e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home ఎడిట్‌ పేజీ అతని భాష అగ్ని శ్వాస

అతని భాష అగ్ని శ్వాస

తెలంగాణకు చెందిన నిఖిలేశ్వర్‌ దిగంబర, విప్లవ కవిత్వోద్యమ రథ సారథుల్లో ఒకరు. 82 ఏండ్ల ఆయన జీవిత ప్రస్థానం, తెలుగు సాహిత్య ప్రస్థానంతో ముడిపడి వుంది. ఆయన సాగించిన నిరంతర సాహిత్య ప్రయాణానికి గుర్తింపుగా 2020 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికచేశారు. ‘అగ్నిశ్వాస’ కవితా సంకలనానికి ఈ పురస్కారం లభించింది. ‘ఏనాటికైనా ఈ అగ్నిశ్వాస నా అంతరంగ భాష, శ్రమ జీవన పోరాటాల శ్వాస’ అని ఆ సంకలనం ముందుమాటలో ఆయన రాసుకున్నారు. ఇప్పటి సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై తన స్పందనను ఈ కవిత్వంలో బలంగా వినిపించారు. 

అతని భాష అగ్ని శ్వాస

‘నిఖిలేశ్వర్‌’ తెలుగు వచన కవిత్వంలో సంచలన దిగంబర కవి. నిఖిలేశ్వర్‌ ఆయన కలం పేరు. అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ఆయనది యాదాద్రి భువనగిరి జిల్లా వీరవల్లి గ్రామం. 1965లో దిగంబర కవుల్లో ఒకరుగా కుంభం యాదవరెడ్డి ‘నిఖిలేశ్వర్‌’ అనే పేరుతో అవతరించాడు. కొత్త పేర్లతో, కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ కవితారంగంలోకి దిగంబర కవులు అడుగుపెట్టారు. సంప్రదాయ కవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చిన ‘దిగంబర కవిత్వం’ ఆనాటి సమాజానికి ఒక షాక్‌ట్రీట్‌మెంట్‌. నిజ స్వరూపంతో సొంత ఆత్మలలోంచి పలకటమే దిగంబర కవిత్వం. ‘మేం మేంగా మాట్లాడదలచుకున్నాం’ అన్నది దిగంబర కవుల ప్రకటన. దిగంబర కవిత్వం మొదటి సంపుటిలోని మొదటి కవిత నిఖిలేశ్వర్‌దే.

‘ఆత్మ యోని’ కవిత ద్వారా కొత్త దిగంబర కవిగా అవతరించిన నిఖిలేశ్వర్‌, ఆ కవిత్వ పదునును ఇప్పటిదాకా కొనసాగిస్తున్నారు. ‘అధికారాన్ని ఔపోసన పట్టినవాడా, ఎన్నడైనా గుడిసె గడప ముందు ప్రశాంతంగా, నిద్రించిన శవాన్ని చూసావా? మనసు మమత రాగాలలో, ఒయాసిస్సు కన్నీళ్ళతో నిండిందని తెలిసిందా?’ అంటూ, నిక్కచ్చిగా ప్రశ్నించాడు నిఖిలేశ్వర్‌. 1965ల నుంచి 1969 దాకా సాగిన దిగంబర కవిత్వోద్యమంలో- నిఖిలేశ్వర్‌ది బలమైన గొంతుక. 1965లో ఆరుగురు దిగంబర కవులలో ఒకరిగా కవితాసృజన ప్రారంభించిన ఆయన 1970లో విప్లవ రచయితల సంఘంలో చేరారు. విరసం కార్యదర్శిగానూ పనిచేశారు.

నిఖిలేశ్వర్‌ ఇప్పటివరకు- మండుతున్న తరం, యుగస్వరం, కాలాన్ని అధిగమించి, నాలుగు శతాబ్దాల సాక్షిగా నా మహా నగరం, జ్ఞాపకాల కొండ, ఖండాంతరాల మీదుగా, నిఖిలేశ్వర్‌ కవిత్వం, అగ్నిశ్వాస, లైఫ్‌- ది ఎడ్జ్‌ ఆఫ్‌ ది నైఫ్‌, ఇతిహాస్‌కే మోడ్‌ పర్‌ మొదలైన పుస్తకాలు తీసుకొచ్చారు. వచనం రాయడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. ‘గోడల వెనుక, ఎవరిదీ ప్రజాస్వామ్యం, కల్లోల దశాబ్దంలో శ్రీశ్రీ, కవితా శోధన, కల్లోల కథలు, ఆవహించిన అక్షరం, మేము చూసిన జన చైనా’ మొదలగు పుస్తకాలు ఆయన వచన రచనలు. 

కవి, రచయిత, అనువాదకుడైన నిఖిలేశ్వర్‌ నిరంతరం ప్రవహించే ప్రవాహం. అన్ని మార్పులను స్వీకరించాడు. అస్తిత్వ ఉద్యమాలను, స్త్రీవాద, దళితవాద, ముస్లింవాద ఉద్యమాలను ప్రేమించాడు. ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన సందర్భంగా ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌కు శుభాకాంక్షలు.  తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కవి నిఖిలేశ్వర్‌.

-డాక్టర్‌ పగడాల నాగేందర్‌, 98498 72230

బాలసాహిత్య మార్గదర్శి 

పిల్లలతోనే రచనలు చేయించాలనే తపనతో నిరంతర కృషి చేస్తున్న రచయిత్రి కన్నెగంటి అనసూయ. ‘స్నేహితులు’ రచనకు కేంద్రసాహిత్య అకాడమీ నుంచి బాలసాహితీ పురస్కారానికి ఎంపికైన ఆమె స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామం. బాలసాహిత్యం విస్తృతంగా రాసిన అనసూయ ‘అడవిరాజు ఆదర్శం’, ‘స్నేహితులు’, ‘పెద్దల మాట’ అనే బాలల కథా సంపుటాలు వెలువరించారు. ఆమె రాసిన బాలల నవల ‘చక్రం’, ‘పిచ్చుక’లకు తానా బహుమతి లభించింది. ‘పొడిచేపొద్దు’, ‘కరదీపికలు’ కథా సంపుటాలను వెలువరించారు. బుద్ధిబలం అనే కథ 22 భాషల్లోకి అనువాదమైంది. 

మూసకు భిన్నంగా మానస 

ఎండ్లూరి మానస కథలలో కథా వస్తువు కొత్తది. దళిత క్రైస్తవ స్త్రీల జీవితాలను కథలుగా రాశారు. పైకి కనపడని విషయాలను కథా వస్తువులుగా స్వీకరించారు. ఆమె రాసిన ‘మిళింద’ కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నెల్లూరు జిల్లాకు చెందిన మానస ‘మిళింద’ కథలు 2018లో రాశారు. చర్చిలలో, ఇతర జీవన విధానంలో క్రైస్తవ స్త్రీల జీవన సౌందర్యాన్ని వర్ణిస్తూ గొప్ప కథలు రాశారు ఆమె. విహంగ పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అతని భాష అగ్ని శ్వాస

ట్రెండింగ్‌

Advertisement