శనివారం 28 మార్చి 2020
Editorial - Jan 29, 2020 , 23:18:26

అన్నపూర్ణమ్మ ఆనందబాష్పాలు

అన్నపూర్ణమ్మ ఆనందబాష్పాలు

తనను నమ్ముకున్న తెలంగాణ సబ్బండవర్గాలకు తన శక్తికి మించైనా సరే ఎట్లా మేలు చేయాలె, ఎట్లా వాళ్లను మందిల కలుపాలె, సమాజానికి దూరంగా విసిరివేయబడిన ఈ దళిత బహుజన బిడ్డల ఆత్మగౌరవాన్ని ఎట్లా నిలబెట్టాలె.. అని నిత్యం పరితపించే సీఎం కేసీఆర్‌ సున్నిత మనసును అర్థం చేసుకున్నది అన్నపూర్ణమ్మ. కావట్టే ఆమె హృదయం ద్రవించింది.అట్లా మున్సిపాలిటీలను వేదికగా చేసుకుని అన్నపూర్ణమ్మ వంటి అనేకమందికి అందిన చారిత్రక గౌరవం.. కేసీఆర్‌ దార్శనికతలో భాగమే.

‘మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుం ది..’ అన్నాడో కవి. నిజమే.. ఎంత గొప్పమాట. కొన్ని ఉద్విగ్నభరిత సందర్భాల్లో మాటలు రావు. ఏవో వొకటి రొండు గుర్తుకు వచ్చినా.. ఆ అల్పాక్షరాల ద్వారా అనల్ప భావోద్వేగాన్ని కమ్యునికేట్‌ చేయలేం. రాగయుక్తమైన పాటను ఆశ్రయించడం ద్వారా మాత్రమే మన సు మాటను ఎదుటివారికి చేరవేయగలం అనేది కవి భావన. ఐతే, ఈ విషయాన్ని కవి, వైయక్తిక జీవితాలకు అన్వయించి చెప్పిన సందర్భం అది. కానీ.. ఇప్పుడిప్పుడే స్వయంపాలన కుదురుకుంటున్న తెలంగాణ గడ్డమీద, భావోద్వేగభరితమైన సామాజిక రాజకీయ సందర్భమొకటి వస్తుందనీ, అందులో కూడా మనసుకందని మాటలుంటాయనీ నాటి కవి ఊహించి వుండడు.


 ఆ సందర్భం మాటలకందని భావాలను పోగు చేసుకుంటుందని, కృతజ్ఞతాభావ ప్రకటనకు మాటలు సరిపోవని, కేవలం ఆనందభాష్పాల ద్వారా మాత్రమే ప్రకటించగలమనీ మొన్నటి సూర్యాపేట మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల సందర్భం మీడియా ద్వారా అన్ని మనసులను ఆవహించింది. అయితే సూర్యాపేట ఒక నామవాచకంగానే లేదు, అది సర్వనామమై తెలంగాణ అంతటా వ్యాపించింది. సూర్యాపేట కాన్నే ఆగిపోకుండా.. యావత్‌ మున్సిపాలిటీ ఫలితాల పర్యంతమై యావత్తు తెలంగాణకు ఓ చారిత్రక సందర్భమైంది.

  

సూర్యపేట మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచిన పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ తన గెలుపు వార్త విని ఎగిరి గంతేసింది. ఒక దళిత బిడ్డయిన తాను అంత కఠినమైన ఎన్నికల్లో నిలువడడమే గొప్ప అంటే, తాను గెలిచింది. అదే ఆమె సంతోషానికి కారణం. కానీ, అంతలోనే సంతోషానికి మించిన భావోద్వేగం ఆమె హృదయం నుంచి ఉప్పొంగింది. కౌన్సిలర్‌గా గెలిచిన తాను కలలో కూడా ఊహించని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు ఎంపిక కావ డం అందుకు కారణం. ఇట్లా ఒకటి మీద ఒకటిగా ఊహించని గౌరవం దక్కేసరికి ఆమెకు నోట మాట రాలేదు. మీడియాతో మాట్లాడాలనుకుంటున్న తన హృదయ స్పందన, మాటల రూపంలో కన్నీటి చుక్కలై కనుల కొనుకుల్లోంచి ఆనందబాష్పాలై రాలినై. 


