సోమవారం 30 మార్చి 2020
Editorial - Jan 26, 2020 , 22:52:35

నుమాయిషంటే

నుమాయిషంటే

నుమాయిషే

పర్యాయపదాలుండవు

సమానార్థకాలు లేనేలేవు

నుమాయిషంటే నుమాయిషే..! 

ఎనిమిది దశాబ్దాలకు పైగా

ఏటేటా కొత్త సంవత్సరంతోపాటు

సరికొత్త వస్తువుల మాయాబజార్‌ను వెంటబెట్టుకుని

భాగ్యనగరానికి వచ్చి వాలిపోయే సుందర నందనం!

ఆమడదూరం నుండి లక్‌ టిక్‌ లక్‌ టిక్‌ల స్వాగత సంగీతం

సమీపించగానే లాయిలప్పల బెలూన్ల వెంటాడే కోలాహలం

ఇదో వికసించిన జనసందోహం

విరజిమ్మిన కాంతి సమూహం!

ఇదో అందమైన వస్తు ప్రపంచం

పసందైన వైజ్ఞానిక ప్రభంజనం

యావత్‌ భారతదేశమే మన వాకిట్లో వాలిపోయిన భ్రాంతి

భౌతిక నాగరికతకు మానవుడు కల్పించిన సుందరాకృతి!

కళ్ళముందే కాశ్మీరం శాలువాగా పురులు విప్పుతుంది

కళ్ళు దిప్పితే బెనారస్‌ సిల్కు చీరై కన్నుగీటుతుంది

కంచి నగరం పట్టు చీరై పలకరిస్తుంది

కేరళం ఒక విచిత్ర వస్త్ర విన్యాసమౌతుంది

కొండపల్లి బొమ్మలకు శతకోటి దండాలు

లేపాక్షి సంపదకు లేరెవరు సాటి!

లక్నో లాల్చీ  హర్యానా పైజామా

పంజాబీ చుడీదార్‌  గోద్రా గాగ్రా

జైపూర్‌ గాజులతో జనానా హుషార్‌

జేబులు ఖాళీ అయిన మర్దానా బేజార్‌..!

దశాబ్దాలుగా ఇదొక మధుర సంబరం

నగరం పులకించే నవనవోన్మేష సందర్భం..

ఇప్పుడు..

ఊరికో బిగ్‌బజార్‌.. వాడకో స్పెన్సర్‌..

వీధికో ఐమాక్స్‌.. సిటీకో సెంట్రల్‌.. ఫుడ్‌కోర్ట్‌.. మాక్‌డొనాల్డ్స్‌

చుట్టూతా పరుచుకున్న వస్తు ఖజానా.. గానా బజానా..

ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీగా నజరానా

ఇప్పుడిక ప్రతి ఇల్లూ ఒక నుమాయిషైపోయింది

ప్రతి గదీ ఒక ఇంటీరియల్‌ డెకొరేషన్‌ నమూనాగా మారిపోయింది!

అయినా..

ఏమాటకామాటే

తెలంగాణా నుదుట సింధూరం

భాగ్యనగరి సిగలో మందారం

మత సామరస్య మధుర సంగీతం

మానవతా వ్యక్తీకరణ సందేశం

విస్తృత వస్తు సంస్కృతికి సజీవ సంకేతం నుమాయిష్‌!

నుమాయిషంటే నుమాయిషే!!

- ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, 96180 32390


logo