద్య్రం. ఆయనకు కొంతమంది వంతపాడటం అనైతికం.బీజేపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో పేద ప్రజలజీవనం దుర్భరంగా మారింది. సగటు మనిషి మూడు పూటలా తిండి తినలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ,గ్యాస్‌ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం సామాన్యుని జీవనం పట్ల బీజేపీ ప్రభుత్వ చిత్తశుద్ధి లేని తనానికి తార్కాణం. వారికి కుబేరుల ప్రయోజనాలే తప్ప పేదల ప్రయోజనాలు పట్టవని తేలిపోతున్నది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎండ ను,వానను, కరోనా విపత్కర పరిస్థితులను కూడా లెక్కచేయకుండా రైతులు గత కొన్ని నెలలుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. అయినా వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిపై ఉక్కుపాదం మోపడం బీజేపీ రైతు వ్యతిరేక వైఖరిని చెప్తున్నది.

ముందుచూపు లేకుండా దేశంలో తయారైన వాక్సిన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల నేడు మనకే వ్యాక్సిన్‌ దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రపంచం ముందు భారత్‌ అచేతనంగా నిలబడే దుస్థితి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే కాకుండా యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలను దూరం చేస్తున్నది. భావితరాల భవిష్యత్తుని అంధకారంగా మారుస్తున్నది. కేంద్రం అవలంబిస్తున్న అసమర్థ విధానాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతున్నది. అభివృద్ధిలో దేశం తిరోగమనం దిశగా పయనిస్తున్నది. మోదీ ప్రభుత్వం బాధ్యతలను మరిచి, కేవలం భావోద్వేగాలతో ప్రజాకంటక పాలనను కొనసాగిస్తూ అట్టడుగు వర్గాల ప్రజల హక్కులను కాల రాస్తున్నది. పేద వర్గాల ప్రజల ఆశలను, ఆశయాలను బుగ్గిపాలు చేస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది. బలహీన వర్గాల బిడ్డనని చెప్పుకొంటున్న ఈటల వారి హక్కులను హరిస్తున్న పాలకుల పంచన చేరడం పచ్చి అవకాశవాదం, దివాలాకోరుతనం. ఇలాంటి అవకాశవాద రాజకీయులను సమా జం క్షమించదు. చివరికి వారి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది.

-కొనుకటి ప్రశాంత్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆత్మవంచనగా మారిన ఆత్మగౌరవం
ఆత్మవంచనగా మారిన ఆత్మగౌరవం
ఆత్మవంచనగా మారిన ఆత్మగౌరవం

ట్రెండింగ్‌

Advertisement