నిజమే మాన్య ముఖ్యమంత్రి మనసును పట్టడం అందరికీ సాధ్యం కాదు. ఆ ఉద్యమ రథసారథి నేటి  బంగారు తెలంగాణ వారథి.. హృదయాంతరాలాల్లో ఎగసిపడే నిత్యం ఓ సంఘర్షణను పెరుమాళ్ల అన్నపూర్ణ పట్టగలిగింది. తనను నమ్ముకున్న తెలంగాణ సబ్బండవర్గాలకు తన శక్తికి మిం చైనా సరే ఎట్లా మేలు చేయాలె, ఎట్లా వాళ్లను మందిల కలుపాలె, సమాజానికి దూరంగా విసిరివేయబడిన ఈ దళిత బహుజన బిడ్డల ఆత్మగౌరవాన్ని ఎట్లా నిలబెట్టాలె.. అని నిత్యం పరితపించే సీఎం కేసీఆర్‌ సున్నిత మనసును అర్థం చేసుకున్నది అన్నపూర్ణమ్మ. కావట్టే ఆమె హృదయం ద్రవించింది. అట్లా మున్సిపాలిటీలను వేదికగా చేసుకుని అన్నపూర్ణమ్మ వంటి అనేకమందికి అందిన చారిత్రక గౌరవం.. కేసీఆర్‌ దార్శనికతలో భాగమే. ఆ దార్శనికత అర్థమైంది పెరుమాళ్ల అన్నపూర్ణమ్మకు. తన గురిం చి అంత దీర్ఘాలోచన చేసిన్రా మన ముఖ్యమంత్రి.. తన గురించి.. మనసులో మొక్కుకున్నది. అంతే మనసెక్కడో ద్రవించింది. కేసీఆర్‌.. ఈ మూడక్షరాలకు కృతజ్జతాపూర్వకంగా మనసు కరిగింది.


తనతో పాటు కన్నీళ్లను తోడుకుంటున్న తమ నాయకుడు మంత్రిగారు జగదీశ్వర్‌ రెడ్డిది అదే పరిస్థితి. నిజమే.. ఏ సమ సమాజాన్నైతే  కలలు కని, కన్నీటిని పంటికింద బిగబట్టి త్యాగాలకోర్చిండో..ఏ సబ్బండవర్గాల కోసమైతే దశాబ్దాల విలువయిన కాలాన్ని సామ్యవాద సమాజం కోసం కరగదీసిండో.. ఆ సమాజం రాలేదు. ఆ ఆశను చంపుకుంటున్న దశలో.. చిగురించిన పచ్చదనం టీఆరెస్‌ పార్టీ. కాలం కర్పూరపు హారతిలా కరిగిపోయిన తెలంగాణ అభ్యుదయ సామాజిక చింతనకు బుద్ధిజీవుల మనసులకు చీకట్లో చిరుదీపమై వెలిగిన వెలుగు రవ్వ కేసీఆర్‌. 


ఆ వెలుగురవ్వ అందించిన చిరుదీపపు వెలుగు, వేనవేల సూర్యకాంతుల జిలుగులు విరజిమ్ముతూ శాంతియుత ఉద్యమాన్ని నడిపి స్వయంపాలనను నిలబెట్టింది. ఊహించిన సంక్షేమాన్ని అభివృద్ధితో పాటు తన సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలను అందించి తెలంగాణ సబ్బండవర్గాల జీవితాల్లో దీపావళి పండుగ తెచ్చింది. ఈ మొత్తం యజ్ఞంలో తానూ ఒక సమిధగా వెలుగుతున్న ఓ భావోద్వేగం ఆవరించింది. ఓ కృతజ్ఞతాభావం అలుముకున్నది. బంగారు తెలంగాణ ఆశల హరివిల్లును నిర్మించేందుకు తనకూ ఓ దిక్కున సుతారిపని అప్పగించిన ఆ కరుణామయుడు సీఎం కేసీఆర్‌ను తానూ తలుచుకున్నడు. కాబట్టే.. అన్నపూర్ణమ్మ మాదిరి జగదీషుని మనసూ సద్దల చెరువు మత్తడోలె అలుగు దునికి ఆనందబాష్పాలను రాల్చింది.


వీరిద్దరి మనసులే కాదు, కాళేశ్వరం బ్యారేజీలు, రిజర్వాయర్లు నిండిన ట్టు.. తెలంగాణ యావత్‌ మనసులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతాభావంతో నిండిపోయినయి. చైర్మన్‌ వంటి పెద్దకుర్చీలకెయ్యి తలకాయ లేవట్టి సూసుడే కానీ వాటిమీద కూసుంటమని ఏనాడు ఊహించని అనేక కులా లు ఇయ్యాల సీఎం కేసీఆర్‌ రాజకీయ దార్శనికతతో పెద్ద కుర్చీమీద ఎక్కికూసోబోతున్నయి. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో పేరుకు మాత్రమే పరిమితమైపోయిన బుడుగ జంగాలు, సఫాయీ కర్మచారీ, పట్కారీ, కమ్మరి, కుమ్మరి, కంసాలి,  నేతకాని వంటి ఎంబీసీ సబ్బండకులాలు ఇవ్వాల చైర్మన్‌ సీట్లో కూర్చోబోతున్నయి అంటే యావ త్‌ తెలంగాణ హృదయం పులకరించింది. తాము కలలు కన్న సామాజిక తెలంగాణకు దారులు పడుతున్నయనే సంతోషంతో తమను తాము ఓదార్చుకున్నవి. తమకు ఇన్నాళ్లూ దూరమైన తమ కాలాన్ని,  ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ.. ముందుకు నడిపిస్తున్న మహాత్మాఫూలే వారసుడు కేసీఆర్‌ను ఆరాధిస్తున్నయ్‌ తెలంగాణ సబ్బండ హృదయాలు.


 పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి మాదిరే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహోన్నత అంతరంగాన్ని అర్థం చేసుకున్న ఒక్కొక్క తెలంగాణ హృదయం.. తెలంగాణ ఏకాత్మగా మారి ఆత్మానందభరితమైంది.. ఆర్ద్రతతో కృతజ్ఞతగా.వ్యక్తిగత జీవితాలు సామాజిక రాజకీయాల నడుమ ఉండే గీతలను చెరిపేసి వాటి నడుమ దడికట్టుకున్న అంతరాలను తుడిచేసి తెలంగాణ గడ్డమీద సమసమాజ భావనకు పచ్చనిమొలకై మొలిసింది కేసీఆర్‌ ప్రభు త్వం. అది దిన దిన ప్రవర్థమానమై మహావృక్షమై తమకు చల్లని నీడ అం దించాలని కోరుకుంటున్నది తెలంగాణ సమాజం. తమకు అన్నిరంగాల్లో అడుగడుగా భద్రతనిస్తూ సుపరిపాలన తద్వారా తమకు సౌకర్యవంతమై న జీవితానికి తోడ్పాటును అందించాలని ఆశిస్తున్నది. అట్లా సీఎం కేసీఆర్‌ మీద సడలని విశ్వాసంతో, యువనేత కేటీఆర్‌ పట్ల పూర్తి నమ్మకంతో తెలంగాణ సమాజం గట్టిగా నిర్ణయించుకున్న ఫలితమే.. తెలంగాణ పట్న పు ప్రజ నిర్ణయం, మున్సిపాలిటీల చారిత్రక విజయం. రేపటి బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సమాజం అందించిన సంపూర్ణ మద్దతే మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు పూరించిన విజయ శంఖారావం.


logo